తెలంగాణ నేల తల్లిని విముక్తిచేసిన ప్రజా పోరాటానికి మతం రంగు పులమొద్దు
Telangana Merger Day (1)
కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం మహత్తర సాయుధ పోరాట చరిత్రను చీకటి పొరల్లోకి నెట్టడమే
చరిత్రను వక్రీకరించడం జాతికి ద్రోహం చేయడమే..!
భారత దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న రాగా బ్రిటీష్ వారు కుట్రతో హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఇప్పటి తెలంగాణకు చెందిన ఎనిమిది జిల్లాలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్, గుల్బర్గా, రాయ్‌చూరు జిల్లాలు, మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్, పర్బని, నాంధేడ్, బీడ్, ఒస్మానాబాద్ జిల్లాలు కలిసి ఉండేవి. హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలనే లక్ష్యంతో ఆనాటి ఆంధ్ర మహాసభ అధ్యక్షులు రావి నారాయణరెడ్డి, ఎఐటియుసి అధ్యక్షులు మఖ్దూం మొహిద్దీన్, సిపిఐ తెలంగాణ కార్యదర్శి బద్దం ఎల్లారెడ్డిలు సాయుధ పోరాటానికి పిలుపు నిచ్చారు.
నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్ ప్రభువుల అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా జరిపిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మాతృ భాష కోసం, భూమి కోసం, భుక్తి కోసం మట్టి మనుషులు చేసిన తిరుబాటు; ధిక్కార స్వరం ఆ పిలుపు. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి 1947 సెప్టెంబర్ 11న పిలుపు నివ్వడం, కమ్యూనిస్టులు, పేద ప్రజలు వీరోచితంగా పోరాటం చేయడంతో భూస్వాములు హైద్రాబాద్ లాంటి నగరాలకు పలాయనం చిత్తగించడంతో నిజాం ప్రభుత్వం పూర్తిగా బలహీనపడిపోయి హైద్రాబాద్ సంస్థానం కమ్యూనిస్టులు ఆక్రమిస్తారనే భయంతో అప్పటి నెహ్రు ప్రభుత్వం నిజాం ప్రభువుతో లాలూచిపడటం వలన కేంద్ర సైన్యం కేవల ం మూడు రోజుల్లోనే అనగా 1948 సెప్టెంబర్ 17న హైద్రాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడం జరిగింది. పాలకుడు ముస్లిం అయినందున ఈ పోరాటానికి ముస్లిం వ్యతిరేక పోరాటంగా మతంరంగు పులిమి చరిత్రను వక్రీకరించడమంటే తెలంగాణ జాతి త్యాగాలను, పోరాట గాథలను చీకటిపొరల్లోకి నెట్టివేసి, విషపూరిత మత విద్వేషాలను ఈనాటి తరం మెదడులోకి ఎక్కించడం వలన జాతికి అపకారం జరుగుతుంది తప్పితే ఉన్నత విలువలతో కూడిన నూతన జాతి నిర్మాణం చేసుకోలేము.
