Editorial: ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్న అమెరికా
Donald Trump
అమెరికా పెట్టుబడిదారీ విధానాలు, సామ్రాజ్యవాద ధోరణులు యావత్ ప్రపంచాన్ని అత్యంత భయంకరమైన ద్రవ్యోల్బణంవైపు, మరింత ప్రమాదకరమైన పర్యావరణ విధ్వంసంవైపు నెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా తిరిగి కొనసాగిస్తున్న దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఇంధన మార్కెట్లను, ఆహార భద్రతను, పేద దేశాల అభివృద్ధి అవకాశాలను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి.
ఆధునిక ప్రపంచీకరణ యుగంలో, ఒక ప్రాంతంలో పడే బాంబు శబ్దం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతు పొలం, కూలీ వంటిల్లు, చిన్న వ్యాపారి దుకాణంలో ప్రతిధ్వనిస్తుంది. అందుకే మధ్యప్రాచ్యంలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలు కేవలం వ్యూహాత్మక నిర్ణయాలుగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సాధారణ ప్రజల జీవితాలను ఖరీదైనవిగా, అస్థిరమైనవిగా మారుస్తున్నాయి. అనిశ్చితిని నింపేస్తున్నాయి.
యుద్ధ ప్రతికూల ప్రభావాలు ఆయుధాలు పట్టిన దేశాలకే పరిమితం కావు. నిజానికి అసలు భారాన్ని మోసేది తుపాకీ పట్టని ప్రజలే. ముఖ్యంగా పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పటికే అప్పులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పుల ప్రభావాలతో పోరాడుతున్న సమాజాలు ఈ యుద్ధాలతో బలిపశువులుగా మారుతున్నాయి.
అమెరికా తన సైనిక చర్యలను జాతీయ భద్రత, ప్రాంతీయ స్థిరత్వం లేదా ఉగ్రవాద నిరోధక చర్యలుగా సమర్థించవచ్చు. అలాగే ఇరాన్ తన భద్రత, సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవాలనే వాదనను ముందుకు తీసుకురావచ్చు. కానీ ఈ వాదనల వల్ల ప్రయోజనం శూన్యం.
యుద్ధం కారణంగా, చమురు ధరలు పెరగడం, రవాణా వ్యయం పెరగడం, ఎరువుల ఉత్పత్తి ఖరీదవడం, ఆహార ధరలు ఎగబాకడం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరగడం సర్వసాధారణం. ఈ విపరీత పరిణామాలకు దేశాల సరిహద్దులు ఉండవు. యుద్ధం ప్రారంభమైన ప్రాంతం మధ్యప్రాచ్యం అయినప్పటికీ, దాని ఆర్థిక అలజడి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడతాయి. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా తరలించే ముడి చమురులో గణనీయమైన భాగం ఈ మార్గం మీదుగానే రవాణా అవుతుంది. అక్కడ ఏ చిన్న అంతరాయం వచ్చినా అంతర్జాతీయ మార్కెట్లు భయాందోళనలకు గురవుతాయి.
ముడి చమురు ధరలు పెరిగితే కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే పెరగవు. విద్యుత్ ఉత్పత్తి నుంచి పరిశ్రమల వరకు, ట్రక్కుల రవాణా నుంచి విమానయాన రంగం వరకు, చేపల వేట నుంచి వ్యవసాయ యంత్రాల వరకు ప్రతి రంగంపైనా ప్రభావం పడుతుంది. చివరికి ఈ అదనపు భారం వినియోగదారుల భుజాల మీదకు బదిలీ అవుతుంది.
పేద దేశాలకు ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. చాలా దేశాలు తమ చమురు అవసరాల్లో అధిక భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్న కారణంగా, దిగుమతుల ధరలు పెరిగితే విదేశీ మారక నిల్వలు కరిగిపోతాయి. స్థానిక కరెన్సీ విలువ తగ్గుతుంది. దిగుమతులు మరింత ఖరీదవుతాయి. ప్రభుత్వాలు సబ్సిడీలను కొనసాగించలేకపోతాయి. ఫలితంగా ఇంధన ధరలు పెరుగుతాయి.
