Telangana Rain Alert: తెలంగాణలో ఎండలకు బ్రేక్.. రాష్ట్ర వ్యాప్తంగా కురవనున్న వర్షాలు..గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ..
Rain Alert in AP: వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు.. కొన్ని జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక..
Telangana Rain Alert: జులై మాసంలోనూ ఎండల తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఒడిశా సమీపంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం (LPA) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఉక్కపోత నుండి ఉపశమనం లభించనుంది.
రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రి లోపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయి. రాజధాని హైదరాబాద్‌లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ.. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, ఇది నగరవాసులకు ఎండల నుండి పెద్ద ఉపశమనం కలిగిస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. ఇందులో గరిష్టంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 17 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కోస్గిలో 15 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది.
తాజా అంచనాల ప్రకారం గురువారం ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం తక్కువగానే ఉన్నప్పటికీ.. ఈ తేలికపాటి వర్షాలు ఎండల తీవ్రతను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనా ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు.. ఈ అల్పపీడన చినుకులు వ్యవసాయ పనులను వేగవంతం చేయడానికి కొంతవరకు ఊతమిస్తాయని భావిస్తున్నారు.