సాయుధ పోరాట నేపథ్యం
హైదరాబాద్ సంస్థాన రాజు ముస్లిం అయినప్పటికీ జమీందార్లు, జాగిర్దార్లు, భూస్వాములు ఎక్కువ శాతం హిందువులే. ప్రజలపై, పేదవర్గాలపై విరుచుకుపడి డొడ్డి కొమరయ్యను బలితీసుకున్న 40వేల ఎకరాల భూస్వామి విసునూరి రాంచంద్రారెడ్డి , దౌర్జన్యానికి పరాకాష్ట అయిన దుష్ట మహిళ అతని తల్లి జానకమ్మ హిందువులే కదా. ఆ దాడిలో మరణించిన దొడ్డి కొమరయ్య కూడా హిందువే కదా..?. వరంగల్, నల్గొండ జిల్లాలో 1.50లక్షల ఎకరాలు కలిగినటువంటి జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి గాని, లక్ష ఎకరాలు కలిగిన ఖమ్మం జిల్లాకు చెందిన కల్లూరి ప్రాంత కాళ్ళూరి దొరగాని హిందువులేకదా..?. 5వేలు, 10వేల ఎకరాలు కలిగిన హిందూ భూస్వాములు వందలాదిమంది ఉండేవారు. వీరు నిజాం నవాబుకు గులాములుగా వ్యవహరించడమే గాక నిజాంను మించిన దౌర్జన్యాలతో అనేక మందిని ఊచకోత కోశారు. మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగింపులు చేయడం, బతుకమ్మలు ఆడించడం, మానభంగాలు చేయడం లాంటి క్రూరమైన నేరాలను చేసిన జమీందార్లు, జాగిర్దార్లు, దేశ్‌ముఖ్‌లలో హిందువులున్నారు, ముస్లిములున్నారు. అదే విధంగా నిజాం రాజు ముస్లిం అయినప్పటికీ పేద ముస్లిముల జీవితాలలో ఎటువంటి మార్పులేదు. తెలంగాణలో భూస్వామ్య ముస్లింలు దాదాపు 2000 కుటుంబాలు కాగా పేద ముస్లింలు లక్షలాది మంది ఉన్నారు. అందులో 20 లక్షల మంది హైదరాబాద్ నగరంలో కడుపేదరికంలో ఉండేవారు. ముస్లింలలో తలారి, షేక్ సిందులు, గ్రామసేవకులు, అతి స్వల్ప ఆదాయాలతో మెకానిక్‌లు, హోటళ్లలో పనిచేయడం, పంచర్లు వేయడం, ట్రైలర్లుగా, కూరగాయలు, పండ్లు అమ్ముకొనే వారుగా అతి తక్కువ ఆదాయాలతో కూడిన ముస్లింలు లక్షలాది మంది ఉండేవారు. గ్రామాలలో సెంట్ భూమి కూడా లేని వారు కూడా ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేకమంది ముస్లింలు కూడా చిత్రహింసలకు గురికాబడ్డారు. షేక్ బందగీని విసునూరు రాంచంద్రారెడ్డికి చెందిన గుండాలు చంపివేశారు. ఖాసీంరజ్వీ అనే క్రూరుడు మజ్లీస్ పార్టీని స్థాపించి హైద్రాబాద్‌ను స్వతంత్ర ముస్లిం రాజ్యంగా ప్రకటన చేసి రజాకారుల సైన్యాన్ని ఏర్పాటు చేసి రాక్షసుడిలాగ హిందువులపైన దాడులకు పూనుకోవడం జరిగింది. వ్యతిరేకించిన ముస్లీంలను కూడా నిర్దాక్షిణ్యంగా చంపించాడు. ప్రఖ్యాత జర్నలిస్టు సోయబ్ ఉల్లాఖాన్‌ను హైద్రాబాద్ నడిబజార్లో రజాకార్లు క్రూరంగా చంపారు. ఈనాటి ఖమ్మం జిల్లా ఆనాటి వరంగల్ జిల్లాలో రజబ్ ఆలి లాంటి యోధులు నిజాం రాచరికానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. డాక్టర్ రాజ్‌బహుదూర్ గౌర్తో కలిసి మఖ్దూం మొహియుద్దీన్ ప్రొ॥అల్లంకుంద్ మీరీ, జవ్వాది రజ్వీ,(సాలార్జంగ్ మ్యూజియం ఆనాటి లైబ్రేరియన్) ప్రొ॥ ఖయ్యూంఖాన్ లాంటి అనేక మంది ముస్లీం విద్యావేత్తలు నిజాం రాచరికపాలనకు వ్యతిరేకంగా కామ్రేడ్స్ అసోషియేషన్ ను ఏర్పాటు చేశారు. మహ్మద్ రఫీ ఉస్మానియా యూనివర్శిటీలో నిజాంకు వ్యతిరేకంగా జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. నిజాం వ్యతిరేకపోరాటంలో అగ్రగామిగానున్న అల్లా ఉద్దీన్‌ని నిజాం ముష్కరులు చంపివేయడం జరిగింది. ఇలా ఎంతోమంది ముస్లింలు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. చిత్రహింసలకు, హత్యలకు గురైనారు. సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురిలో మఖ్దూం మొహియుద్దీన్ ప్రఖ్యాత కవి మరియు విప్లవకారుడు.
ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి?
ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పేద రైతాంగం జరిపిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముస్లింల, హిందువుల పోరాటంగా చిత్రీకరించడం చరిత్రను అవమానపర్చడమే. భూమి కోసం, భుక్తి కోసం, దాస్య విముక్తి కోసం చేసిన పోరాటంలో అణగారిన ముస్లిమైనా, హిందువైనా అన్నదమ్ములే. అణిచివేసే ఫ్యూడల్ ప్రభువులు హిందూవైనా, ముస్లిమైనా వారి వర్గం, వర్గస్వభావమొక్కటే. ఇటువంటి మహోజ్వల పోరాట చరిత్రకు మతం రంగు పులమడానికి ఆనాటి పోరాటంలో ఇసుమంత పాత్ర లేని ఆర్ఎస్ఎస్ గానీ, ఈనాటి బిజెపి గానీ తమ మత ఉన్మాదంతో ఓట్ల రాజకీయాల నేపథ్యంలో చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మరియు సంఘ్‌పరివార్‌లు 1925 నుంచి 1947 వరకు ఏనాడూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన లేదు. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్కు కనీస పాత్ర కూడా లేదు. నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై మూడు రంగుల జాతీయ పతాక ఆవిష్కరణకు కూడా 2001 జనవరి 26 వరకు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఏనాడూ అంగీకరించలేదు. మూడు అనే పదం అశుభానికి సంకేతమని మూడు రంగులతో కూడిన జాతీయ జండా దేశానికి అరిష్టమని వాదించారు. అటువంటి ఆర్ఎస్ఎస్, దాని ప్రతినిధి అయిన బిజెపిలు మతాలు, కులాలతో సంబంధం లేకుండా అందరూ ఒక్కటై తమ భూమిని తాము కాపాడుకోవడానికి వెట్టి నుండి విముక్తి కావడానికి చేసిన మహత్తర పోరాటానికి నేడు మతం రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారు. రజాకార్ల దాడుల సందర్భంలో హిందూ పురుషులను ముస్లిం మహిళలు, అలాగే ముస్లిం పురుషులను హిందూ మహిళలు తమ కొంగుచాటున దాచిపెట్టి కన్నతల్లులు బిడ్డలను కాపాడుకున్నట్లుగా కాపాడిన ఘటనలు సాయుధ పోరాటంలో ఉన్నాయి. అన్నదమ్ముల్లా కలిసి అన్ని మతాల వారు జరిపిన వీరోచిత పోరాటానికి మతం రంగు పులిమే ఎవరైన దేశ భక్తులు ఎలా అవుతారు? ముస్లిం రాజు అయిన నిజాం నవాబు రాజ్యాన్ని పటేల్ సైన్యం ఓడించి విమోచన చేసినట్లుగా వాదనను చేస్తూ ఈ పోరాటాన్ని ముస్లీం రాజుకు, హిందూ ప్రజలకు జరిగిన పోరాటంగా చిత్రీకరించడానికి బిజెపి ప్రయత్నిస్తున్నది. ప్రజాకంఠకుడైన ఒక రాజును యుద్ధంలో ఓడిస్తే అతనిని యుద్ధ ఖైదీగా చూడాలి. అలా గాకుండా నిజాం నవాబుకు రాజప్రముఖ్‌గా హోదా కల్పించడంతోపాటు సంవత్సరానికి కోటి రూపాయల రాజభరణాన్ని ఇస్తూ పటేల్ సైన్యం నిజాం రాజుతో ఒప్పందం చేసుకున్నది. వేలాది మందిని ఊచకోతకోసిన రజాకర్ల నాయకుడైనటువంటి ఖాసీం రజ్వీని పాకిస్తాన్‌కి వెళ్ళిపోయే విధంగా అనుమతించడం లాంటి పరిణామాలు నిజాం రాజు, నెహ్రూ సైన్యం కుమ్మక్కు అయిన్నట్లుగా సూచిస్తున్నాయి. అటువంటప్పుడు యుద్ధం జరిపి విమోచన జరిగినట్లు ఎలా బిజెపి వాళ్ళు పేర్కొంటారు. గాంధీజీని హత్యచేసిన ఆర్ఎస్ఎస్ను నిషేధించిన సర్దార్ వల్లభాయి పటేల్‌ను కూడా బిజెపి హైజాక్ చేస్తున్నది.
మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్య్రోద్యమాన్ని కీలక మలుపు తిప్పింది. ప్రాణాలు అర్పణ చేసిన 4000 మంది కమ్యూనిస్టులు తమ రక్తంతో తెలంగాణ నేలను ఎర్ర నేలగా మార్చి త్యాగాల అక్షరాలతో చరిత్రలో లిఖించబడ్డారు. మట్టి మనుషుల్ని మహావీరులుగా తయారు చేసిన పోరాటం అది. ఆ పోరాటాల వారసత్వం, దానిగాథలు ఈ నాటికి ఏ గ్రామం వెళ్లినా వినపడతాయి..కనబడతాయి. ఆ తరంలోదాశరధి, మఖ్దూం మోహియుద్ధీన్, సుద్దాల హనుమంతు లాంటి మహాకవులకు, ఈతరంలో గద్దర్ లాంటి ప్రజా కళాకారులకు, వేలాది మంది వీరులకు జన్మనిచ్చిన ఉద్యమమిది. ప్రశ్నించే, తిరగబడే తత్వాన్ని తెలంగాణాకు అందించింది. భారతదేశంలో విప్లవాల పురిటిగడ్డ అనగానే తెలంగాణ ముందు వరుసలో ఉంటుంది. సంగీతం నేర్చుకోకపోయినా, సాహిత్యం చదవక పోయినా మట్టి మనుషుల పోరాటాల నుంచి వేలమంది ప్రజా కవులు, ప్రజాగాయకులకు ఈనాటికి జన్మనిస్తున్న విప్లవ మాత మనతెలంగాణ.
నిజాం రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించడానికి సాగుతున్న రైతాంగ పోరాటాన్ని నివారించడానికి భారత యూనియన్ సైన్యాలు1948 సెప్టెంబరు 13న హైదరాబాద్ చేరుకోవడం, సెప్టెంబర్ 17న విలీనం చేస్తున్నట్లు నవాబు ప్రకటించడం జరిగింది. అయితే, అప్పటి వరకు స్వాతంత్య్రం కోసం ప్రజలను సమాయత్త పరిచి, సంస్థాన విలీన ప్రక్రియను సులభతరం చేసిన కమ్యూనిస్టులపైనే నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తుపాకులు ఎక్కుపెట్టించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన 4000 మందిలో తెలంగాణ విలీనానికి ముందు అతికొద్ధిమంది కమ్యూనిస్టులు చనిపోగా విలీనం తరువాత కాంగ్రెస్ నాయకత్వంలోని పటేల్ సైన్యం చేతుల్లో దాదాపు 3000 మందికి పైగా చంపబడ్డారు. కుచ్చుటోపిలు ధరించిన దొరలు ఖద్దర్ టోపీలతో కొత్త అవతారాలతో తిరిగి గ్రామాలలో ప్రవేశించారు. కమ్యూనిస్టులు పేదలకు పంచిన 10 లక్షల ఎకరాల భూములను భూస్వాములకు తిరిగి అప్పజెప్పడానికి, కమ్యూనిస్టుల ఊచకోతకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని కొనసాగించింది. చివరకు పలు కోణాలలో చర్చించి 1951 మేలో దానిని విరమించింది.
