Skip to content
తెలంగాణ వార్తలు

Elnino Effect: తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కి నీరు… తాగునీరు కూడా కష్టమే – మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు ( Video)

Prajapaksham 19 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Elnino Effect: తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కి నీరు… తాగునీరు కూడా కష్టమే – మంత్రి తుమ్మల  కీలక వ్యాఖ్యలు ( Video)

Elnino Effect: తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌కి నీరు… తాగునీరు కూడా కష్టమే - మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎల్‌నీనో ప్రభావంపై కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్‌నీనో ప్రభావం వల్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనివల్ల సాగునీటితో పాటు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లలో నీటి స్థాయి డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతులు పరిస్థితులను అర్థం చేసుకొని ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అంతేకాదు, అధికార యంత్రాంగం కూడా అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ముఖ్యంగా నీటిపారుదల, గ్రామీణ అభివృద్ధి, తాగునీటి సరఫరా సహా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉందని సూచించారు.

ప్రధానంగా తాగునీటి కొరత రాకుండా, సమర్థవంతంగా ఉన్న నీటి నిల్వలను కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నీనో ప్రభావం కేవలం తెలంగాణలో మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మంత్రి తుమ్మల సూచించారు.

చిన్నారెడ్డి చైర్మన్‌గా రాష్ట్రంలో ఎల్‌నినోపై అధ్యయనం
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయం, అనుబంధ రంగాలపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేసి, నివారణ చర్యలు సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం 27 మంది సభ్యులతో ఉన్నత స్థాయి వివిధ విభాగాల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఉత్తర్వులు (ఆర్టీఈ నెం. 427) శనివారం జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జి. చిన్నారెడ్డిని కమిటీ చైర్మన్‌గా నియమించగా, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

వ్యవసాయం, నీటిపారుదల, అటవీ, విద్యుత్‌, పశుసంవర్ధక, మత్స్య, విద్యాశాఖల ఉన్నతాధికారులతో పాటు ఇక్రిశాట్‌, ఐఎండీ, క్రీడా, ఐఐఎంఆర్‌, ఐఐఓఆర్‌ శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, మార్క్‌ఫెడ్‌, టీజీ ఆయిల్‌ ఫెడ్‌, నాబార్డ్‌ ప్రతినిధులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేయడం, వ్యవసాయం, అనుబంధ రంగాలకు నష్టం తగ్గించే నివారణ, అనుసరణ చర్యలను ప్రభుత్వానికి సూచించడం, రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు అమలు చేయాల్సిన అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం కమిటీ ప్రధాన బాధ్యతలుగా ప్రభుత్వం పేర్కొంది. కమిటీ సంబంధిత వర్గాలతో సమావేశాలు నిర్వహించి, ఎప్పటికప్పుడు నివేదికలు, సిఫార్సులను ప్రభుత్వానికి అందజేయనుంది.

ట్యాగ్‌లు: elnino Telangana thummala