Skip to content
వినోదం వార్తలు

ఎన్టీఆర్ మాటే ఫైనల్.. వద్దంటే వెంటనే ఆగిపోతాం:.. RAW NTR వ్యవస్థాపకుడి సంచలన వ్యాఖ్యలు..

Prajapaksham 18 Jul 2026 1 నిమిషాల పఠనం వినోదం
ఎన్టీఆర్ మాటే ఫైనల్.. వద్దంటే వెంటనే ఆగిపోతాం:.. RAW NTR వ్యవస్థాపకుడి సంచలన వ్యాఖ్యలు..

ఎన్టీఆర్ మాటే ఫైనల్.. వద్దంటే వెంటనే ఆగిపోతాం:.. RAW NTR వ్యవస్థాపకుడి సంచలన వ్యాఖ్యలు..

కొద్దిరోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) సేవా సంస్థ వ్యవహారంపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ స్పందించారు. శనివారం ఉదయం తిరుపతిలో సంస్థ సభ్యులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఓ ఆడియో ఫంక్షన్‌లో ఎన్టీఆర్ చెప్పిన ‘అభిమానాన్ని వృధా చేయకండి.. పదిమందికి సాయం చేసే పనులు చేయండి’ అనే మాటల స్ఫూర్తితోనే తాము సేవా కార్యక్రమాలు ప్రారంభించామని.. ఎన్టీఆర్ పేరును చెడగొట్టే పనులు తాము ఎప్పటికీ చేయబోమని స్పష్టం చేశారు.

గత వారం రోజులుగా తమపై వంద కోట్ల మోసగాళ్లంటూ.. అభిమానుల ముసుగులో దందా చేస్తున్నారంటూ కొన్ని వర్గాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేకుండానే తమకు వ్యతిరేకంగా ఒక లేఖ విడుదలైనట్లు అనుమానిస్తున్నామని.. అసలు ఆ లేఖ ఎలా వచ్చిందో తమకు కూడా అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ ఎన్టీఆర్ స్వయంగా చెబితే తాము ఈ సేవా పనులను తక్షణమే ఆపేస్తామని సాయి రూప్ స్పష్టం చేశారు.

తమ సంస్థపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ, రాబోయే రోజుల్లో చేపట్టనున్న ‘ఊరు – వాడ’ సేవా కార్యక్రమం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ప్రణాళికను మూడు అడుగులుగా విభజించినట్లు తెలిపారు. అందులో మొదటిది సేవతో యువ జాగృతి ద్వారా యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం. రెండో అడుగు మన ఊరు మన బాధ్యత కింద గ్రామాల్లో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, స్థానిక ప్రజలు, రైతులతో సదస్సులు నిర్వహించి పరిష్కరించడం. ఇక మూడో అడుగు ఊరి మాట.. పాలకుల దాకా.. ద్వారా గ్రామీణ సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ఒక వేదికను నిర్మించడమని వివరించారు. ఈ చైతన్య కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలోని ఒక గ్రామం నుండి త్వరలోనే ప్రారంభం కానుందని సాయి రూప్ ప్రకటించారు.