Skip to content
ప్రపంచం వార్తలు

ఎర్రసముద్రంలో రాకపోకలు ఆపేస్తాం… భవిష్యత్తులో భీకర యుద్ధం..అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

Prajapaksham 19 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
ఎర్రసముద్రంలో రాకపోకలు ఆపేస్తాం… భవిష్యత్తులో భీకర యుద్ధం..అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

ఎర్రసముద్రంలో రాకపోకలు ఆపేస్తాం... భవిష్యత్తులో భీకర యుద్ధం..అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

• 12 రోజుల్లో 50 మంది ఇరానీయులు మృతి: 500 మందికి గాయాలు
• 10 ఇరాన్ క్షిపణులు కూల్చేసిన జోర్డాన్

ఎంయూ ఒప్పందానికి కాలం చెల్లిందని, ఎదురుచూపుల సమయం ముగిసిందన్న ప్రకటనల మధ్య అమెరికా-ఇరాన్ దేశాల సైన్యాల పరస్పర దాడులు ఆగకుండా కొనసాగాయి.

శనివారం తెల్లవారకముందే ఏడో రోజు రాత్రి కూడా ఇరాన్‌పై భారీ దాడులు పూర్తిచేసినట్లు అమెరికా సైన్యం సెంట్‌కామ్‌ ప్రకటించింది. ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలు, జాతీయ రహదారులు, నీటి శుద్ధి కేంద్రాలు, నిఘా కేంద్రాలు, భూగర్భ ఆయుధ నిల్వలు, సముద్రతల ఆయుధ సంపద, ఇతర పౌర మౌలిక సదుపాయాలపై సెంట్‌కామ్‌ దాడులు చేయగా, అమెరికా మిత్రదేశాలు బహ్రెయిన్‌, జోర్డాన్‌, కువైట్‌లలో అమెరికా స్థావరాలపై ఐఆర్‌జీసీ ప్రతిదాడులు కొనసాగించింది.

ఇరాన్‌ నగరం యజ్డ్‌, జలసంధిని ఆనుకుని ఉన్న ఖేష్‌ ద్వీపం, బందర్‌ అబ్బాస్‌ ఓడరేవులు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఉత్తర హోర్ముజ్‌గాన్‌ రాష్ట్రంలో 100కు పైగా టెలికమ్యూనికేషన్స్‌ టవర్లను ధ్వంసం చేయడంతో మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ సేవలు స్తంభించాయి.

మరోవైపు బహ్రెయిన్‌లోని షేక్‌ ఇసా ఎయిర్‌బేస్‌, కువైట్‌లోని అల్‌ అహ్మది పోర్టుపై ఐఆర్‌జీసీ క్షిపణి దాడులు చేసింది. ఒక విద్యుత్‌ ప్లాంటు, చమురు కేంద్రం, నీటి శుద్ధి కర్మాగారం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కువైట్‌ ప్రకటించింది.

కువైట్‌ దేశం 90 శాతం త్రాగునీటి అవసరాల కోసం సముద్ర నీటి శుద్ధిపైనే ఆధారపడుతోంది. ఇరాన్‌ దాడుల వల్ల తీవ్రంగా మంటలు చెలరేగడంతో, మంటలు ఆర్పే ప్రయత్నంలో అనేక మంది అగ్నిమాపక దళ కార్మికులు గాయపడ్డారు.

ఇరాన్‌ కూడా ఒక ప్రకటన చేస్తూ ఇర్బిల్‌ నగరంపై ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులను కూల్చివేశామని పేర్కొంది. తమ గగనతలంపైకి ఇరాన్‌ ప్రయోగించిన 10 క్షిపణులను కూల్చివేశామని, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం లేకుండా వాటి శిథిలాలను కూడా మెరైన్‌ ఇంజనీర్లు శుభ్రం చేసేశారని జోర్డాన్‌ రక్షణ బలగాలు ప్రకటించాయి.

