Bullet Train Land Acquisition: బుల్లెట్ ట్రైన్ భూసేకరణపై భగ్గుమన్న రైతులు.. శంషాబాద్ బహదూర్‌గూడలో తీవ్ర ఆందోళన.. వీడియోలు ఇవిగో..
Bullet Train Land Acquisition: బుల్లెట్ ట్రైన్ భూసేకరణపై భగ్గుమన్న రైతులు.. శంషాబాద్ బహదూర్‌గూడలో తీవ్ర ఆందోళన.. వీడియోలు ఇవిగో..
Bullet Train Land Acquisition: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి రణరంగాన్ని తలపించింది. తీవ్ర ఆగ్రహానికి గురైన కొందరు రైతులు పోలీసులపై కారం చల్లి, రాళ్లు, కుర్చీలు విసురుతూ దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురు కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సీఐలతో పాటు డీసీపీకి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన పోలీసు అధికారులకు తక్షణ చికిత్స అందించారు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతంలో సుమారు 600 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, తమ జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదంటూ రైతులు గత ఐదు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. తమకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ లభించిన తర్వాతే భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం హైడ్రా అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో భూముల స్వాధీన ప్రక్రియ కోసం అక్కడికి చేరుకున్నారు. అధికారులు ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో ఉదయం ప్రారంభమైన ఉద్రిక్తత సాయంత్రానికి మరింత తీవ్రరూపం దాల్చింది.
పరిస్థితి చేజారిపోతుండటంతో డీసీపీ యోగేశ్ గౌతమ్ స్వయంగా రంగంలోకి దిగి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ భూసేకరణ ప్రక్రియ కేవలం ఆరంభం మాత్రమేనని, రైతులతో పూర్తిస్థాయిలో చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటిని కలెక్టర్‌కు విన్నవించుకునే అవకాశం కల్పిస్తామని, రైతుల అనుమతి లేకుండా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని డీసీపీ హామీ ఇచ్చారు.
అయినప్పటికీ అధికారుల మాటలపై నమ్మకం లేదంటూ రైతులు వెనక్కి తగ్గలేదు. తమ భూములను కాపాడుకునేందుకు నిరసనను ఇలాగే కొనసాగిస్తామని రైతులు భీష్మించుకోవడంతో బహదూర్‌గూడ ప్రాంతంలో ప్రస్తుతం భారీగా పోలీసు బలగాలను మోహరించి ఉద్రిక్త వాతావరణాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.