విద్య, వైద్యం, తెలంగాణ మానవాభివృద్ధి
ప్రొ॥టి.ప్రభాకరరెడ్డి, ఆర్థిక శాస్త్రవేత్త, హైదరాబాద్
ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా అభివృద్ధి అనగా మొదట గుర్తుకు వచ్చేది “మానవాభివృద్ధి”. దీనికై సామాజిక రంగాన్ని బలోపే తం చేయటం ఎంతైనా అవసరం. ఇందులో భాగంగా కావలసిన నిధులు కేటాయించటం, ఆ నిధులని సద్వినియోగం చేసుకోవటం, తద్వారా ప్రజలకి నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వాల పరమావధి కావాలి. ఎందుకనగా సగటు మానవుని జీవన ప్రమాణస్థాయి పెరగాలంటే విద్య, వైద్య సేవలు ఎంతో కీలకం. అంతేకాని (జిడిపి), స్థూల జాతీయోత్పత్తి పెరగడం, తలసరి ఆదాయాన్ని పెంచడం వలన పెద్దగా పేదల జీవితాలలో మార్పు రాదు. ఉదాహరణకి ప్రస్తుతం మన కేంద్రప్రభుత్వం బేస్ సంవత్సరాన్ని (Base Year) 2011 2022 మార్చడం వలన అంకెలలో మార్పు రావడం వలన జిడిపి 7.8శాతం పెరుగుదల Quarter (తొలి త్రైమాసికం) లో చూపించింది. అలాగే రాష్ట్రంలో జిఎస్‌డిపి అనగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని జనాభాతో భాగించగా వచ్చేది తలసరి ఆదాయం. ఇది ప్రజలందరికీ సమానంగా పంచబడలేదు. తెలంగాణలో ప్రస్తుతం 2025 రూ.4,18,931 తలసరి ఆదా యం సాధించినట్లుగా ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆదాయ వ్యత్యాసాలు గణనీయంగా పెరిగినవని ఒక రిపోర్టు ఈ మధ్యలోనే చెప్పడం గమనార్హం. ఇకపోతే అమెరికన్ డాలర్లలో 5407 గా నమోదు కావడం దీనిని ప్రపంచ బ్యాంకు రిపోర్టులో ప్రస్తావించడం బాగానే ఉంది. కాని నానాటికీ ధనిక, బీద వర్గాల మధ్య అంతరాలు విపరీతంగా పెరుగుతున్నాయి అని గమనించాలి.
తెలంగాణలో సామాజికాభివృద్ధిని పరిశీలించినట్లయితే మనం వెనకబడినట్లుగా గోచరిస్తుంది. విద్యారంగంలో విద్యా ప్రమాణాలు తగ్గి, విద్యార్థులు, టీచర్లు కేవలం ఉత్తీర్ణత శాతంపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.
అసర్(aser) రిపోర్టు 2024 ప్రకారం తెలంగాణ learning outcomesలో వెనుకబడి ఉంది. అసర్ రిపోర్టు శాస్త్రీయ పద్ధతిలో 605గ్రామీణ యూనిట్లలో, 17,997 గ్రామాలలో 6,49,491 విద్యార్థులని పరిశీలించి, మాట్లాడి, వారివారి విద్యా ఫలితాలని అంచనా వేయడం జరిగింది. దీని ప్రకారం విద్యార్థులు నేర్చుకున్న ఫలితాలని చూస్తే ప్రాథమికంగా అక్షరాస్యత మరియు లెక్కలు చేయడంలో చాలా వెనుకబడి ఉన్నారు. కావున పాఠశాల బోధన పటిష్టపరచి, నాణ్యమైన బోధన కొనసాగించి మంచిఫలితాలని రాబట్టాలి. విద్యార్థులు సబ్జెక్టులని నేర్చుకొని ముందుకు వెళ్లాలి. అంతేకాని ఉత్తీర్ణతా శాతంకై పరుగెత్తడం సరియైనది కాదు.
మరీ ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ పాఠశాలలు (టిపిఎస్) విద్యారంగంలో వ్యత్యాసాలని తీసుకొస్తాయి. ఎందుకనగా మండలం అసెంబ్లీ నియోజకవర్గంలోని విద్యార్థులు అందరికీ ఆ పాఠశాలలో అడ్మిషన్ రాదు కాబట్టి ఒకేచోట కొంతమంది టిపిఎస్‌లో చదువుతుండగా, ఇతరులు ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్లో, కెజిబివిలో లేదా మోడల్ పాఠశాలల్లో చదువుకోవాలి. తద్వారా విద్యాబోధనలో వ్యత్యాసా లు కచ్చితంగా వస్తాయి. “అందరికీ విద్య” అనే నానుడి మాయమవుతుంది. దీనివలన ఇతర పాఠశాలలు నిర్లక్ష్యానికి గురి అయి, నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. కావున ప్రస్తుతమున్న పాఠశాలలలో నాణ్యమైన విద్యాబోధన జరిపించి, ఫలితాలని మెరుగుపరచాలి.
అంతేకాని ప్రయోగాలు వద్దు. ప్రమాణాలు కావాలి. ఇకపోతే టీచర్లకి అల్పాహారం, భోజనం అనేది ఎవ్వరూ అడగలేదు. దానివలన బడ్జెట్‌పై ప్రభావం పడుతుంది. నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజనం పోషకాలతో అందిస్తే ఎంతో మేలు.
ఒకసారి ‘అసర్’ రిపోర్టు చూసి నట్లయితే, తెలంగాణలో 8వ తరగతి విద్యార్థులు కేవలం 35 శాతం మాత్రమే “ తీసివేత” చేయగలిగారు. 65 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. అలాగే 5వ తరగతిలో 38.7 శాతం, 4వ తరగతిలో 40 శాతం, 3వ తరగతిలో 28.5 శాతం విద్యార్థులు వారి వారిస్థాయిలో తీసివేత లెక్కలు చేయగలిగారు.
