Skip to content
ఎడిట్ పేజి వార్తలు

మహా నగరాల్లోనే నిరుద్యోగం ఎక్కువ

Prajapaksham 14 Jul 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
మహా నగరాల్లోనే నిరుద్యోగం ఎక్కువ

Unemployment is higher in major cities.

మన దేశంలో పట్టణీకరణ, నగరీకరణ పెరుగుతోంది. నగరాల చుట్టూ అభివృద్ధి కేంద్రీకరించటం, అభివృద్ధి కేంద్రాల చుట్టూ పట్టణీకరణ విస్తరించటం సహజలక్షణంగా చూస్తున్నాం. రెండోవైపున, గ్రామీణ పేదరికం పెరుగుదలతో బడుగుజీవులు ఉపాధి వెతుక్కుంటూ పట్టణాలకు పెద్ద ఎత్తున వలసపోతున్నారు. దాంతో పట్టణాల్లో పౌరవసతులపై ఒత్తిడి పెరుగుతోంది, మురికివాడలు ఇబ్బెడుముబ్బెడు అవుతున్నాయి. పట్టణ నిరుద్యోగులకు ఈ వలస శ్రామికులు తోడుకావటంతో శ్రామికుల సంఖ్య అవసరానికి మించి పెరుగుతున్నది. దాంతో లేబర్‌ మార్కెట్‌లో వేతనాలు కోతకు గురవుతున్నాయి. మహానగరాలు ఉద్ధరిస్తాయనే ఆశతో వలసవచ్చిన వారికి నిరాశ తప్పటం లేదు. 10లక్షలకు పైన జనాభా ఉన్న నగరాల్లోనే నిరుద్యోగ రేటు హెచ్చుగా ఉన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. పట్టణ భారత్‌లో నిరుద్యోగం రేటు 4.8శాతం ఉండగా, 10లక్షల జనాభా మించిన నగరాలలో సర్వసాధారణంగా 4.9శాతం ఉందని నివేదిక పేర్కొన్నది. అలాగే వివిధ కేటగిరి కార్మికుల కాంట్రాక్టు, క్యాజువల్‌, రెగ్యులర్‌ ఆదాయార్జనలో తీవ్ర అసమానత ఉంది.
గణాంకాలు, కార్యక్రమం అమలు మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ గణాంకాల కార్యాలయం 2025 సంవత్సరానికి సంబంధించి ఇటీవల “లేబర్‌ మార్కెట్‌ డైనమిక్స్‌ ఇన్‌ మిలియన్‌ ప్లస్‌ సిటీస్‌” పేరుతో విడుదల చేసిన నివేదిక ఈ విషయాలు చెబుతూ, మహిళల్లో నిరుద్యోగం మహానగరాల్లోని 6.1శాతంతో పోల్చితే మామూలు పట్టణ భారత్‌లో 6.4 శాతంగా ఉందని వెల్లడించింది. పురుషుల్లో నిరుద్యోగం మహానగరాల్లో హెచ్చుగా 4.5 శాతం ఉండగా, పట్టణ భారత్‌లో తక్కువగా 4.2శాతంగా ఉంది. కరెంట్‌ వీక్లీ స్టేటస్‌ (సిడబ్ల్యుఎస్‌) ప్రకారం రెండు ప్రాంతాల్లోనూ హెచ్చుగా 6.8శాతం ఉంది. మహానగరాల్లో సిడబ్ల్యుఎస్‌ రేటు ప్రకారం పురుషుల్లో నిరుద్యోగం 6.2శాతం కాగా మహిళల్లో నిరుద్యోగం 8.8శాతం ఉంది. పట్టణ భారత్‌లో సిడబ్ల్యుఎస్‌లో ఆ సంఖ్యలు వరుసగా 6.1శాతం, 8.9శాతంగా ఉన్నాయి.
