పన్ను వసూళ్లపై నిఘా పెట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
Revanth reddy meeting
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సాధించడంతో పాటు, పన్నుల వసూళ్లలో జరిగే మోసాలు, ఎగవేతలను పూర్తిగా అరికట్టేందుకు ‘ఛేజింగ్ సెల్’ పేరుతో ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో బుధవారం ప్రభుత్వ ఆదాయ సమీకరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఊహాజనితం కాదని, మున్ముందు పూర్తి కచ్చితత్వంతో కూడిన కార్యాచరణతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కీలక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె. రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో భాగంగా హెచ్‌ఎండీఏ (HMDA), టీజీఐఐసీ (TGIIC) సంస్థలు ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి ప్రధాన శాఖల్లో ఎలాంటి లీకేజీలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, నిధుల సమీకరణలో ఏ ఒక్క శాఖ కూడా నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ప్రతి శాఖ తన పనితీరును, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర అత్యవసర పనులను పూర్తి చేసేందుకు వీలుగా శాఖలవారీగా బడ్జెట్‌ను సిద్ధం చేసుకోవాలని, ఇందులో భూసేకరణ ప్రక్రియకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఈ సమావేశంలో ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ అక్రమాలను అరికట్టడం వల్ల జీఎస్టీ వసూళ్లు పెరిగాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ప్రభుత్వానికి వివరించారు. ఇదే తరహాలో వాణిజ్య పన్నులతో పాటు మైనింగ్ (గనులు) రంగంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడితే మరింత ఆదాయం సమకూరుతుందని మంత్రులు అంచనా వేశారు. ఈ ఉమ్మడి సమీక్షకు ముందే ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఉన్నతాధికారులతో భేటీ అయి పన్నుల వసూళ్లపై సుదీర్ఘంగా చర్చించారు. హిల్ట్ పాలసీని పక్కాగా అమలు చేయడం ద్వారా నగరంలో పరిశ్రమల కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చవచ్చని మంత్రులు అభిప్రాయపడ్డారు. జూన్ నెలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) మొదటి త్రైమాసికం ముగిసిన నేపథ్యంలో, శాఖలవారీగా జరిగిన నిధుల విడుదల, వ్యయంపై సమీక్షించారు. మొదటి మూడు నెలల్లో సాధించిన ఆదాయాన్ని బేరీజు వేస్తూ, రాబోయే తొమ్మిది నెలల్లో సాధించాల్సిన నిధుల లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.