‘యాప్’ వెనుక అలసిన మనిషి బలహీన స్వరం
Smartphones
స్మార్ట్ ఫోన్‌లో ఒక యాప్ తెరుచుకుంటుంది. ఆర్డర్ వస్తుంది. కొన్ని నిమిషాల్లో ఆహారం, మందులు, కిరాణా సామగ్రి ఇంటి గుమ్మానికి చేరతాయి. మరో ‘యాప్’ వాహనం బుక్ చేస్తే డ్రైవర్ ప్రత్యక్షమవుతాడు. నగర జీవితం వేగంగా సాగేందుకు గిగ్ ఆర్థిక వ్యవస్థ కీలకంగా మారింది. కానీ ఈ వేగం వెనుక పరుగులు తీస్తున్న మనిషి జీవితం ఎలా ఉంది? అతని ఆరోగ్యం, భద్రత, పని గంటలు, విశ్రాంతి, సామాజిక భద్రత గురించి మనం ఎంతగా ఆలోచిస్తున్నాం? జనపహల్, గిగ్ వర్కర్స్ అసోసియేషన్ నిర్వహించిన తాజా అధ్యయనం ఈ ప్రశ్నలకు ఆందోళన కలిగించే సమాధానం ఇస్తోంది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ సహా పది నగరాల్లో వివిధ ప్లాట్‌ఫామ్స్ ఆధారిత గిగ్ కార్మికులపై అధ్యయనం చేసిన తర్వాత విడుదల చేసిన నివేదిక ప్రకారం 57 శాతానికి పైగా కార్మికులు వారానికి కనీసం 49 గంటలు పనిచేస్తున్నారు. 23.4 శాతం మంది వారానికి 70 గంటలకు మించి పనిచేస్తున్నారు. అంటే గిగ్ పని ఇక అదనపు ఆదాయం కోసం చేసే తాత్కాలిక పని కాదు. అనేక కుటుంబాలకు అదే ప్రధాన జీవనాధారం. అయితే పూర్తి స్థాయి ఉద్యోగానికి సమానంగా పని చేస్తున్నా, పూర్తి స్థాయి ఉద్యోగికి లభించే హక్కులు, భద్రత మాత్రం వారికి అందడం లేదు. ప్లాట్‌ఫామ్ సంస్థలు గిగ్ కార్మికుడికి స్వేచ్ఛ ఉందని చెబుతాయి. తనకు నచ్చినప్పుడు పని చేయవచ్చని, నచ్చనప్పుడు ఆపివేయవచ్చని అంటాయి. కానీ వాస్తవ జీవితంలో ఆదాయం కోసం ఎక్కువ ఆర్డర్లు తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి డెలివరీ చేయాలి. రేటింగ్ కాపాడుకోవాలి. ప్రోత్సాహకాలు కోల్పోకూడదు. అల్గారిథమ్ నిర్ణయించే పనితీరు ప్రమాణాలను అందుకోవాలి. ఈ ఒత్తిళ్ల మధ్య ‘స్వేచ్ఛా కార్మికుడు’ అనే నిర్వచనం ఎంతవరకు వాస్తవమో ప్రశ్నించాలి. ఆరోగ్య గణాంకాలు ఈ పరిస్థితిని మరింత స్పష్టం చేస్తున్నాయి. 64.5 శాతం మంది అలసట, నిద్రకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. 47.42 శాతం మంది కండరాలు, ఎముకలకు సంబంధించిన నొప్పులతో బాధపడుతున్నారు. 41.08 శాతం మందికి ఒత్తిడి, ఆందోళన ఉన్నాయి. 30 శాతం మందికి కళ్ల సమస్యలు, 26.45 శాతం మందికి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి. గంటల తరబడి బైక్ నడపడం, వాహనాలపై కూర్చోవడం, సరుకులు మోయడం, ట్రాఫిక్‌లో ప్రయాణించడం, ఎండలో పనిచేయడం శరీరంపై నిరంతర ఒత్తిడిని పెంచుతున్నాయి. విశ్రాంతి, తాగునీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక అవసరాల పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది. 53.8 శాతం మంది పని సమయంలో తాగునీటిని సొంత డబ్బుతో కొనుక్కుంటున్నారు. 43.9 శాతం మంది డబ్బులు చెల్లించి టాయిలెట్లను ఉపయోగిస్తున్నారు. 74.6 శాతం మందికి విశ్రాంతి తీసుకునే స్థలం అసలు లేదు. 66.2 శాతం మంది పని సమయంలో అరుదుగా లేదా అసలు విరామం తీసుకోలేకపోతున్నారు. ఈ గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడతాయి. ఒక నగరం తనకు సేవలందించే కార్మికుడికి తాగునీరు, టాయిలెట్, కొన్ని నిమిషాల విశ్రాంతి కూడా ఇవ్వలేకపోతే ఆ నగర అభివృద్ధిని ఏ ప్రమాణంతో కొలవాలి? వాతావరణ మార్పు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. మండుతున్న ఎండలో, ఉక్కపోతలో, భారీ వర్షంలో కూడా డెలివరీ కార్మికుడు రోడ్డుపైనే ఉండాలి. ఇతర రంగాల్లోని ఉద్యోగులకు కార్యాలయ రక్షణ లేదా పని విధానాల్లో మార్పులు సాధ్యమవుతాయి. గిగ్ కార్మికుడికి మాత్రం వాతావరణం అనుకూలించకపోయినా పని ఆపితే ఆదాయం ఆగిపోతుంది. వేడి కారణంగా డీహైడ్రేషన్, అధిక ఉష్ణోగ్రత ప్రభావం, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతున్నా వాటిని వ్యక్తిగత సమస్యలుగా చూడటం ప్రమాదకరం. ఇది వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన అంశం. రోడ్డు ప్రమాదాల గణాంకాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. 