వేతనాల రీత్యా చూస్తే మహానగరాల్లోని కార్మికులు మెరుగైన స్థితిలో ఉన్నారు. ఇది అన్ని కేటగిరీల్లోనూ ఉంది. వేతన లేదా ఆదాయార్జన వ్యత్యాసాలు నగరాలు పట్టణాల మధ్య ఇలా ఉన్నాయి. స్వయం ఉపాధి కార్మికుల ఆదాయం నగరాలలో రూ.30,858 కాగా, పట్టణాలలో రూ.23,013.రెగ్యులర్‌ వేతన ఉద్యోగుల ఆదాయం వరుసగా రూ.28,808లు, రూ.26,258లుగా ఉంది. క్యాజువల్‌ లేబర్‌ ఆర్జన వరుసగా రూ.624లు, రూ.550గా ఉంది. నగరాల్లోని మహిళలు పట్టణాల్లోని శ్రామిక మహిళలకన్నా 58శాతం ఎక్కువ వేతనం పొందుతున్నారు. అలాగే క్యాజువల్‌
లేబర్‌లో కూడా రోజువారీ వేతనం 18 శాతం హెచ్చుగా ఉంది.
నగరాల్లో కార్మికులు వారానికి 49.5గంటలు, పట్టణాల్లో 47.1 గంటలు పనిచేస్తున్నారు. నగరాల్లో అత్యధికంగా 22.9శాతం కార్మికులు వాణిజ్యం, హోటల్‌, రెస్టారెంట్‌ పనుల్లో ఉండగా, వస్తూత్పత్తి రంగంలో 21.6శాతం ఉన్నారు. రవాణా, స్టోరేజి, కమ్యూనికేషన్స్‌లో 13.6శాతం, నిర్మాణాలరంగంలో 7.5శాతం పనిచేస్తున్నారు. ఇతర చిన్నపాటి సేవల్లో 31.5 శాతం ఉన్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో ఉపాధులు వరుసగా 23.8; 20.2; 10శాతం, 7.5 శాతం
వ్యవసాయంలో ఉన్నారు.
నగరాలలో శ్రామిక శక్తిలో పాల్గొనని వారిలో 53.5 శాతం చదువుల కొనసాగింపును కారణంగా చెప్పారు. 38.9 శాతం మందేమో అనారోగ్యం, వయస్సురీత్యా ఆరోగ్య సమస్యలు కారణంగా చెప్పారు. అలాగే పనులకు వెళ్లని మహిళల్లో 68.7శాతం పిల్లల పెంపకం, ఇంట్లో పనులు కారణంగా చెప్పారు.
చదువుకు తగిన ఉద్యోగాలు లభించకపోవటం, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడటం ఒక ప్రధాన సమస్యగా కొనసాగుతున్నది. అందువల్ల వృత్తి నైపుణ్యాల పెంపుదలకు ప్రత్యేక శిక్షణ అవసరం. అది ప్రయోజనకరంగా ఉండాలంటే పరిశ్రమ కార్మికశాఖ మధ్య సమన్వ యం అవసరం. ఏటా మిలియన్‌ల కొలది డిగ్రీలతో విద్యాలయాలనుంచి బయటకు వస్తున్నా పై కారణాలరీత్యా రెంటికీ చెడ్డ రేవడి అవుతున్నారు. టెక్నాలజీ వేగంగా మారుతోంది. అందుకనుగుణంగా అకడమిక్‌ విద్యా కోర్సులు, వృత్తినైపుణ్య కోర్సులు ప్రవేశపెట్టాలి; వృత్తి నిపుణులైన బోధనా సిబ్బందిని త్వరితగతిన సమకూర్చుకోవాలి. అప్పుడే మన దేశానికున్న యువత లాభదాయకతను ప్రయోజనకరంగా ఉపయోగించుకోగలం. యువతను విదేశాలకు వలస కార్మికులుగా పంపటానికి ప్రభుత్వాలు చూపుతున్న ఆసక్తి యువత శిక్షణపై పెడితే దేశ భవిష్యదభివృద్ధికి మేలు చేస్తుంది.

ట్యాగ్‌లు: editorial Unemployment