Skip to content
ప్రపంచం వార్తలు

Russia Sanctions Bill: ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యా ఆంక్షల బిల్లుపై సంతకం, భారత్-చైనాకు 100% టారిఫ్ ముప్పు

jagan 19 Sep 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Russia Sanctions Bill: ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యా ఆంక్షల బిల్లుపై సంతకం, భారత్-చైనాకు 100% టారిఫ్ ముప్పు

US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?

Russia Sanctions Bill: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన అగ్రరాజ్య విదేశాంగ చట్టంపై సంతకం చేశారు. రష్యా ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీయడమే కాకుండా, ఆ దేశం నుంచి చమురు ,సహజ వాయువును భారీగా కొనుగోలు చేసే భారత్, చైనా వంటి మిత్ర, ప్రత్యర్థి దేశాలపై కఠినమైన వాణిజ్య ఆంక్షలు విధించే వీలు కల్పిస్తూ రూపొందించిన ‘లిండ్సే ఓ.గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ బిల్లుకు ఆయన ఆమోదముద్ర వేశారు.

అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) 262-159 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం రాత్రి దీనిపై సంతకం చేయడంతో ఇది అధికారికంగా చట్టరూపం దాల్చింది. ఉక్రెయిన్‌కు బలమైన మద్దతుదారుగా నిలిచి, ఇటీవల మరణించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం జ్ఞాపకార్థం ఈ చట్టానికి ఆయన పేరు పెట్టారు.

ఈ నూతన చట్టం ప్రకారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఆ దేశ అగ్రశ్రేణి అధికారులు, ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రక్షణ, ఇంధన రంగాలపై అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం అవుతాయి. ముఖ్యంగా, పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల పరిమితులను అధిగమించి రష్యా చమురును అంతర్జాతీయ మార్కెట్‌లోకి చేరవేస్తున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్ల వ్యవస్థను ఈ చట్టం నేరుగా లక్ష్యంగా చేసుకుంది. వీటితో పాటు ఇరాన్‌పై ఇప్పటికే అమల్లో ఉన్న ఆయుధ, ఇంధన రంగాలకు సంబంధించిన ఆంక్షల గడువును మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ చట్టంలో పొందుపరిచారు. నిబంధనల ప్రకారం చట్టం ఆమోదం పొందిన 30 రోజుల్లోగా ఇది అమలులోకి రానుంది.

ఈ చట్టంలో పొందుపరిచిన సెక్షన్ 113 అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రష్యా నుంచి అత్యధిక పరిమాణంలో ముడి చమురు, సహజ వాయువును కొనుగోలు చేసే ప్రపంచంలోని అగ్ర ఐదు దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై 100 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అధికారాన్ని ఈ చట్టం అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తోంది. ప్రస్తుతం రష్యన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారులుగా భారత్, చైనాలు ముందువరుసలో ఉన్నాయి. దీంతో అమెరికా ప్రభుత్వం ఈ సుంకాల నిబంధనను అమల్లోకి తెస్తే, ఆసియా ప్రాంతానికి చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది.

అయితే ఈ చట్టం ప్రకారం సుంకాల విధింపు తక్షణమే, స్వయంచాలకంగా జరిగే ప్రక్రియ కాదని చట్టంలో పేర్కొన్నారు. అమెరికా జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సదరు దేశాలకు ఈ సుంకాల నుంచి మినహాయింపు (వేవర్) ఇచ్చే లేదా వాయిదా వేసే విచక్షణాధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే చర్యలు ఆయా దేశాలు చేపట్టినట్లు తేలితే సుంకాల శాతాన్ని తగ్గించే లేదా ఎత్తివేసే వెసులుబాటు కూడా ఈ చట్టంలో ఉంది.

ఈ పరిణామంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెంటనే స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 140 కోట్ల మంది భారత ప్రజల ఇంధన భద్రతను కాపాడుకోవడం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, అందుకోసం అంతర్జాతీయ మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా వైవిధ్యమైన మార్గాల ద్వారా చమురు దిగుమతులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2022లో ఉక్రెయిన్ యుద్దం ప్రారంభానికి ముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతంగా ఉండగా, 2026 నాటికి అది దాదాపు 35 నుండి 40 శాతానికి చేరింది. ఏటా సుమారు 40.8 బిలియన్ డాలర్ల విలువైన రష్యన్ చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా విధించే 100 శాతం సుంకాలు అమలులోకి వస్తే భారత ఎగుమతులైన రసాయనాలు, ఆభరణాలు, దుస్తులు, ఇంజనీరింగ్ రంగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఈ చట్టం అమలు అమెరికా-భారత్ దౌత్య సంబంధాలకు సరికొత్త సవాలుగా మారింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తామని భారత్ చెప్తుంటే, ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా సేకరిస్తున్న నిధులను అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా వాదిస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ల మధ్య కీలక భేటీ జరగనున్న తరుణంలో ఈ చట్టం రూపుదిద్దుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెరిగిన వాణిజ్య ప్రతిష్టంభనల మధ్య భారత్, చైనాలపై ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త ఆంక్షల విచక్షణాధికారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తుందనేది రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాలను శాసించనుంది.