Danam Nagender Case: ఖైరతాబాద్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీదే.. కేసీఆర్ వల్లనే పార్టీ ఫిరాయింపుల దుష్ట సంస్కృతి వచ్చిందని మండిపడిన మహేష్ కుమార్ గౌడ్..
Mahesh Kumar Goud Says Congress Will Win 100 Seats in Next Elections
Danam Nagender Case: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు బీఆర్ఎస్, కేసీఆర్‌లకు చెంపపెట్టు లాంటిదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల దుష్ట సంస్కృతిని ప్రవేశపెట్టిందే కేసీఆర్ అని ఆరోపించారు
హైకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. “గతంలో టీడీపీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని తమ వైపు తిప్పుకుని మంత్రి పదవులు కట్టబెట్టింది కేసీఆర్ కాదా?” అని ఆయన నిలదీశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహించిన అప్రజాస్వామిక చర్యల వల్లే రాష్ట్రంలో ఈ తరహా వాతావరణం ఏర్పడిందని విమర్శించారు.
అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తూ, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం, పార్టీలను చీల్చడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకే రకమైన రాజకీయ విధానాలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు.
ఖైరతాబాద్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైతే దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఉప ఎన్నిక జరిగితే ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే మళ్లీ దానం నాగేందర్‌నే బరిలోకి దించుతారా లేదా అనే ప్రశ్నపై ఆయన నేరుగా సమాధానమివ్వకుండా, కాంగ్రెస్ అధిష్ఠానం చర్చించి తగిన అభ్యర్థిని ఖరారు చేస్తుందని వెల్లడించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ విజయం సాధించారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ బీ-ఫామ్‌పై పోటీ చేయడాన్ని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ఉల్లంఘనగా పరిగణిస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే ఆలయేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు.
స్పీకర్ గతంలో ఈ పిటిషన్లను తిరస్కరించినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం స్పీకర్ ఉత్తర్వులను కొట్టివేసి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఆయన నామినేషన్ వేసిన 2024 ఏప్రిల్ 23 నుంచే ఈ అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు ప్రకటించి ఈ కాపీని ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించింది. అసెంబ్లీ కార్యదర్శి నుండి అధికారిక సమాచారం వెళ్లిన తర్వాత నియోజకవర్గానికి భారత ఎన్నికల సంఘం (ECI) ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
- Janwada Farm House: జన్వాడ ఫామ్‌హౌస్ ఫిరంగి నాలాపైనే నిర్మించారు..ఈడీ పరిధిలోని భూములు ఎలా విడుదల అయ్యాయి : MP చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
- Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌హౌస్ ఎవరిది? ప్రదీప్ రెడ్డిదా..? కేటీఆర్ దా స్పష్టత ఇవ్వాలి : ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధ్వజం
- India Dengue Vaccine: భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. క్యూడెంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే.. ఎవరెవరు తీసుకోవచ్చంటే..
- KTR Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల హైడ్రామా.. అక్రమాలపై ఆరా…హైడ్రాతో చర్చిస్తామని హెచ్చరిక (Video)
- IIT Bombay ChatGPT Controversy: పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆత్మహత్య.. క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత..