Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

వాస్తు, జ్యోతిష్యాలను నిరసించిన ఖగోళ శాస్త్రవేత్త… నార్లేకర్‌

Prajapaksham 19 Jul 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
వాస్తు, జ్యోతిష్యాలను నిరసించిన ఖగోళ శాస్త్రవేత్త… నార్లేకర్‌

వైజ్ఞానిక ప్రపంచంలో మన దేశం తలెత్తుకుని చెప్పుకోగల ఓ పదిమంది శాస్త్రవేత్తలలో డాక్టర్‌ జయంత్‌ విష్ణు నార్లేకర్‌ ఒకరు. (19 జులై 1938 – 20 మే 2025) పాప్యులర్‌ సైన్స్‌ రచయితగా ప్రసిద్ధుడు. అంతేకాదు, సాహిత్యరంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నవాడు. బహు గ్రంథకర్త.

పూణాలో నెలకొల్పిన ఇంటర్‌ యూనివర్శిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ (ఖగోళ శాస్త్ర అంతర్‌ విశ్వవిద్యాలయం) కేంద్రానికి ప్రారంభ దశలోనే డైరెక్టర్‌గా ఉన్నవాడు. జీవిత చరమాంకంలో కూడా జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో, సింపోజియాలలో చురుకుగా పాల్గొనేవాడు.

దేశంలో దూరదర్శన్‌ ఒక్కటే ఉన్న రోజుల్లో అది ప్రసారం చేసే వైజ్ఞానిక కార్యక్రమాలలో తరచూ కనిపిస్తుండేవాడు. ఆ రోజుల్లో దూరదర్శన్‌ కార్యక్రమాలలో ‘సురభి’ అనే ప్రోగ్రాం ప్రత్యేకంగా ఉండేది. అందులో జయంత్‌ నార్లేకర్‌ శ్రోతలు/ప్రేక్షకులు అడిగిన వైజ్ఞానిక సంబంధమైన ప్రశ్నలకు జవాబులిస్తుండేవాడు. వారి సందేహాలు తీరుస్తూ ఉండేవాడు.

వయసు మీద పడిన సమయంలో కూడా ఆయన తన పరిశోధనలు కొనసాగిస్తూనే వచ్చాడు. ముఖ్యంగా ‘బ్లాక్‌ హోల్స్‌’ మీద, టఖియాన్స్‌ (Tachyons) మీద ఆయన పరిశోధనలు చెప్పుకోదగ్గవి. భూమ్యాకర్షణ శక్తి మీద ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, 1964లో అంటే, తన ఇరవై ఆరవ యేటనే విజ్ఞాన జగత్తును ఆశ్చర్యపరిచాడు. విశేషంగా ఆకర్షించాడు! ఫలితంగానే, ‘భారతదేశపు ఐన్‌స్టీన్‌’గా ప్రశంసలందుకున్నాడు.

ఇంతటి ప్రతిభావంతుడైన మన భారతీయ శాస్త్రవేత్త ఇటీవల రెండు నెలల కింద కన్నుమూస్తే, మన దేశంలో పత్రికలూ, మీడియా సంస్థలు తమకేమీ పట్టనట్టు మిన్నకున్నాయి. ఎంత విషాదం? అదే రాజకీయ నాయకుల తిట్ల పురాణాలు, సినిమా, క్రికెట్‌ వార్తలు ఢంకా బజాయిస్తూ వెలుగులోకి తెస్తాయి. సమాజంలో వివేకం పెంచడానికి జీవితాలు ధారపోసిన వారిని పట్టించుకోవు.

జయంత్‌ నార్లేకర్‌ చిన్నతనం నుండే చురుకైన విద్యార్థిగా ఉండడానికి కారణం, వారిది విద్యావంతుల కుటుంబం. ఇంట్లో అందరికందరూ హేమాహేమీలు. తండ్రి విష్ణు వాసుదేవ్‌ నార్లేకర్‌ బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌. తల్లి సుమతి నార్లేకర్‌ సంస్కృత పండితురాలు. తల్లి సోదరుడు, మామ, గణాంక శాస్త్ర నిపుణుడు.

