Skip to content
ప్రపంచం వార్తలు

Jiko Bukken: జపాన్‌లో దెయ్యాల ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్.. ఆస్తి కొనుగోలుకు జనం క్యూ.. జికో బుక్కెన్ హౌసింగ్ ట్రెండ్ ఎలా ఉందంటే..

Prajapaksham 17 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Jiko Bukken: జపాన్‌లో దెయ్యాల ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్.. ఆస్తి కొనుగోలుకు జనం క్యూ.. జికో బుక్కెన్ హౌసింగ్ ట్రెండ్ ఎలా ఉందంటే..

Jiko Bukken: జపాన్‌లో దెయ్యాల ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్.. ఆస్తి కొనుగోలుకు జనం క్యూ.. జికో బుక్కెన్ హౌసింగ్ ట్రెండ్ ఎలా ఉందంటే..

Jiko Bukken: విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం జపాన్ ప్రజల ఆలోచనా విధానాన్ని, అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణిని పూర్తిగా మార్చేస్తోంది. టోక్యో వంటి ప్రపంచ స్థాయి ఖరీదైన నగరాల్లో సొంత ఇల్లు కొనడం లేదా అద్దెకు ఉండటం సామాన్యులకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఆకాశాన్నంటుతున్న ఆస్తి ధరల కారణంగా.. ఒకప్పుడు ప్రజలు అశుభమైనవి, “దెయ్యాలున్నాయని భయపడి దూరంగా పెట్టిన ఇళ్లను కొనడానికే ఇప్పుడు జపనీయులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఏమిటీ ‘జికో బుక్కెన్’: జపాన్‌లో గతంలో హత్యలు, ఆత్మహత్యలు లేదా అనుమానాస్పద మరణాలు సంభవించిన ఇళ్లను స్థానికంగా జికో బుక్కెన్ అని పిలుస్తారు. సాంప్రదాయకంగానూ, మతపరంగానూ ఇటువంటి ఇళ్లను నివాసయోగ్యం కానివిగా.. అరిష్టంగా జపనీయులు భావిస్తారు. గతంలో ఈ ఇళ్ల వైపు వెళ్లడానికి కూడా జనం భయపడేవారు. కానీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, నిత్యావసరాలు మొదలుకొని ఇంటి అద్దెల వరకు పెరిగిన ఖర్చులు ప్రజల్లోని మూఢనమ్మకాలను పక్కన పెట్టేలా చేస్తున్నాయి. భయాల కంటే తమ ఆర్థిక వనరులు, బడ్జెట్‌కే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ జికో బుక్కెన్ ఇళ్లకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం వాటిపై లభిస్తున్న భారీ డిస్కౌంట్లే. సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ ఆస్తులు 20 నుండి 50 శాతం వరకు తక్కువ ధరలకే లభిస్తున్నాయి. టోక్యో నగరంలో బడ్జెట్‌కు అనుకూలమైన ఇల్లు దొరకడమే గగనమైన తరుణంలో.. మధ్యతరగతి ప్రజలకు ఇవి ఒక బంగారు గుడ్డు లాంటి అవకాశంగా కనిపిస్తున్నాయి. తక్కువ ధరకే విలాసవంతమైన ప్రాంతాల్లో ఇళ్లు లభిస్తుండటంతో కొనుగోలుదారులు వీటి కోసం బారులు తీరుతున్నారు.

జపాన్ సమాజంలో ఈ మారుతున్న ధోరణికి ప్రముఖ హాస్యనటుడు తనిషి మత్సుబారా ఒక ముఖ్య కారణమని చెప్పవచ్చు. జికో బుక్కెన్ ఇళ్లపై ప్రజల్లో ఉన్న భయాన్ని, అపోహలను తొలగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సంవత్సరాల తరబడి ఆయా దెయ్యాల ఇళ్లుగా ప్రచారంలో ఉన్న ఆస్తులలోనే స్వయంగా నివసించి, అక్కడ ఎలాంటి భయాలు లేవని ఆయన నిరూపించారు. ఆయన చూపిన చొరవ, ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులు తోడవడంతో ఒకప్పుడు భయానకంగా చూసిన ఇళ్లు.. ఇప్పుడు జపాన్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత తెలివైన పెట్టుబడిగా మారిపోయాయి.