పిల్లలు లేని అంగన్ వాడీకి…విధులు నిర్వహిస్తున్న టీచర్, ఆయాలు..
పిల్లలు లేని అంగన్ వాడీకి…విధులు నిర్వహిస్తున్న టీచర్, ఆయాలు..
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం పందిబండ తండాలో విచిత్రం
నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు.
పిల్లలు లేని అంగన్వాడీ కేంద్రానికి ఓ టీచర్, ఓ ఆయా నెలల తరబడి నుండి విధులు నిర్వహిస్తున్న సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని సేవాలాల్ గ్రామ పంచాయతీ ఆవాసమైన పందిబండ తండలో వెలుగుచూసింది.
పిల్లలు లేకుండా ఉన్నా నెలల తరబడి నుండి ఐసిడిఎస్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలోని సేవాలాల్ తండ గ్రామ పంచాయితీలోని ఆవాసమైన పందిబండ తండలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లలంటూ ఎవరూ లేరు. కేవలం టీచర్, ఆయా మాత్రమే ఆ కేంద్రంలో నెలల తరబడి నుండి విధులు నిర్వహిస్తున్నారు.
అంగన్వాడీ టీచర్ గుగులోతు పద్మ మాత్రం 5 గురు చిన్నారులు ఉన్నారని చెబుతున్నారు. గ్రామస్తులు కొందరు తమ తండలోని అంగన్వాడీ సెంటర్‌లో చిన్నారులు ఎవరూ లేరని, టీచర్‌కు, ఆయాకు అధికారులు ఖాళీగా కూర్చోబెట్టి నెలనెలా జీతాలు ఇస్తున్నారంటూ విలేకరులకు సమాచారం అందించారు.
దీంతో ఆ సెంటర్‌కు వెళ్లి పరిశీలించగా వారు చెప్పింది వాస్తవమని తేలింది. సెంటర్‌లో ఒక్క చిన్నారి కూడా లేకపోవడంతో టీచర్, ఆయా ఆ కేంద్రంలోని చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు.
కేంద్రంలో పనిచేస్తున్న టీచర్ గుగులోతు పద్మను వివరాలు అడుగగా మొత్తం 5 గురు చిన్నారులు ఉన్నారని, ఇందులో మూడున్నర సంవత్సరాల వారు ఇద్దరు, మిగతా ముగ్గురు రెండున్నర సంవత్సరాల చిన్నారులు ఉన్నట్లు చెప్పడంతోపాటు హాజరు పట్టికను కూడా చూపించింది.
ఈ హాజరు పట్టికను పరిశీలించగా ఈ నెల 9వ తేదీ వరకే హాజరు వేసి ఉండడం గమనార్హం. ఈరోజు చిన్నారులు ఎవరూ రాలేదా అని అడిగితే రాలేదని చెప్పారు. తండవాసులు అసలు పిల్లలే లేరని చెప్పిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్లగా, ఇందులో ముగ్గురిని వారి తల్లిదండ్రులు సూర్యాపేటలోని ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని, తిరిగి తమ అంగన్వాడికే వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఉన్న మరో ఇద్దరు ఎక్కడని అడుగగా ఈరోజు రాలేదని చెప్పడం జరిగింది. బాలింతలు ఎంత మంది ఉన్నారని అడుగగా ఒక్కరు కూడా లేరని, గర్భిణీ స్త్రీల గురించి అడిగితే ఒక్కరు ఉన్నట్లు తెలిపారు.
ఈ గ్రామ పంచాయితీ పరిధిలో పందిబండ తండతో పాటు బల్లు తండ కూడా ఉంది. మొత్తం 3 తండల్లో కలిపి దాదాపు 165 నివాసాలు ఉండగా, 700 మంది జనాభా ఉంది.
గతంలో సేవాలాల్ తండలో అంగన్వాడీ కేంద్రం మరొకటి ఉండగా, అక్కడ పిల్లలు లేకపోవడంతో ఈ పందిబండ తండ అంగన్వాడీ కేంద్రంలోని అధికారులు గతంలో విలీనం చేశారు. తండలో ఉన్న ప్రాథమిక పాఠశాలను కూడా పిల్లలు రాకపోవడంతో గత విద్యాసంవత్సరం అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇతర ప్రాంతానికి విద్యాశాఖ అధికారులు బదిలీ చేశారు.
అంగన్వాడీ కేంద్రంలో అధికారులు పంపిన పౌష్టికాహార పొట్లాలు, పాలు, గుడ్లు, బియ్యంతోపాటు ఇతర కిరాణా సామాను నిల్వలు ఉన్నాయి. వీటిని ఎవరికి పంపిణీ చేస్తున్నారన్నది కూడా అంతుచిక్కడం లేదు.
సిడిపిఒ వివరణ…
పందిబండ తండ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు లేని విషయమై చివ్వెంల ఐసిడిఎస్ సిడిపిఒ శ్రీజను వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు.
గిరిజన తండల్లో చిన్నారులకు అక్షరజ్ఞానం నేర్పడం, పౌష్టికాహారం అందించడం, గర్భిణీ, బాలింతల సంరక్షణతోపాటు పౌష్టికాహారం అందించడం, భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చిన్న చిన్న తండల్లో కూడా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.
ప్రభుత్వ ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ, చిన్నారులు లేకపోవడంతో కేంద్రాన్ని కొనసాగించడం కష్టమేనన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, అక్కడ పనిచేస్తున్న టీచర్, ఆయాలను ఇతర కేంద్రంలో విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.