Skip to content
ఎడిట్ పేజి వార్తలు

భారత్‌ మెడపై ట్రంప్‌ 100% కత్తి

Prajapaksham 19 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
భారత్‌ మెడపై ట్రంప్‌ 100% కత్తి

trump modi

బెదిరించి లొంగదీసుకోవటం, అది సాధ్యం కాకపోతే ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం, అది ఫలితమివ్వకపోతే ప్రత్యక్ష సైనిక జోక్యం అమెరికా సామ్రాజ్యవాదుల దుష్ట విదేశాంగ నీతి. అధ్యక్షుడు ట్రంప్‌ ‘యుద్ధాలను ముగిస్తానంటూ శాంతిదూతగా రెండవ టరం ఆరంభించి’ యుద్ధోన్మాదిగా రుజువు చేసుకున్నాడు. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ అనే నినాదంతో అంతర్జాతీయ ఆర్థిక ఏర్పాట్లను లక్ష్యపెట్టకుండా ఏకపక్షం గా సుంకాల యుద్ధానికి దిగి ఆర్థిక వ్యవస్థల్లో కల్లోలం సృష్టించాడు. న్యాయవ్యవస్థ నుంచి ఎదురుదెబ్బ లు తగిలినా దొడ్డిత్రోవన సుంకాల ఒత్తిళ్లు అమలు చేస్తున్నాడు. తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించి వాటిని ఆర్థికంగా కృంగదీయటం అమెరికన్‌ విధానం. సుంకాల యుద్ధంలో చైనాతో ఓడిపోయిన ట్రంప్‌ రష్యా యుద్ధం ముగించటంలో విఫలమైనాడు. దాంతో రష్యా యుద్ధ కృషిని దెబ్బతీసేందుకై రష్యా ఆదాయానికి గండికొట్టేందుకుగాను రష్యా నుంచి క్రూడ్‌ ఆయిలు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించాడు. ఇరాన్‌తో అమెరికా యుద్ధం మొదలైనాక గల్ఫ్‌ నుంచి ఆయిలు రవాణాకు ఆటంకాలు ఏర్పడగా, ప్రపంచదేశాల ఒత్తిడిపై రష్యన్‌ ఆయిలు కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేశాడు. తాజాగా మళ్లీ కొత్త ఆయుధం చేజిక్కించుకున్నాడు. అది లిండ్సే ఓ గ్రహం చట్టం. రష్యా నుంచి ఆయిలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసే దేశాలనుంచి అమెరికాలోకి సరుకు దిగుమతులపై 100 శాతం వరకు సుంకం విధించేందుకు అధ్యక్షునికి అధికారమిచ్చిందీ చట్టం. ఈ చట్టానికి ఇరాన్‌ చట్టం, 2026ను జోడించి ఆ దేశంపై యుద్ధానికి ఇప్పటివరకు వెచ్చించిన 30బిలియన్‌ డాలర్లకు కాంగ్రెస్‌ ఆమోదం పొందారు ట్రంప్‌. ఇరాన్‌ను లొంగదీసుకుని గల్ఫ్‌ ఆయిలుపై అజమాయిషీ కోరుకుంటున్న ట్రంప్‌, తన లక్ష్యసాధనకై ఐదేళ్లపాటు ఇరాన్‌పై ఆంక్షలు అనుమతిస్తుందీ చట్టం. లిండ్సే చట్టం నేరుగా చైనా, భారత్‌లపై గురిపెట్టింది. ఈ రెండు దేశాలు రష్యానుంచి అతి ఎక్కువ ఆయిలు కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఇన్నాళ్లూ అడ్మినిస్ట్రేటివ్‌ ఉత్తర్వుల ద్వారా ట్రంప్‌ ప్రపంచ దేశాలను బెదిరించినందున వాటిపై లీగల్‌ పోరాటానికి అవకాశం ఉండింది. కాని ఇప్పుడిది చట్టం. దాన్ని సెనేట్‌ 86 ఓట్లతో, ప్రతినిధుల సభ 262 ఓట్లతో ఆమోదించింది. దానిపై న్యాయపోరాటం సాధ్యం కాదు. నవంబర్‌ మధ్యంతర ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సాధించినా ఈ చట్టం కొనసాగుతుంది. ట్రంప్‌ పదవీకాలం ముగిశాక కూడా ఉంటుంది. దాని అమలు అధ్యక్షుని విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారును నాలుగేళ్లుగా సాగదీస్తూ వస్తున్న భారత్‌ను లొంగదీసుకునేందుకు ట్రంప్‌ ఈ కొత్త