రేపు బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ ప్రమాణ స్వీకారం
రేపు బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ ప్రమాణ స్వీకారం
బ్రిటన్ లేబర్ పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టిన ఆండీ బర్న్‌హామ్ జులై 20వ తేదీన దేశ ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. భారీ ప్రణాళికతో ఆయన బరిలోకి దిగుతున్నారు. పదవి చేపట్టాక ఉత్తర సముద్రంలో కొత్తగా గ్యాస్-చమురు తవ్వకాలకు సంబంధించిన ఒక ప్రణాళికను ప్రకటించనున్నారు. బ్రిటన్ మీడియా సమాచారం ప్రకారం, దేశంలో కొత్త లైసెన్సులు జారీ చేయకుండా, ఉన్న లైసెన్సులను గౌరవించి ఉత్తర సముద్రంలో చమురు-గ్యాస్ తవ్వకాలపై స్టార్మర్ కాలంలో చెలరేగిన వివాదాన్ని ముగించాలని ఆయన కోరుకుంటున్నారు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సొంత వనరులను సద్వినియోగం చేసుకోలేకపోవడం అవివేకమని ఆయన వ్యాఖ్యానించారు. గడచిన పది సంవత్సరాలుగా దేశం ఎదుర్కొంటున్న అస్థిరత, రాజకీయ సంక్షోభానికి తెరదించి, వర్తమాన అస్థిర ప్రపంచ రాజకీయాల్లో దేశాన్ని స్వయంసమృద్ధి దిశగా తీసుకువెళ్లి, 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి లేబర్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఒక ముందస్తు ప్రణాళికతో ఆయన రంగప్రవేశం చేస్తున్నారు.
లేబర్ పార్టీని సంస్కరించడానికి, దేశంలో పరివర్తన తీసుకురావడానికి ఐదు మార్గదర్శకాంశాలను బర్న్‌హామ్ ప్రకటించారు. ప్రజల జీవన వ్యయాల భారాలు తగ్గిస్తామని, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు.
గడచిన నాలుగు దశాబ్దాల బ్రిటన్ రాజకీయాలలో రాబోయే పరివర్తనకాలాన్ని అత్యంత ముఖ్యమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. దేశంలో, లేబర్ పార్టీలో మార్పులు తెచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఎలాంటి పోటీ లేకుండా లేబర్ పార్టీ నాయకుడిగా శుక్రవారం విజయం సాధించిన తర్వాత జరిగిన ప్రత్యేక సదస్సులో బర్న్‌హామ్ తన భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పారు. 2024లో పార్టీ అధికారంలోకి రావడానికి ప్రకటించిన ప్రణాళిక అంశాలను, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని చెప్పారు.
పార్టీలో అంతర్గత కలహాలను అంతం చేస్తానని, భిన్నాభిప్రాయాలకు విలువ ఇస్తానని చెప్పారు. బ్రిటన్‌లో సరికొత్త రాజకీయ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రధానమంత్రి నివాసం, కార్యాలయమైన టెన్ డౌనింగ్ స్ట్రీట్ అధికారుల నుండి అత్యంత ప్రమాదకరమైన, పొంతనలేని ప్రకటనల సంస్కృతికి కూడా అంతం పలుకుతానని చెప్పారు.
గడచిన పది సంవత్సరాలుగా బ్రిటన్ రాజకీయాలు ఎదుర్కొంటున్న అస్థిరత, గందరగోళానికి అంతం పలకాలని కోరుకుంటున్నానని, వీలైనంత ఏకాభిప్రాయాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.
గడచిన పది సంవత్సరాలలో బ్రిటన్ ఇప్పటికి ఏడుగురు ప్రధానమంత్రులను (కాబోయే బర్న్‌హామ్‌తో సహా) చూసింది.