ఇంధన ధరల పెరుగుదల మళ్లీ ప్రతి వస్తువు ధరను పెంచుతుంది. ఒక యుద్ధం ప్రపంచంలోని మరో మూలలో జరుగుతున్నప్పటికీ, దాని ఖర్చును వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పేద కుటుంబం తన రోజువారీ ఖర్చుల రూపంలో చెల్లించాల్సి రావడం చేదు నిజం.
వ్యవసాయం మీద పడే ప్రభావం మరింత ఆందోళనకరం. ఆధునిక వ్యవసాయం పూర్తిగా ఇంధనం, విద్యుత్, రసాయన ఎరువులు, రవాణా వ్యవస్థలపై ఆధారపడి ఉంది. నత్రజని ఎరువుల తయారీలో సహజ వాయువు కీలక ముడి పదార్థం. చమురు, వాయువు ధరలు పెరిగినప్పుడు ఎరువుల ఉత్పత్తి వ్యయం కూడా పెరుగుతుంది.
ఆ వ్యయాన్ని రైతు భరించలేక ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. దిగుబడులు తగ్గితే మార్కెట్లో సరఫరా తగ్గుతుంది. సరఫరా తగ్గితే ఆహార ధరలు పెరుగుతాయి. ఈ మొత్తం పరిణామాల గొలుసు చివరలో ఆకలితో పోరాడేది పేద వినియోగదారులే.
ఇప్పటికే ప్రపంచం వాతావరణ మార్పులు, కరువు, వరదలు, అంటువ్యాధులు, సరఫరా గొలుసు అంతరాయాల వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల వద్ద భారీ అప్పులతో నిలిచాయి. యుద్ధాల వల్ల ఏర్పడే ఇంధన ధరల పెరుగుదల ఈ అప్పుల భారం మరింత పెంచుతుంది. అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన వనరులు అప్పుల చెల్లింపులకు, ఇంధన దిగుమతులకు మళ్లిపోతాయి.
ఈ పరిణామాలను పరిశీలిస్తే ప్రపంచ రాజకీయాల్లో ఉన్న అసమానత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. శక్తివంతమైన దేశాలు తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం సైనిక చర్యలు చేపడతాయి. కానీ వాటి ఆర్థిక దుష్పరిణామాలను మాత్రం యుద్ధంలో పాల్గొనని దేశాలే భరించాల్సిన దుస్థితి.
ఈ పరిస్థితుల్లో యుద్ధాలు లేని ప్రపంచాన్ని అత్యధిక జనాభా కోరుకుంటున్నారు. ప్రపంచ శాంతి అనేది కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు. ప్రజలకు అందుబాటు ధరల్లో ఆహారం, ఇంధనం, ఉపాధి, జీవన భద్రత ఉండే పరిస్థితిని సృష్టించడం కూడా అంతే ముఖ్యమైనది.
అంతర్జాతీయ సంబంధాలు పరస్పర గౌరవం, చర్చలు, దౌత్య పరిష్కారాల ఆధారంగా ముందుకు సాగితేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది. సైనిక చర్యలు మొదటి పరిష్కారం కారాదు. అది ముమ్మాటికీ చివరి ప్రత్యామ్నాయంగానే ఉండాలి.
ముఖ్యంగా చమురు రవాణా, సముద్ర వాణిజ్యం, ప్రపంచ సరఫరా గొలుసులను ప్రమాదంలోకి నెట్టే చర్యలు మొత్తం మానవాళిపై ప్రభావం చూపుతాయని ప్రపంచ శక్తులు గుర్తించాలి. యుద్ధాన్ని ఎవరు గెలిచినా, కానీ ద్రవ్యోల్బణం, ఆకలి, నిరుద్యోగం, అభివృద్ధి మందగమనం వంటి పరిణామాల్లో ఓడిపోయేది మాత్రం ప్రపంచంలోని పేద ప్రజలే.
అందుకే ప్రపంచ రాజకీయాలు ఆయుధాల శక్తికంటే మానవ సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. శక్తి ప్రదర్శనల కంటే శాంతి, సహకారం, ఆర్థిక న్యాయం, అంతర్జాతీయ బాధ్యత అనే విలువలే మానవాళిని భవిష్యత్తు సంక్షోభాల నుంచి కాపాడతాయి.