ఆయన దగ్గరైతే పిల్లవాడు వృద్ధిలోకి వస్తాడని తల్లిదండ్రులు జయంత్‌ను వారణాసిలోని మామగారింట్లో ఉంచారు. పుట్టిందైతే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో. ఆ మామగారు చదువు విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. పొద్దున్నే లేచి నల్లబల్లమీద ఒక లెక్క రాసి ఉంచేవాడు. ఇక బాల జయంత్‌ నానా తంటాలు పడి ఆ లెక్క సాయంత్రంలోగా పూర్తి చేయాల్సిందే!

లెక్కలు, భౌతికశాస్త్రం, ఖగోళశాస్త్రం ఇంట్లో ఎప్పుడూ చర్చనీయాంశాలవుతూ ఉండేవి. బాల్యంలో లభించిన ఆ వాతావరణం జయంత్‌ నార్లేకర్‌పై ఎంతో ప్రభావం చూపింది.

బాల్యంలో అతను వారణాసిలోని హిందూ బోయ్స్‌ స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత బెనారస్‌ విశ్వవిద్యాలయంలో 1957లో బిఎస్‌సిలో చేరాడు. తర్వాత లండన్‌ వెళ్లి, అక్కడి కేంబ్రిడ్జి యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఫిట్జ్‌విలియం కాలేజీలో చేరాడు. అది ఒకప్పుడు తన తండ్రి విష్ణు వాసుదేవ్‌ నార్లేకర్‌ చదువుకున్న కళాశాలే.

అక్కడి నుంచి జయంత్‌ గణితశాస్త్రంలో బిఎ డిగ్రీ తీసుకున్నాడు. అయితే ఆయన సీనియారిటీని, సిన్సియారిటీని, ప్రతిభను గుర్తించి, చదవకుండానే వారు ఈయనకు ఎంఎ డిగ్రీ ప్రదానం చేశారు. ఇలాంటి సంఘటనలు సామాన్యంగా జరగవు కదా?

ఆ తర్వాత జయంత్‌ నార్లేకర్‌ ఫ్రెడ్‌ హొయిలీ దగ్గర పరిశోధన కోసం చేరాడు. ఆయన పర్యవేక్షణలో నార్లేకర్‌ పిహెచ్‌డీ సాధించాడు. ఆ రోజుల్లోనే ఈయనకు రీసెర్చ్‌ గైడ్‌గా ఉన్న ఫ్రెడ్‌ హొయిలీ కేంబ్రిడ్జిలో ‘థియరిటికల్‌ ఆస్ట్రానమీ’ అనే సంస్థను ప్రారంభించాడు.

అందులో నార్లేకర్‌ సీనియర్‌ ఫెలోగా ఉంటూ, తన గైడ్‌ హొయిలీకి పూర్తి సహాయ సహకారాలు అందించాడు. ఏవో ఇతర కారణాల వల్ల ఫ్రెడ్‌ హొయిలీ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల జయంత్‌ నార్లేకర్‌ కూడా ఇక అక్కడ కొనసాగలేక భారతదేశానికి తిరిగి వచ్చాడు.

అన్ని అర్హతలున్నాయి కాబట్టి, రావడం రావడంతోనే ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చిలో ప్రొఫెసర్‌గా చేరాడు. అక్కడ చాలాకాలం పనిచేశాడు. అక్కడ థియరిటికల్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌ గ్రూపును తయారు చేసుకున్నాడు. అనతికాలంలో ప్రపంచ వైజ్ఞానికుల దృష్టిని ఆకట్టుకున్నాడు. అందుకు కొన్ని కారణాలున్నాయి.

పరమాణువంతటి వస్తువు పెద్ద శబ్దం చేస్తూ విచ్ఛిన్నమవడంవల్ల ఈ నక్షత్రాలు, గెలాక్సీలు, నెబ్యులాల వంటివి ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞుల నమ్మకం. కానీ, అందుకు వ్యతిరేకంగా నార్లేకర్‌ స్టెడీ స్టేట్‌ థియరీని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం పదార్థం నక్షత్రాలుగా, గెలాక్సీలుగా, ఇతర ఆకారాలుగా విశ్వమంతా సమానంగా వ్యాపించి ఉంది.

