టీఎంసీ రెబల్స్‌కు ప్రత్యేక సీట్లు
టీఎంసీ రెబల్స్‌కు ప్రత్యేక సీట్లు
షిండే వర్గంలో యూబీటీ ఎంపీల విలీనానికి స్పీకర్ బిర్లా ఆమోదం
న్యూఢిల్లీ: శివసేన (యూబీటీ)లోని ఆరుగురు ఎంపీలు శివసేన (షిండే వర్గం)లో విలీనానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం ఆమోదం తెలిపారు. దీంతో థాక్రే వర్గానికి చెందిన ఎంపీలు ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనమైనట్లు అధికారికంగా గుర్తించారు.
దీంతో లోక్‌సభలో షిండే శివసేన బలం 13 మంది ఎంపీలకు పెరగగా, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ – ఉద్ధవ్ బాల్ థాక్రే)కు ముగ్గురు ఎంపీలే మిగిలారు.
అదే సమయంలో స్పీకర్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి విడిపోయి ‘నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)’లో విలీనమైనట్లు ప్రకటించిన 20 మంది రెబల్ ఎంపీలకు లోక్‌సభలో ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా స్పీకర్ అనుమతి ఇచ్చారు.
అయితే వారి పార్టీ విలీనాన్ని మాత్రం ఇంకా అధికారికంగా గుర్తించలేదు. కానీ లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్‌తో కాకుండా వేరుగా కూర్చునేందుకు అనుమతిని ఇచ్చారు.
గత నెలలో టీఎంసీ రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని 20 మంది ఎంపీలు టీఎంసీని వీడి ఎన్‌సీపీఐలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. అలాగే శివసేన (యూబీటీ)లోనూ చీలిక ఏర్పడి, ఆరుగురు లోక్‌సభ సభ్యులు శివసేన (షిండే వర్గం)లో చేరగా, వీటికి సంబంధించి తాజాగా స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయాలు ప్రకటించారు.
లోక్‌సభ సెక్రటేరియట్ ఇప్పటికే సవరించిన పార్టీ బలాబలాల జాబితాను శనివారం విడుదల చేసింది. షిండే నేతృత్వంలోని శివసేన బలం లోక్‌సభలో 13 మంది ఎంపీలకు చేరగా, దీంతో ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక మంది ఎంపీలు కలిగిన రెండో మిత్రపక్షంగా నిలిచింది.
ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ (టీడీపీ)కి 16 మంది ఎంపీలు ఉండగా, ఎన్డీఏలో ఎక్కువ మంది ఎంపీలు ఉన్న మొదటి మిత్రపక్షంగా ఉంది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం స్పీకర్‌తో సహా లోక్‌సభలో ఎన్డీఏ బలం 298కి చేరింది. టీఎంసీ రెబల్ ఎంపీల విలీనానికి కూడా స్పీకర్ ఆమోదం లభిస్తే ఎన్డీఏ బలం ఏకంగా 318కి చేరుతుంది.
లోక్‌సభలో ప్రస్తుతం 540 మంది సభ్యులు ఉండగా, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడింట రెండొంతుల మెజార్టీకి అవసరమైన సంఖ్యకు ఎన్డీఏ మరింత చేరువయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.