1952 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కమ్యూనిస్టు పార్టీ విజయాలుః
1952 నాటికి సిపిఐ నాయకులు ఎక్కువ మంది జైళ్లలో ఉండటం వలన, ఓటర్ లిస్టులో పేర్లు నమోదు కానందువలన అభ్యర్థులు దొరకని కారణంతో అన్ని స్థానాలకు పోటీ చేయలేకపోయాం. అప్పటికీ పార్టీపైన నిషేదం తొలగలేదు. దాని వలన పిడిఎఫ్ (పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్) పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టు పార్టీకి 36 సీట్లు రాగా, అన్ని స్థానాలలో పోటీ చేసిన కాంగ్రెస్‌కు కేవలం 38 స్థానాలు మాత్రమే రావడం జరిగింది. అలాగే ఆనాడు ఆంధ్రప్రదేశ్ అనగా ఆంధ్ర, రాయలసీమ మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. ఇటు తెలంగాణ ఉద్యమం ప్రభావం అటు ఆంధ్రప్రదేశ్‌లోని కమ్యూనిస్టు స్పూర్తితో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో సిపిఐ అత్యధికంగా 49 స్థానాలను గెలుపొందడం, కాంగ్రెస్ 47 స్థానాలకు కుదించడం జరిగింది. ఆ విధంగా 1952లో మద్రాస్ రాష్ట్రంలో తెలుగు ప్రాంతమైన ఆంధ్రలో సిపిఐ అత్యధిక స్థానాలు పొందింది. సిపిఐ మొదటిసారి అధికారంలోకి వచ్చే అవకాశం కలిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కలుపుకోని రాజగోపాలచారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడం జరిగింది. 1953లో పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత ఎక్కువ స్థానాలు కలిగిన సిపిఐకి అధికారం పొందే అవకాశం మరోసారి వచ్చింది. కానీ పి.వి.జి.రాజు నాయకత్వంలోని సోషలిస్టు పార్టీ, ఎన్.జి.రంగా నాయకత్వంలోని కృషికార్ లోక్‌పార్టీ, ప్రకాశం పంతులు గారి నాయకత్వంలోని ప్రజాపార్టీలు కలిసి కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాకుండా చేయడం లో విజయవంతమైనాయి. ప్రకాశం పంతులుగారిని ముఖ్యమంత్రిగా ఆ పార్టీలు ఎన్నుకున్నాయి. తెలంగాణ ఉద్య మ ప్రభావం రెండు రాష్ట్రాల ఎన్నికలలో ఎంతగా ఉన్నదో అర్థమవుతున్నది. రెండు తెలుగు మాట్లాడే ప్రాంతాలలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే అవకాశం ఆనాడే కలిగింది. అలాగే నల్లగొండ లోక్‌సభ స్థానంలో రావి నారాయణరెడ్డి గారికి నాడు భారతదేశవ్యాప్తంగా అమితమైన ఆదరణ కలిగిన పండిట్ జవహర్లాల్ నెహ్రూకంటే ఎక్కువ మెజారిటీ లభించడం ద్వారా తెలంగాణ ప్రజలు
కమ్యూనిస్టులను ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.
విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండి, దాని విచ్ఛిత్తితో కర్నాటకలోభాగమైన కల్యాణ కర్నాటక, మరఠ్వాడా ప్రాంతాలలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విలీన దినోత్సవాలను ప్రభుత్వాలే ఎప్పటి నుండో నిర్వహిస్తున్నాయి. తెలంగాణా విలీనాన్ని అధికారికంగా జరపడం లేదని సమైక్య రాష్ట్రంలోని ప్రభుత్వాలను దుమ్మెత్తిపోసిన అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ 2021 సంవత్సరం నుండి సమైక్యతా దినోత్సవం పేరుతో తెలంగాణ వీర చరిత్రను కనుమరుగయ్యేలా చేశారు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా విలీన దినోత్సవాన్ని అధికారికంగా కచ్చితంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ‘ప్రజాపాలన దినోత్సవం’గా అన్ని నియోజకవర్గాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో జరుపుతామని ప్రకటించారు. ఇది కొంతమేరకు స్వాగతించవలసిన విషయమే అయినప్పటికి సాయుధ పోరాటానికి తగిన గౌరవం ఈ ప్రకటనలో లేదని అనిపిస్తుంది. సాయుధ పోరాటంతో తెలంగాణ విలీన మరియు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆ పేరుతో ధైర్యంగా ఎందుకు జరపలేక పోతున్నారో, అరకొరగా అర్ధమనస్సుతో ఎందుకు జరుపుతున్నారో సమాధానం చెప్పాలి. ఆనాడు ఖాసీం రజ్వీ నాయకుడుగా ఉన్న ఈనాటి ఎం.