జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్…డాన్సర్స్ అసోసియేషన్లో వివాదం
- కొట్టుకునే స్థాయికి వెళ్లిన డ్యాన్సర్లు
- పోలీసుల రంగ ప్రవేశం
తెలుగు సినిమా డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్‌లో పెత్తనం కోసం రెండు వర్గాలు కొట్టుకునే స్థాయిలో గొడవ పడ్డాయి. ప్రస్తుతం అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న జానీ మాస్టర్ భార్య సుమలత వర్గం, శేఖర్ మాస్టర్ వర్గం గొడవకు దిగాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పెద్ద గొడవ జరగకుండా ఆపేశారు.
ఒక దశలో జానీ మాస్టర్‌కు చెందిన కొందరు డ్యాన్సర్లు పోలీసులు ఎందుకొచ్చారంటూ వాగ్వాదానికి దిగారు. అసోసియేషన్ గొడవల్లో సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జోక్యం చేసుకోవద్దని జానీ మాస్టర్‌తో సహా అతని వర్గీయులు ఆందోళనకు దిగారు.
జానీ మాస్టర్ భార్య సుమలత డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో అధ్యక్షురాలిగా గెలిచిన తరువాత జానీ మాస్టర్ దంపతులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని డ్యాన్సర్లు ఆరోపిస్తున్నారు. తెలుగు డ్యాన్సర్లను ఉపయోగించకుండా ముంబై డ్యాన్సర్లను ఎక్కువగా తీసుకొచ్చి తెలుగు డ్యాన్సర్లకు జానీ మాస్టర్ అన్యాయం చేస్తున్నారని ఇతర డ్యాన్సర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జానీ, సుమలతల ఏకపక్ష ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 10 మంది కమిటీ సభ్యులు రాజీనామా చేశారు. జానీ మాస్టర్, భార్య సుమలత ఆగడాలు భరించలేక ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఫెడరేషన్‌కు, లేబర్ కమిషన్‌కు వినతిపత్రం కూడా ఇచ్చారు.
అసోసియేషన్ బ్యాన్ చేసినా రూ.5 కోట్లు ఫ్రాడ్ చేసిన వ్యక్తిని మళ్లీ జానీ మాస్టర్ తీసుకుని వర్క్ పర్మిషన్ ఇవ్వడంతో అసలు గొడవ మొదలైందని ఆరోపిస్తున్నారు. తెలుగు డ్యాన్సర్ల పొట్ట కొడుతున్న జానీ మాస్టర్‌పై డ్యాన్సర్లు తిరుగుబాటు చేశారు.
‘పెద్ది’ సినిమాలోని పాటకు బొంబాయి డ్యాన్సర్లతో చేయించి తెలుగు వారిని అన్యాయం చేశారని, ఈ విషయంపై అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినా సుమలత పట్టించుకోలేదని డ్యాన్సర్లు ఆందోళనకు దిగారు.
బొంబాయి డ్యాన్సర్లతో చేయిస్తే ఒకరి మీద రూ.5 వేలు, 100 మందితో చేయిస్తే రోజుకు రూ.5 లక్షలకు పైగా జానీ మాస్టర్ జేబులోకి వెళ్తున్నాయని డ్యాన్సర్లు ఆరోపించారు.
ఫెడరేషన్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా జానీ మాస్టర్ భార్య సుమలత ఫెడరేషన్‌ను సైతం లెక్కచేయడం లేదని అంటున్నారు. ఆదివారం జరిగిన సమావేశం రసాభాసగా మారడంతో సమావేశం మధ్యలోనే ముగిసిపోయింది.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి సహా అన్ని పదవులకు ఎన్నికలు నిర్వహించాలని డ్యాన్సర్లు కోరుతున్నారు.