అలాగే ‘భాగాహారం’ లెక్కలు ఇచ్చినపుడు 8వ తరగతిలో 41.1శాతం, 5వ తరగతిలో 25.2శాతం, 4వ తరగతి లో 12.2 శాతం, 3వ తరగతిలో 2.4 శాతం విద్యార్థులు మాత్రమే పాసయినారు. దీని వలన మనకు అర్ధమయ్యేది ఏమిటంటే గణితంలో విద్యార్ధులు చాలా వెనుకంజలో ఉన్నారు. ఆంగ్లం చదవడంలో కూడా వెనుకబడి ఉన్నారు. కాబట్టి జిల్లా విద్యాశాఖవారు నాణ్యమైన బోధన, మంచి ఫలితాలకై పాత పద్ధతిలో పాఠశాలలని సందర్శించడం, ఉపాధ్యాయులలో ప్రేరణ, ప్రోత్సాహం కల్పించడం ఎంతై నా అవసరం. సంవత్సరం మధ్యలో లేదా వేసవిలో టీచర్లకి శిక్షణలు ఇప్పించి, వారిలో అంకితభావాన్ని పెంపొందించేట్లుగా కృషి చేయాలి. రాష్ట్రంలో అప్పుడప్పుడు (third party evaluaters) థర్డ్‌పార్టీ మూల్యాంకనం జరిపించాలి. అంతేకాని ఒక స్కూలు ఉపాధ్యాయులు, మరొక స్కూలుకి పరిశీలనకై బృందాలుగా వెళ్ళడం ఎంత మాత్రం పనికిరాదు. అది కేవలం పరిశీలనకై బృందాలుగా ఉండి ప్రయోజనం లేని ప్రక్రియ. దీని వలన సంబంధిత పాఠశాలల్లో విద్యాబోధన కుంటుపడుతుంది. దీనికి బదులు inspector of shools ని ఏర్పాటుచేసి విద్యాబోధనని పరిశీలించండి, మెరుగుపరచండి.
ఇకపోతే వైద్యరంగం సేవలు, వాటి మౌలిక వసతులు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో అంతంత మాత్రమే, నిజానికి వాటి పనితీరు అస్తవ్యస్తంగా ఉంది. ఉదాహరణకి జిల్లా ఆసుపత్రిల్లో మందుల కొరత, డాక్టర్ల లేమి, గైర్హాజరు, సర్వసాధారణం. మరీ ముఖ్యంగా ప్రాథమిక వైద్య కేంద్రాలలో స్టాఫ్ కనపడరు.
హెల్త్ వర్కర్స్ తమ, తమ వ్యాపారాలలో నిమగ్నమై ఉన్నారని ప్రజలు వాపోతున్నారు. సబ్ సెంటర్ల పనితీరు అంతంత మాత్రమే. కావున వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసి ప్రజలకి ఎల్లవేళ లా అందుబాటులో ఉండేట్లుగా చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఇకపోతే హైదరాబాదు మహానగరంలో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసత్రులు రావడం చాలా సంతోషం, కాకపోతే వాటిలో తగినంత ఉద్యోగులని నియమించి ప్రారంభిస్తే మంచిది.
సెంట్రల్ బ్యూరో హెల్త్ ఇంటలిజెన్స్ ప్రకారం తెలంగాణలో హెల్త్ వర్కర్స్ కావలసినంత శాతంలో లేరు. 27 శాతం తక్కువగా ఉన్నారని జాతీయ ఆరోగ్య ప్రొఫైల్ చెప్పడం గమనార్హం. దీనివలన గ్రామీణ ఆరోగ్యం సరిగా లేదని అర్థమవుతుంది. మరీ ముఖ్యం గా విద్య, వైద్యరంగ సేవలని మానిటరింగ్ చేసి ప్రజలకి సేవలని అందుబాటులో ఉంచాలని వారి విజ్ఞప్తి. ఇంకా చెప్పాలంటే ప్రైవేటు రంగంలో హాస్పిటల్స్, యథేచ్చగా ఫీజులు వసూలు చేస్తూ; ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ, డబ్బు లు దండుకుంటున్నారని ప్రజల ఆవేదన. కావున వాటిని నియంత్రించడానికై ఒక పీఫుల్స్ కమిటీవేసి పర్యవేక్షణాధికారాలు ఇచ్చి ఆరోగ్య రంగాన్ని ఆదుకోవాలని వారి అభిప్రాయం.
ఒక మాటలో చెప్పాలంటే ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సేవలు అన్నిస్థాయిలలో అందించినట్లయితే అది మానవాభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రజలు ప్రభుత్వాలకి పట్టం కడుతారు. తెలంగాణలో ధనిక, పేద వర్గాల మధ్య వ్యత్యాసాలు తగ్గి నిజమైన అభివృద్ధికి నాంది పలికినట్లవుతుంది.
నిజానికి మానవాభివృద్ధి ఇండెక్స్ మూడు అంశాలని పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తుంది. ఒకటి, జనన సమయంలో ఆశించిన జీవితకాలం, రెండు, నాణ్యమైన విద్య, మూడు, మంచి జీవన ప్రమాణస్థాయి. మూడో అంశాన్ని పెంపొందించాలంటే ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనపై దృష్టి సారించాలి: యువతని రాబోయే కాలానికి తీర్చిదిద్దాలి. అపుడే తెలంగాణలో నిజమైన, ఖచ్చితమైన అభివృద్ధి సాధించ వచ్చును.