Skip to content
జాతీయం వార్తలు

సోనం వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష భగ్నం…నీరసించిన వాంగ్ చుక్ ను ఈడ్చుకెళ్లిన ఢిల్లీ పోలీసులు…(Video)

Prajapaksham 18 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
సోనం వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష భగ్నం…నీరసించిన వాంగ్ చుక్ ను ఈడ్చుకెళ్లిన ఢిల్లీ పోలీసులు…(Video)

గత 21 రోజులుగా జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త సోనం వాంగ్‌చుక్ ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయన 21 రోజులుగా కొనసాగిస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నీటి పరీక్షల ఒకటోకలు జరిగినట్లు ఆరోపించి అక్రమాలకు వ్యతిరేకంగా సోనం 21 రోజులుగా ఆమరణ దీక్ష చేపట్టారు. శనివారం ఉదయం పోలీసులు ఆయన దీక్షా శిబిరం లోకి ప్రవేశించి, మద్దతుదారులను చెల్లాచెదురు చేసి సోనంను అదుపులోకి తీసుకొని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

కాగా సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం అందుతోంది. ICUలో చేరిన సోనమ్ వాంగ్‌చుక్ పూర్తి స్పృహలో ఉన్నారని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ప్రజా ప్రయోజన పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ప్రతి మానవ ప్రాణం విలువైనది కాబట్టి సోనమ్ వాంగ్‌చుక్‌ను ప్రభుత్వ వైద్యులచే క్రమం తప్పకుండా పరీక్షించాలని, వైద్యుల నివేదిక ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలోనే పోలీసులు సోనం దీక్షను భగ్నం చేశారు.

హైకోర్టు ఆదేశం మేరకు, సోనం ఆరోగ్యం, వైద్యుల సలహాను పరిగణనలోకి తీసుకొని చికిత్స కోసం ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఎలాంటి లాఠీచార్జి గానీ లేదా అలాంటి సంఘటన గానీ జరగలేదని డీసీపీ సచిన్ శర్మ తెలిపారు. ఇదిలా ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ – ఉదయం 7 గంటలకు నేను స్నానం చేసి రావడానికి బయటకు వెళ్లినప్పుడు, పోలీసులు వచ్చారు. వారు సోనమ్ సార్‌ను తిడుతూ ఈడ్చుకెళ్లారు. 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ, ఏమీ తినని 60 ఏళ్ల వృద్ధుడిని ఢిల్లీ పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. వారు ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్లారో మాకు తెలియదు. నేను ఈ వార్త విని, నా స్నేహితుడి ఇంటి నుంచి జంతర్ మంతర్‌కు వెళ్తుండగా, పోలీసులు నాపై కూడా దాడి చేశారు. వీళ్ళు పోలీసు అధికారులు కాదు; ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు. అని అభిజీత్ ఆరోెపణలు చేశారు. కాగా నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఆందోళనకారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 20 రోజుల పాటు సాగింది. ఆయన బరువు 9.5 కిలోలు తగ్గింది. శరీరంగా బలహీనపడ్డా.. మనసు మాత్రం దృఢంగానే ఉంది అని జంతర్ మంతర్‌లో వాంగ్‌చుక్ అన్నారు. జూలై 20న పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న తర్వాత దీక్షను విరమిస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు.