పార్లమెంటులో ‘తుఫాన్’కు అధికార, ప్రతిపక్షాలు సిద్ధం
జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
- రాముడి విరాళాలు, ప్రధాన్ రాజీనామా కీలకం
- రేపటి నుండి వర్షాకాల పార్లెమెంటు సమావేశాలు ప్రారంభం
- ధరలు, విదేశాంగ విధాన వైఫల్యం, అవినీతి
- సహా కీలక బిల్లులపై కాంగ్రెస్ ఎదురుదాడి వ్యూహం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. బయట ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తుఫాన్ తరహా వాగ్యుద్ధానికి ప్రతిపక్షాలు సన్నద్ధమవుతుండగా, అధికారపక్షం కూడా అదే తరహాలో ప్రతిఘటించేందుకు సిద్ధమవుతున్నది.
అయోధ్య రామాలయంలో భక్తుల విరాళాల దుర్వినియోగం, అవినీతిపై కేంద్ర, రాష్ట్ర (యూపీ) పాలకుల అలసత్వం, నీట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్, పార్లమెంటుకు కేవలం రెండు, మూడు కి.మీ. దూరంలో ఉండే జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) బైఠాయింపు, సమావేశాల ప్రారంభం మొదటి రోజు పార్లమెంటుకు సిజెపి తలపెట్టిన నిరసన ప్రదర్శన వంటి తీవ్ర ఉద్రిక్తత మధ్య సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, కుంభకోణాలు, అవినీతి, ధరల పెరుగుదల, నీట్ పరీక్షల్లో వైఫల్యం, విదేశాంగ విధానంలో వైఫల్యాలు వంటి అంశాలు ప్రధానంగా సభలో ప్రస్తావిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే ప్రకటించారు.
కాగా, ఆదివారం (జులై 19)న ప్రభుత్వం సంప్రదాయబద్ధంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్, అయోధ్యలో రామాలయానికి భక్తులు ఇచ్చిన విరాళాల అవినీతి అంశాలపై ప్రతిపక్షాలు ఎక్కువ దృష్టి కేంద్రీకరించనున్నాయి.
దాదాపు ప్రతిపక్షాలతో సమానంగా ప్రభుత్వం కూడా పోరాట ధోరణినే అనుసరిస్తూ, తమకు అవసరమైన బిల్లులన్నింటినీ ఆమోదింపజేసుకునే విషయాలపై దృష్టి పెట్టేందుకు సిద్ధపడింది.
ప్రస్తుతం ఆసుపత్రికి తరలించిన కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు సోనమ్ వాంగ్‌చుక్ 21 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభ దినం సోమవారం వరకు తాను ఖచ్చితంగా ఉంటానని, ఒకవేళ అప్పటిలోగా సిజెపి ఆశయాలు నెరవేరకపోతే ఆ తర్వాత తాను ఆత్మరూపంలో వచ్చి డిమాండ్ చేస్తానని సోనమ్ వాంగ్‌చుక్ వ్యాఖ్యలు చేశారు.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గానీ, గత సమావేశాల కాలంలో పెండింగ్‌లో పడిన వాటితో సహా కీలకమైన అన్ని బిల్లులను ఈసారి ఆమోదించుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో ఆర్బిట్రేషన్ కౌన్సిల్ బిల్లును ఆమోదించే విషయంలో కూడా సర్వోన్నత న్యాయస్థానం నుండి పరోక్ష ఒత్తిడి వస్తోంది.
ఎఫ్‌సీఆర్ఏ సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్ష అధిష్ఠాన్ బిల్లు, వందేమాతరం క్రిమినల్ అఫెన్స్ బిల్లు వంటివి కూడా ఉన్నాయి.
రెండు ముఖ్యమైన బిల్లుల విషయంలో ఎన్డీఏ ఎంపీలు వ్యతిరేకతతోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ విశ్వాసంతో ఉన్నప్పటికీ, రాష్ట్రాలకు తగిన రక్షణలు ఉంటే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు ముసాయిదాలలో మార్పులు పరిశీలించాక స్పందిస్తామని ఎన్సీపీ (ఎస్‌సీపీ), శివసేన (యూబీటీ) సంకేతాలు ఇచ్చాయి.
డీఎంకే కూడా 131వ రాజ్యాంగ సవరణను తీవ్రంగా వ్యతిరేకించి, గడచిన ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో దీనిని ఓడించినప్పటికీ, కొత్త ముసాయిదా బిల్లు ఎలా ఉంటుందో చూశాక స్పందిస్తామని పేర్కొంది. కానీ ఈ విషయంలో మిత్రులంతా తమతోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసంతో ఉంది.
కొన్ని అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత ఈసారి పార్లమెంటులో ఫిరాయింపులు కారణంగా సమీకరణలు మారిపోయాయి. శత్రు శిబిరాల నుండి ఫిరాయింపులతో ఎంపీల స్థానాలు మారడంతో పరిస్థితులు మారాయి. దీంతో ఈసారి అధికారపక్షం నిర్వాకాలపై ప్రతిపక్షాలు పదునైన పదజాలంతో ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమయ్యాయి.
20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీఏకు అనుకూలంగా మారారు. మరో ఆరుగురు ఎస్‌ఎస్‌ఎస్-యూబీటీ ఎంపీలు వారివారి సొంత పార్టీలకు దూరమై లోక్‌సభలో ఎన్డీఏకు మద్దతుగా ఉన్నారు. స్పీకర్ గనుక తిరుగుబాటు ఎంపీలపట్ల సానుకూలంగా వ్యవహరిస్తే లోక్‌సభలో ఎన్డీఏ బలం కొంత పెరుగుతుంది.
పార్లమెంటు ఎజెండాలో చేర్చకపోయినప్పటికీ, కొత్త వాతావరణం మధ్య గత సమావేశాల్లో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణతోపాటు మహిళా బిల్లు మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది. కానీ రాజ్యాంగ సవరణ ఆమోదానికి ఈ బలం చాలదు.
ప్రస్తుతం 540 మంది ఎంపీలు ఉంటే సభలో 360 మంది ఎంపీల బలం కావాలి. కానీ మూడు స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. రాజ్యాంగ సవరణను ఆమోదించాలంటే మూడింట రెండు వంతుల మెజార్టీ ఉండాలి. రాజ్యసభలో ఎన్డీఏకు కొన్ని సీట్ల మెజార్టీ తక్కువగా ఉంది. ఎవరైనా గైర్హాజరైతే వారికి సహాయపడవచ్చు కూడా.
వీటిని ఆమోదింపజేసుకునేందుకు అధికారపక్షం మరోసారి గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. బీజేపీ, ఎన్డీఏ వ్యూహకర్తలు చురుగ్గా వీటిపై ఆలోచనలు చేస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి వ్యూహానికి సన్నద్ధమైంది.
మరోవైపు జమ్మూ కశ్మీరు స్వయంప్రతిపత్తి అంశం కూడా మరో అంశంగా అక్కడి ఎంపీలు చాలా గట్టిగా ప్రస్తావించేందుకు సిద్ధమయ్యారు.