ఆయుధాన్ని తప్పక ఉపయోగిస్తాడు. మోదీ ప్రభుత్వం ట్రంప్‌కు లొంగుబాటు ప్రదర్శిస్తుందా లేక చైనాతో కలిసి ప్రతిఘటిస్తుందా? తన ఇంధన సార్వభౌమత్వాన్ని, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నిలుపుకోవటం భారతదేశ ప్రతిష్టకు అవసరం. భారత ప్రభుత్వ తొలి అధికారిక స్పందన దృఢంగానే ఉంది. ‘భారత్‌ తన 140 కోట్ల ప్రజలకు ఇంధన భద్రత చేకూర్చేందుకు దృఢ చిత్తంతో ఉంది. రూపుదిద్దుకునే మార్కెట్‌ పరిస్థితులను బట్టి వేర్వేరు మూలాలనుంచి ఆయిలు కొనుగోలును కొనసాగిస్తుంది’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటన తెలిపింది. అదే సమయంలో భారతదేశ వాణిజ్యం, ఆర్థిక ప్రయోజనాల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. పర్యవసానాల గూర్చి వర్తక, వాణిజ్య సంస్థలతో చర్చిస్తాం’ అని వ్యాపార వర్గాలకు భరోసా యిచ్చింది.
లిండ్సే చట్టం ఆమోదం కోసం సంవత్సరంపైగా ప్రయత్నాలు జరుగుతున్నా, ఇరాన్‌పై ఆంక్షల విధింపును అందులో చేర్చాక ట్రంప్‌ అందులోకి వచ్చారు. లిండ్సే గ్రహం జులైలో హఠాన్మరణం చెందిన తదుపరి అది వేగం పుంజుకుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్‌ సమ్మిట్‌తో కుడిఎడంగా అది ఆమోదించబడటం గమనార్హం. బ్రిక్స్‌ సమ్మిట్‌ సెప్టెంబర్‌ 12,13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. రష్యా, చైనా, భారత్‌ సహా 11 వర్ధమాన దేశాల నేతలు 140 పేరాగ్రాఫ్‌ల డిక్లరేషన్‌ ఆమోదించారు. అది ఏ దేశం పేరు ఎత్తకుండానే, “ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) రూల్స్‌కు అనుగుణంగా లేని ఏకపక్ష టారిఫ్‌, నాన్‌టారిఫ్‌ చర్యలను” అది వ్యతిరేకించింది. వివాదాల పరిష్కారానికి డబ్ల్యుటిఒ ఏర్పాటు చేసిన యంత్రాంగం పునరుద్ధరణను డిమాండ్‌ చేసింది. తమ మధ్య వాణిజ్యంలో స్థానిక కరెన్సీలను విరివిగా వాడాలని ఆమోదించింది. వాషింగ్టన్‌లో కదలికలు వేగం పుంజుకున్నాయి. సెప్టెంబర్‌ 14న రూల్సు కమిటీ సమావేశమైంది. సెప్టెంబర్‌ 15న 214 రూలు ఆమోదం పొందింది. 16న బిల్లు ఆమోదం పొందింది. భారత్‌ చాలా జాగ్రత్తగా ఢిల్లీ డిక్లరేషన్‌ తయారు చేసింది. ఉమ్మడి బ్రిక్స్‌ కరెన్సీని తిరస్కరించింది. డీడాలరైజేషన్‌ బదులు స్థానిక కరెన్సీ పరిష్కారాలు అని ఉపయోగించింది. అయినా ట్రంప్‌ జవాబు వెంటనే వచ్చింది. అది రష్యానుంచి ఆయిలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌ విధింపు. అమెరికా చట్టాన్ని చైనా గట్టిగా ఖండించింది. అమెరికా చర్య అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. ఎంపిక చేసుకున్న దేశాలపై అటువంటి వివక్షాపూర్వక సుంకాలు విధించే అధికారం దానికి లేదు. అంతర్జాతీయ న్యాయచట్టం, భద్రతా మండలి ఆమోదం లేని అటువంటి ఏకపక్ష చర్యలను
తిరస్కరిస్తున్నాం అని చైనా ప్రకటించింది.
చైనా, భారత్‌లకు రష్యా ఆయిలుకు ప్రత్యామ్నాయాలు సులభం కాదు. అన్నిటికీ మించి తమ సార్వభౌమత్వ విధాన నిర్ణయాలను అమెరికా ఆదేశించటం ఎన్నటికీ అనుమతించరానిది. అందువల్ల ఇది మోదీ ప్రభుత్వానికి పరీక్షా సమయం.

ట్యాగ్‌లు: editorial Modi Russia Trump