ఒకవేళ గెలాక్సీల కదలిక వల్ల, తీవ్రమైన వేగం వల్ల ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వాటిని కొత్తగా ఏర్పడ్డ పదార్థం పూరిస్తూ ఉంటుంది. ‘స్టెడీ స్టేట్‌ థియరీ’తో పాటు, తన పరిశోధక గురువు ఫ్రెడ్‌ హొయిలీతో పనిచేస్తున్నప్పుడు నార్లేకర్‌ గురుత్వాకర్షణపై కూడా కృషి చేశాడు.

చిన్న వయసులోనే తన అసమాన ప్రజ్ఞ ప్రదర్శించి, వైజ్ఞానిక ప్రపంచాన్ని అబ్బురపరిచి, తన స్థానం సుస్థిరపరుచుకున్నాడు. ఇక భారతదేశానికి తిరిగి వచ్చి, ఇక్కడి టాటా ఇన్‌స్టిట్యూట్‌లో తన విద్యార్థులతో అనేక పరిశోధనలు చేయించాడు.

బ్లాక్‌ హోల్స్‌ కంటే, వెలుతురు కణాల కంటే వేగంగా ప్రయాణించగల టఖియాన్స్‌ మీద జరిపించిన పరిశోధనలు విలువైనవి. ఒక చెంచా వెడల్పుగల బ్లాక్‌ హోల్‌ బరువు కొన్ని టన్నులుంటుంది. దాని ఉపరితలం నుంచి కనీసం వెలుగు రేఖల్ని కూడా అది పోనీయదు.

నార్లేకర్‌ ప్రతిపాదించిన దాన్ని బట్టి బ్లాక్‌ హోల్‌ టఖియాన్స్‌ని తనలో ఇముడ్చుకుని (పీల్చుకుని) తన ఉపరితల వైశాల్యాన్ని తగ్గించుకోగలుగుతుంది. అందువల్ల టఖియాన్స్‌ని వెతకడం అంటే తగ్గిపోతున్న బ్లాక్‌ హోల్స్‌ని వెతకడమే!

జయంత్‌ నార్లేకర్‌ నిర్వహించిన ఉన్నత పదవులు, స్వీకరించిన అత్యున్నత పురస్కారాలు ఎన్నో ఉన్నాయి. 1981లో వరల్డ్‌ కల్చరల్‌ కౌన్సిల్‌కు ఈయనే సంస్థాపక సభ్యుడు. 1988లో పూణేలోని ఇంటర్‌ యూనివర్శిటీ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌కు తొలి డైరెక్టరయ్యాడు. ఆ కాలంలోనే అంతర్జాతీయ ఆస్ట్రానమికల్‌ యూనియన్‌కు అధ్యక్షుడయ్యాడు.

బోధన, పరిశోధనలకు మాత్రమే కాకుండా, ఈయనకు రచనలో కూడా ప్రవేశముంది గనుక, భారత ప్రభుత్వం నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ)కి చైర్మన్‌గా నియమించింది.

ఆ కాలంలోనే నార్లేకర్‌ వాస్తు శాస్త్రం, జ్యోతిష్యాలను తీవ్రంగా దుయ్యబట్టారు. నిరూపణ లేని వాటిని శాస్త్రం, సైన్సూ అని అనగూడదనీ, అలాంటివన్నీ “సూడో సైన్స్‌” అని ప్రకటించాడు.

భారత ప్రభుత్వం నుండి 1965లో పద్మభూషణ్‌, 2004లో పద్మవిభూషణ్‌ వంటి పౌర సన్మానాలు స్వీకరించాడు. ఆయన చేసిన సరళ విజ్ఞాన శాస్త్ర ప్రచారాన్ని గుర్తించి యునెస్కో 1996లో కళింగ ప్రైజ్‌ ప్రకటించింది. ఇంకా లెక్కలేనన్ని అంతర్జాతీయ మెడల్సూ, బహుమతులు స్వీకరించాడు. ఆ లిస్టు చాలా పెద్దది.