ఐ.ఎం. నేతల కు ఆగ్రహం కలుగుతుందనా? లేక మరేదైనా కారణం ఉన్నదా అనే సమాధానం చెప్పాలి. దీన్ని అసరాగా తీసుకొని ఈనాటి బిజెపి మరియు ఆర్ఎస్ఎస్లు ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ తాము రాజకీయంగా తెలంగాణలో బలపడటానికి ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నాయి. ఆనాటి తెలంగాణ పోరాటంలో, అలాగే దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎటువంటి పాత్ర లేని బిజెపి, ఆర్ఎస్ఎస్లు తెలంగాణ పోరాటంలో తమ పాత్ర లేదని ఒప్పుకుంటూనే గత పోరాటాన్ని స్మరించుకోవడం తప్పుకాదని విచిత్ర వాదనలు తీసుకొస్తున్నారు. గత పోరాటాలను, త్యాగాలను న్యాయబద్ధంగా స్వీకరిస్తే తప్పులేదు. కానీ రాజకీయ కుట్రతో పోరాట స్వరూపాన్ని వక్రీకరించి లబ్ధిపొందడానికి ప్రయత్నం చేయడమే పెద్ద తప్పు మరియు ఘోరమైన నేరం. ప్రారంభం లో పేర్కొన్నట్లుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేద, బడుగు, బలహీనవర్గాలు సమిష్టిగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఫ్యూడల్ ప్రభువుల అణిచివేతలకు, దోపిడీలపై జరిపిన పోరాటం. ఈ పోరాటంలో హిందువులు, ముస్లింలు అన్నదమ్ములవలె పాల్గొన్నారు. ఈ పోరాటానికి మతం రంగు పులమడమంటే రానున్న తరాలకు తెలంగాణ వీర చరిత్రను అందకుండా చేసే కుట్ర ఇందులో దాగివున్నది. కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి ఉచ్చులో పడకుండా తెలంగాణ ప్రజల పోరాటాలకు, సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చిన ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట ఫలితమైన విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి. తెలంగాణ సాయుధ పోరాట గాధలు స్ఫురించేలా, అసువులు బాసిన వీరుల, కమ్యూనిస్టుయోధుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా, ధైర్యం గా, అధికారికంగా విలీన దినోత్సవాన్ని జరపాలి. (తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు యోధులను అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారత కమ్యూనిస్టు పార్టీ డిప్యూటి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నలమల్ల గిరిప్రసాద్ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి వేలాది మందికి పెన్షన్ సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తుచేస్తున్నాను.) తెలంగాణ పోరాట చరిత్రను రాష్ట్ర పాఠ్యాంశాల్లో, అలాగే చిత్తశుద్ధి ఉంటే బిజెపి కూడా కేంద్ర పాఠ్యాంశాలలోను చేర్చాలి. సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన త్రిమూర్తులు రావినారాయణరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, మఖ్దూంమోహియుద్దీన్ల విగ్రహాలను ట్యాంక్ బండ్‌పై ఒకే చోట ఏర్పాటు చేయాలి. దొడ్డి కొమరయ్య, షేక్ బందగీ, బొమ్మగాని ధర్మభిక్షం, చాకలి ఐలమ్మ లాంటి యోధల విగ్రహాలను ముఖ్య కూడలిలో ఏర్పాటు చేయాలి. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకంటే అత్యధిక మెజార్టీ సాధించి, ఆయన కోరిక మేరకు పార్లమెంట్ భవనంలోకి మొదటడుగు వేసిన రావి నారాయణ విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టాలి. పోరాట కేంద్రాలను భావితరాలవారికి స్ప్మతి చిహ్నంగా మార్చాలి. విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరిపితే దొరలు, దొరతనం ఉన్న పెద్దలు కొంత మంది రాజకీయ నాయకులు మినహా హిందువు అయినా, ముస్లిం అయినా యావత్ తెలంగాణ సమాజం పులకించే హృదయాలతో హర్షిస్తారు. గర్వంగా ఆస్వాదిస్తారు.
ఆనాటి కమ్యూనిస్టుల త్యాగాలు పోరాటాలు లేకుండా విలీనం జరిగేదా? ఆనాటి విలీనం లేకుండా నేటి తెలంగాణ రూపం ఎలా వుండేదో!