Skip to content
బిజినెస్ వార్తలు

Plastic Currency Notes Soon? త్వరలో ప్లాస్టిక్ నోట్లు.. గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన ఆర్‌బిఐ.. పాలిమర్ షీట్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Prajapaksham 17 Jul 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Plastic Currency Notes Soon? త్వరలో ప్లాస్టిక్ నోట్లు.. గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన ఆర్‌బిఐ.. పాలిమర్ షీట్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Plastic Currency Notes Soon? త్వరలో ప్లాస్టిక్ నోట్లు.. గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన ఆర్‌బిఐ.. పాలిమర్ షీట్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Plastic Currency Notes Soon? భారతదేశంలో త్వరలోనే సరికొత్త ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ప్రత్యేక అపారదర్శక పాలిమర్ సబ్‌స్ట్రేట్ షీట్లను తయారు చేసి.. సరఫరా చేసేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంతర్జాతీయ కంపెనీల నుంచి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఆర్బీఐ సంయుక్త సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వ కరెన్సీ ముద్రణ సంస్థ (SPMCIL)లు సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేశాయి.

ఇది ఒక రకమైన బ్రాండెడ్ ప్లాస్టిక్ ఆధారిత పదార్థం. కాంతిని నిరోధించేలా రూపొందించే ఈ షీట్లు అత్యంత దృఢంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అత్యంత సురక్షితమైన కరెన్సీని ముద్రించడానికి ఈ సాంకేతికతను ఉపయోగిస్తాయి. ఇవి నీరు, మురికిని నిరోధించడమే కాకుండా.. సులభంగా చిరిగిపోవు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ నోట్లను నకిలీ చేయడం దాదాపు అసాధ్యం.

దేశంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న కాగితపు కరెన్సీ ముద్రణకు ఆర్బీఐ భారీగా ఖర్చు చేస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ ముద్రణ ఖర్చులు రికార్డు స్థాయిలో రూ. 6,372 కోట్లకు చేరగా, 2025-26లో అది రూ. 4,875 కోట్లుగా నమోదైంది. కాగితపు నోట్లు త్వరగా మురికిగా మారడం, చిరిగిపోవడం వంటి సమస్యల వల్ల ఆర్బీఐ నిరంతరం కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తోంది.

భారతదేశ వాతావరణ పరిస్థితులు, ప్రజల వినియోగ విధానాల దృష్ట్యా ప్లాస్టిక్ నోట్లు ఎంతో లాభదాయకమని నిపుణులు భావిస్తున్నారు. ప్రారంభంలో ఈ నోట్ల తయారీ ఖర్చు కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇవి దీర్ఘకాలం మన్నుతాయి కాబట్టి పదేపదే ముద్రించాల్సిన అవసరం తప్పుతుంది. ఫలితంగా కాలక్రమేణా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ముద్రణ ఖర్చులు మిగులుతాయి.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలు పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. ఈ తరహా ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశం ఆస్ట్రేలియా. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ (యునైటెడ్ కింగ్‌డమ్) వంటి దేశాలు తమ కరెన్సీని పూర్తిగా పాలిమర్ రూపంలోకి మార్చేయగా.. సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, రొమేనియా వంటి అనేక ఇతర దేశాలు పాక్షికంగా ఈ ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తెచ్చాయి. ఇప్పుడు ఇదే బాటలో భారతదేశం కూడా అడుగులు వేస్తోంది.