వైజ్ఞానిక పరిశోధనా రంగంలోనే కాకుండా జయంత్‌ నార్లేకర్‌ సాహిత్యరంగంలో కూడా విశేషమైన కృషి చేశాడు. మరాఠీ భాషలో తొమ్మిది, ఇంగ్లీషులో మూడు, హిందీలో ఒకటి ఇలా పలు సృజనాత్మక రచనలు ప్రకటించాడు.

అందులో ‘చార్‌ నగరాంతలే మాజే విశ్వ’ అని ఆయన మరాఠీలో రాసుకున్న ఆత్మకథకు 2014లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. 2021 నాసిక్‌లో జరిగిన 94వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు.

పాపులర్‌ సైన్స్‌ రచయితగా నార్లేకర్‌ రాసిన పుస్తకాలలో ఒకటి తెలుగులో కూడా “ఆలోకం” పేరుతో అనువదించబడింది. ఈయన ‘యూనివర్స్‌’ అనే టి.వి. సీరియల్‌ను 1995లో దూరదర్శన్‌ ప్రసారం చేసింది. ఆ సంవత్సరమే ఇందిరా గాంధీ సైన్స్‌ పాపులరైజేషన్‌ అవార్డు స్వీకరించాడు. మరీ ముఖ్యంగా 1986 మధ్యకాలంలో నాలుగేళ్లపాటు భారత ప్రధానికి సైన్స్‌ సలహాదారుగా ఉన్నాడు.

జయంత్‌ నార్లేకర్‌ భార్య మంగళ నార్లేకర్‌ కూడా గణితశాస్త్ర పరిశోధకురాలే. ఆమె కూడా ప్రొఫెసర్‌గా పనిచేసింది. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వారంతా ఉన్నత విద్యావంతులు. పెద్దమ్మాయి గీత కాలిఫోర్నియా యూనివర్శిటీలో బయోమెడికల్‌ రీసెర్చ్‌ చేసింది. తరువాత వాళ్లు గిరిజ, లీలావతి కంప్యూటర్‌ సైన్స్‌ రంగాన్ని ఎంచుకున్నారు.

భార్య మంగళ జయంత్‌ నార్లేకర్‌ కన్నా రెండేళ్లు ముందే చనిపోయింది. ఇక జయంత్‌ నార్లేకర్‌ ఎనభై ఆరేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ, 2025 మే 20న మహారాష్ట్ర పూణేలో స్వంత ఇంట్లో నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూశారు.

ఎన్ని గౌరవాలు లభించినా, ఆయన తన కృషిని చివరి క్షణం వరకు ఆపలేదు. నిత్య శోధకుడిలా, నూతన విద్యార్థిలా, కొత్త కొత్త పథకాలతో కొత్త దిశలు వెతుకుతూనే వచ్చాడు. మృదుభాషి, వినయ సంపన్నుడు, స్నేహశీలి అయిన జయంత్‌ నార్లేకర్‌ వ్యక్తిత్వం, వైజ్ఞానిక సాహిత్య కృషి నేటి యువతరానికి ఆదర్శప్రాయం కావాలి!

శాస్త్రవేత్తల పరిశోధనలన్నీ, పరిశోధనల ఫలితాలన్నీ సమాజానికి లభిస్తున్నందువల్లనే సమాజం త్వరితగతిన ప్రగతి పథాన పయనిస్తోంది. అలాంటప్పుడు వారిని ఆయా రంగాలకు మాత్రమే పరిమితం చేయకుండా, తెరవెనుక ఉండి కృషి చేస్తున్న ‘సంఘ సంస్కర్తలు’గా గుర్తుంచుకోవాలి. వివేకవంతమైన సమాజం ఎప్పుడూ సమాజ నిర్మాణంలో భాగస్వాములయ్యే వారిని గుర్తించుకుంటూ ఉండాలి! గౌరవించుకుంటూ ఉండాలి!! అప్పుడే అది ఆరోగ్యకరమైన సమాజం అవుతుంది.

(19 జులై జయంత్‌ విష్ణు నార్లేకర్‌ జయంతి)

ట్యాగ్‌లు: science and technology