Rajouri Floods: రాజౌరిలో భారీ వర్షాల బీభత్సం.. ఇళ్లు, రహదారులు నీటమునిగిన వీడియోలు వైరల్.. కుండపోత వర్షాలకు జమ్మూకశ్మీర్ విలవిల..
Rajouri Floods: Torrential Rain Leaves Hundreds Displaced in Jammu & Kashmir
Rajouri Floods: జమ్ముకశ్మీర్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని రాజౌరి పట్టణంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కొండవాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాజౌరిలోని కొత్త బస్టాండ్ సహా పలు ప్రధాన ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరదల ధాటికి పదుల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి.
ప్రస్తుతం దర్హాలి, ఖండ్లీ, సుక్తో, జమోలా నదులు ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తున్నాయి. దర్హాలి నది గట్టు తెంచుకోవడంతో బేలా కాలనీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. అబ్దుల్లా బ్రిడ్జ్ సమీపంలోని మురికివాడలు మునిగిపోవడంతో 50కి పైగా కుటుంబాలు తమ నివాసాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అలాగే తారిక్ బ్రిడ్జ్ సమీపంలో నివసించే ప్రజలను కూడా పోలీసులు ముందస్తుగా అప్రమత్తం చేసి అక్కడి నుంచి ఖాళీ చేయించారు.
బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం అధికారులు, సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఇఫ్తికార్ అహ్మద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు తక్షణమే సహాయక చర్యలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, జూలై 23 వరకు జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.