Cyclone Arnab Alert: నేడు అర్థరాత్రి తీవ్ర తుపానుగా మారనున్న అర్నబ్.. అక్టోబర్ 28న యానాం సమీపంలో తీరం దాటే అవకాశం..
Andhra Pradesh Weather Update Today: జూలై 26, ఆదివారం ఏపీ వాతావరణం అప్డేట్స్ ఇవే..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు...
Cyclone Arnab Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ (Cyclone Arnab) తుపాను అత్యంత వేగంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా ఉధృతంగా దూసుకొస్తోంది. ఈ తుపాను ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా.. మంగళవారం నాటికి ‘అతి తీవ్ర తుపాను’గా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
బుధవారం ఉదయం బాపట్ల , విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా కాకినాడకు సమీపంలోని యానాం వద్ద ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 140 కిలోమీటర్ల సంచలన వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
అర్నబ్ తుపాను ప్రభావంతో మంగళవారం, బుధవారాల్లో ఉమ్మడి కోస్తా జిల్లాల్లో వర్షాల బీభత్సం తప్పదని అధికారులు హెచ్చరించారు. కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కుంభవృష్టి లేదా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. మంగళవారం నాటికే కోస్తా తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది.
తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు, పెద్ద చెట్లు, భారీ హోర్డింగ్ల కింద ఎవరూ ఉండవద్దని వాతావరణ శాఖ ప్రజలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రదేశాల్లో నివసించే ప్రజలు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించింది.
అత్యవసర సహాయక చర్యల కోసం ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికే 7 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), 8 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలను రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070 , 18004250101 అందుబాటులో ఉంటాయని తెలిపింది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని కఠిన ఆదేశాలు అమలు చేస్తున్నారు.