Skip to content
తెలంగాణ వార్తలు

Danam Nagender: దానంపై వేటుతో నేర్చుకోవాల్సిన పాఠం ఇదే…జంపింగు సంస్కృతికి కోర్టు మొట్టికాయ..

Krishna Rao 18 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Danam Nagender: దానంపై వేటుతో నేర్చుకోవాల్సిన పాఠం ఇదే…జంపింగు సంస్కృతికి కోర్టు మొట్టికాయ..

దానంపై వేటుతో నేర్చుకోవాల్సిన పాఠం ఇదే...జంపింగు సంస్కృతికి కోర్టు మొట్టికాయ..

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌కు ఎట్టకేలకు హైకోర్టు నుంచి అనర్హత వేటు పడటంతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అలజడికి కేంద్ర బిందువుగా మారింది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకొని, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేసి ఓటమిపాలై, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

ఆయన సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి ఉంటే చరిత్ర మరోలా ఉండేది. కానీ అనుకున్నది ఒక్కటి జరిగింది ఒకటి అన్నట్టుగా దానం పరిస్థితి తయారైంది. ఇప్పుడు అనర్హత వేటు పడటంతో ఆయన హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు సైతం వెళ్తానని తెగేసి చెప్పేశారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని తెలిపారంటే ఖైరతాబాద్‌లో రాబోయే ఉప ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందని అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు దానం నాగేందర్ ఇలా పార్టీలు మారడం ఆయనకు కొత్తేమీ కాదు. 2004 సంవత్సరంలోనే అప్పటి ఆసిఫ్‌నగర్ టికెట్ ఆశించగా, ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన టీడీపీ కండువా కప్పుకొని కాంగ్రెస్‌ను ఓడించి ఎమ్మెల్యే అయ్యారు.

కానీ అనూహ్యంగా రాష్ట్రంలో అధికారం మాత్రం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. అప్పట్లో రాజశేఖర్‌రెడ్డి శిష్యుడిగా పేరు సంపాదించుకున్న దానం అధికార పార్టీలోకి వెళ్లాలని అనుకొని, ఆరు నెలలు కూడా గడవకముందే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆసిఫ్‌నగర్ నుంచి కాంగ్రెస్ బరిలో నిలిచారు.

అప్పట్లో కూడా దానం కథ అడ్డం తిరిగి ఆసిఫ్‌నగర్ నుంచి మరో అభ్యర్థి గెలిచాడు. చివరకు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రి పదవి దక్కించుకోవాలని అనుకొని, మాజీ ఎమ్మెల్యేగా కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా పొందడం చరిత్ర.

అంతా బాగానే ఉంది. 2014 సంవత్సరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలవగా, 2018 సంవత్సరంలో మాత్రం అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ఎన్నికల్లో గెలిచి అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యారు.

ఇక అప్పటి నుంచి 2023లో కూడా మరోసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దీంతో తన సొంత గూటిగా భావించి ఆయన ఈసారి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు.

కానీ చివరకు ఎంపీగా ఓడిపోయారు. ఇప్పుడు ఏకంగా అనర్హత వేటు పడటంతో ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయింది. దానంతో పాటు బీఆర్ఎస్ నుంచి మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, వారంతా టెక్నికల్‌గా బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నామని నిరూపించుకొని అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. కానీ దానం మాత్రం తప్పించుకోలేకపోయారు.

నిజానికి ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు. గతంలో భారత రాష్ట్ర సమితి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తన వైపు లాక్కొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు రేవంత్‌రెడ్డి కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పటికీ, అధిష్టానం నుంచి అండదండలు లభించకపోవడంతో కాంగ్రెస్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ మధ్యలోనే నిలిచిపోయి, పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యంపై క్వశ్చన్ మార్క్‌గా నిలిచింది.

ఇప్పుడు దానం నాగేందర్ పరిస్థితి ఇలాంటిదే అని చెప్పవచ్చు. మరో రెండేళ్లు అధికారం ఉండగానే ఎమ్మెల్యే పదవి ఊడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. అదనపు ఖర్చుతో పాటు అనవసరమైన హడావిడి వల్ల పొలిటికల్‌గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కానీ ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ ఒక బలమైన అభ్యర్థిగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మైనారిటీ ఓటింగ్ అనేది అత్యంత కీలకమైనది. ఎంఐఎం సపోర్టు కనుక ఉన్నట్లయితే ఖైరతాబాద్‌లో విజయం నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు.

ఇప్పటికైతే దానం నాగేందర్‌కు ఎన్నికలను ఎదుర్కోవడం పెద్ద సవాలు కాదు. కానీ ఎవరైతే భవిష్యత్తులో పార్టీలు మారి రాజకీయ విలువలకు తిలోదకాలు వదులుతారో, వారికి మాత్రం కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది అని చెప్పవచ్చు.