ఇరాన్‌లోని దక్షిణ హోర్ముజ్‌గాన్‌ రాష్ట్రంలో అమెరికా గగనదాడులతో ముగ్గురు ఇరానీయులు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. జాస్క్‌ సమీపంలో సముద్ర నీటిని శుద్ధి చేసి త్రాగునీరుగా మార్చే ప్లాంట్లను యుద్ధ విమానాలు ధ్వంసం చేయడంతో 20 గ్రామాలలో ఉన్న వేలాది మంది ప్రజలకు పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోయిందని ఇరాన్‌ నేషనల్‌ వాటర్‌ కంపెనీ ప్రకటించింది.

అదేవిధంగా జులై ఆరో తేదీ నుంచి ఈనాటి వరకు అమెరికా చేసిన దాడుల్లో 50 మంది ఇరానీయులు మరణించగా, మరో 500 మంది గాయపడ్డారని ఇరాన్‌ ప్రకటించినట్లు అల్‌జజీరా పేర్కొంది.

గడచిన సోమవారం నుంచి 26 మంది అమెరికా సైనికులు గాయపడగా, యుద్ధం మొదలైనప్పటి నుంచి 14 మంది సైనికులు మరణించగా, 427 మంది గాయపడినట్లు సెంట్‌కామ్‌ ప్రకటించింది.

హోర్ముజ్‌ దక్షిణ మార్గంలో వెళుతున్న రెండు చమురు ట్యాంకర్లు సముద్రంలో ఇరాన్‌ పెట్టిన మందుపాతరలను ఢీకొని ధ్వంసమయ్యాయి. మరో నాలుగు నౌకలను కదలకుండా స్తంభింపజేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది.

దేశంలో పౌర మౌలిక విద్యుత్‌ కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్‌ ధృవీకరించింది. విద్యుత్‌ కొరత ఏర్పడిందని, పౌరులు పొదుపుగా కరెంటు వాడుకోవాలని కోరింది.

భవిష్యత్తులో పెను యుద్ధం జరుగుతుందని ఇరాన్‌ ప్రకటించింది. ఈ భారీ యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందేనని తన మిత్ర సైన్యాలకు పిలుపు ఇచ్చింది. ఇరాన్‌కు ఈ యుద్ధంలో హౌతీలు, హెజ్బొల్లాలు, హమాస్‌ సైన్యాలు ప్రధాన అండదండలుగా వస్తాయి. రాబోయే పెను యుద్ధానికి హెజ్బొల్లాలే నాయకత్వ పాత్ర వహించనున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలియజేశాయి.

మరోవైపు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకలను నిలిపివేసేందుకు ఏ క్షణంలోనైనా సిద్ధంగా ఉండాలని హౌతీలకు జులై 16వ తేదీన ఇచ్చిన పిలుపును ఇరాన్‌ పునరుద్ఘాటించింది.

ఇరాన్‌ను నాశనం చేసే వ్యూహాన్ని ట్రంప్‌ అమలు చేస్తే, ఈసారి తమ దాడులు విస్తారంగా, విధ్వంసకరంగా ఉంటాయని ఐఆర్‌సీ ఖతమ్‌ అన్బియా కేంద్ర కార్యాలయం ప్రతినిధి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇబ్రహీం జోల్హఘారీ రెండు రోజుల క్రితమే ట్రంప్‌కు హెచ్చరిక చేశారు.

హోర్ముజ్‌ జలసంధిని ఒక అభేద్యమైన “రెడ్‌లైన్‌”గా ఆయన అభివర్ణించారు. జలసంధి వ్యవహారాల్లో అమెరికా దురాక్రమణ జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, పశ్చిమాసియా యుద్ధం వల్ల ఈసారి చమురు సరఫరాలకు పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో శనివారం చమురు ధర 1.2 శాతానికి పెరిగింది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 86 డాలర్లకు చేరింది.

ట్యాగ్‌లు: US attacks Iran