66.4 శాతం మంది ద్విచక్ర వాహనాలను పని కోసం ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. 62.2 శాతం మంది ఏదో ఒక రకమైన ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. సుమారు 38 శాతం మంది రహదారి పరిస్థితుల వల్ల గాయపడ్డారు. 27 శాతం మంది ట్రాఫిక్ సంబంధిత ప్రమాదాలను ఎదుర్కొన్నారు. సమయానికి ఆర్డర్ ఇవ్వాలనే ఒత్తిడి, ట్రాఫిక్ రద్దీ, రహదారుల దుస్థితి, రోడ్డు భద్రతా నిబంధనల బలహీన అమలు కలిస్తే ప్రమాదం వ్యక్తిగత తప్పిదంగా మిగలదు. అది వ్యవస్థ వైఫల్యంగా మారుతుంది. ఇక, 59 శాతం మంది కార్మికులకు ఎలాంటి భద్రతా శిక్షణ అందలేదు. బీమా పరిస్థితి మరింత దారుణం. 62 శాతానికి పైగా కార్మికులకు ఆరోగ్య బీమా లేదు. 44.2 శాతం మందికి ప్రమాద బీమా లేదు. ప్రమాదంలో గాయపడిన కార్మికుడు ఆసుపత్రి ఖర్చును భరించలేకపోతే, అతని ‘స్వతంత్ర ఉపాధి’ ఎంతటి భరోసాను ఇస్తుంది? చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడాల్సి వస్తోందని పలువురు కార్మికులు చెప్పడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. గిగ్ వర్కర్ల విధానాన్ని ‘కొత్త తరహా ఉపాధి’గా ప్రభుత్వాలు ముద్రవేసి, ఘనంగా ప్రకటించుకోవడం సిగ్గుచేటు. గిగ్ కార్మికులకు స్పష్టమైన చట్టపరమైన గుర్తింపు, కనీస భద్రతా ప్రమాణాలు, ఆరోగ్య, ప్రమాద బీమా, భద్రతా శిక్షణ, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ, పని సమయంలో విశ్రాంతి, తాగునీరు, పారిశుధ్యం వంటి హక్కులను నిర్ధారించాలి. తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో పని గంటలు, డెలివరీ సమయాలపై మానవీయ నిబంధనలు తీసుకురావాలి. ప్రజా స్థలాలను కూడా పని ప్రదేశాలుగా గుర్తించి పట్టణ ప్రణాళికలో గిగ్ కార్మికుల అవసరాలను చేర్చాలి. గిగ్ వర్కర్లకు పనులను పురమాయించే వివిధ ప్లాట్‌ఫామ్ సంస్థలపైన కూడా కీలక బాధ్యత ఉంది. ‘టెక్నాలజీ కంపెనీలు’ ముద్ర వేసుకొని, శ్రమ బాధ్యత నుంచి తప్పించుకోవడం దుర్మార్గం. కార్మికుడి పనితీరును ఒక సంస్థ అల్గారిథమ్‌తో కొలుస్తున్నప్పుడు, ఆ అల్గారిథమ్ సృష్టించే ఒత్తిళ్లకు కూడా సదరు సంస్థే బాధ్యత వహించాలి. వేగం కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రమాదం జరిగినప్పుడు కార్మికుడిని ఒంటరిగా వదిలేయకూడదు. ఈ మొత్తం అధ్యాయంలో వినియోగదారుడి పాత్రను కూడా విస్మరించలేం. కొన్ని నిమిషాల్లో డెలివరీ రావాలని కోరుకోవడం సులభం. కానీ ఆ కొన్ని నిమిషాల వెనుక ఒక మనిషి మండే ఎండలో, ప్రమాదకరమైన రహదారిపై ప్రయాణిస్తున్నాడనే విషయం గుర్తుండాలి. ఆలస్యానికి దురుసుగా స్పందించడం, తక్కువ రేటింగ్ ఇవ్వడం, ప్రమాదకర పరిస్థితుల్లో కూడా సమయపాలన కోరడం వంటి ప్రవర్తనలు కార్మికుడిపై ఒత్తిడిని పెంచుతాయి. ఇక్కడ, గిగ్ ఆర్థిక వ్యవస్థను అడ్డుకోవడం పరిష్కారం కాదు. సాంకేతికతను వెనక్కి తిప్పడం కూడా సాధ్యం కాదు. కావాల్సిందల్లా బాధ్యతాయుతమైన ప్లాట్‌ఫామ్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే. వినియోగదారుడికి సౌకర్యం పెరిగే కొద్దీ కార్మికుడికి భద్రత పెరగాలి. యాప్ వేగంగా పనిచేసే కొద్దీ కార్మిక హక్కుల అమలు కూడా వేగంగా జరగాలి. గిగ్ కార్మికుడికి దానం అవసరం లేదు. హక్కులు కావాలి. సానుభూతి మాత్రమే కాదు, చట్టపరమైన రక్షణ కావాలి. స్మార్ట్ నగరాలు నిర్మించడం ఎంత ముఖ్యమో, ఆ నగరాలను నడిపించే కార్మికులకు గౌరవప్రదమైన జీవితం కల్పించడం కూడా అంతే ముఖ్యం.