Skip to content
ఎడిట్ పేజి వార్తలు

Editorial: దీక్షపై దౌర్జన్యం

Prajapaksham 19 Jul 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
Editorial: దీక్షపై దౌర్జన్యం

Editorial: దీక్షపై దౌర్జన్యం

21 రోజులుగా వాంగ్‌చుక్‌ దీక్షను మోదీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే పట్టించుకోవడం లేదు. ఇతరుల తప్పులనే ఎన్నడం నేర్చుకొని, తమ తప్పులను కప్పిపుచ్చటమే కాకుండా, ఎత్తిచూపిన వారిని నిరంకుశంగా అణిచివేయటం ఈ ప్రభుత్వానికి అలవాటే.

ఊహించిందే జరిగింది. ప్రజాస్వామిక ఉద్యమాలను అణిచివేసేందుకు గతం నుంచి అనుసరిస్తోన్న పద్ధతినే మోదీ ప్రభుత్వం మరోసారి ప్రయోగించింది. నీట్‌ పరీక్షాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోరుతూ సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేస్తున్న శాంతియుత నిరసనపై దౌర్జన్య అస్త్రాన్నే ప్రయోగించింది.

ఇరవై ఒక్కరోజులుగా ఆయన నిరవధిక నిరాహార దీక్షకు వేదికగా నిలిచిన జంతర్‌మంతర్‌ శిబిరంపై మఫ్టీలో ఉన్న పోలీసులు ఒక్కసారిగా విరుచుకపడ్డారు. ఇందుకు శిబిరం పలుచగా ఉండే ఉదయం ఏడు గంటల సమయాన్ని ఎంపిక చేసుకున్నారు. శరవేగంగా వాంగ్‌చుక్‌ శయనించిన వేదికపైకి దూసుకుపోయి, పైన జరిగేదేమీ కనిపించకుండా తెల్ల దుప్పట్ల తెరను అడ్డుగా ఉంచారు.

ఆయనను దౌర్జన్యంగా ఎత్తుకెళ్లే దృశ్యాలు కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకే సర్కారు పన్నిన పన్నాగాన్ని పక్కాగా అమలు చేసేందుకే ఈ తాపత్రయమంతా. ఆ సమయంలో సోనమ్‌ వాంగ్‌చుక్‌ను ఎత్తుకెళ్లకుండా అడ్డుపడిన వారిపై పోలీసుల దండప్రయోగం జరిగింది. వారందరినీ తప్పించి ఆయనను భారీ పోలీసు బందోబస్తు మధ్య సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించారు.

హైకోర్టు ఆదేశాల మేరకే తామీ పనిచేసినట్లుగా ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్‌ తమ చర్యను సమర్థించుకున్నారు. అయితే, ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఏమి చెప్పింది?

దీక్ష చేస్తున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌ను బలవంతంగానైనా ఆసుపత్రిలో చేర్చి ద్రవరూపంలో పోషకాలను అందించాలని కోరుతూ మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి కోర్టు తలుపు తట్టాడు. దీనిపై ప్రభుత్వ వాదనలు విన్న తరువాత హైకోర్టు ఆయన (వాంగ్‌చుక్‌)కు నిరంతరం, ప్రతిరోజూ ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరగాలని, నివేదికల ఆధారంగా అవసరమైతే చికిత్స అందించాలని, ప్రతి ప్రాణం అమూల్యమైనదని ఆదేశాలు జారీ చేసింది.

తాను బలహీనంగా ఉన్నప్పటికీ, కండరాలు సడలినప్పటికీ, చురుకుగానే ఉన్నానని, దీక్షను కొనసాగిస్తానని, ప్రభుత్వ నిస్పందనకు నిరసనగా జులై 20న చలో పార్లమెంట్‌ను విజయవంతం చేయాలని వాంగ్‌చుక్‌ దీక్ష 18వ రోజున వీడియో సందేశమిచ్చారు. శుక్రవారం ఆయనను పరీక్షించిన వైద్యుడు సైతం ఒంట్లో నీరు తగ్గినప్పటికీ, ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.

మరుసటి రోజే కేంద్రం కన్నుసన్నల్లో పనిచేసే ఢిల్లీ పోలీసులు దీక్షా శిబిరంపై దాడి జరిపారు. దుప్పట్లో చుట్టేసి ఆయనను ఆసుపత్రికి తరలించారు. నిజంగానే వాంగ్‌చుక్‌ ఆరోగ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధే కనుక ఉంటే, ఆయనను వాకబు చేసి, ఆసుపత్రికి తీసుకెళ్తామని మర్యాదగా కోరాల్సింది.

అలా కాకుండా, శిబిరంపై విరుచుకుపడి, కనీసం స్ట్రెచర్‌ కూడా తీసుకురాకుండా, దుప్పట్లోనే చుట్టి బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించటంలోనే ఆంతర్యం స్పష్టం. ఆసుపత్రికి వెళ్లిన వాంగ్‌చుక్‌ జీవిత సహచరి గీతాంజలి ఆంగ్మో ఆయనను కలిసిన తరువాత దీక్ష కొనసాగుతోందని ప్రకటించారు.

ముందురోజు వరకూ రక్తంలో వాంగ్‌చుక్‌ 4.8 శాతం ఉన్న పొటాషియం స్థాయి సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చేరిన వెంటనే 2.9 శాతానికి పడిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పడంపై ఆమె వ్యక్తం చేసిన సందేహాలలో కూడా వాస్తవం లేకపోలేదు.

ఇప్పటికే 21 రోజులుగా దీక్షలో ఉన్న అఖిల భారత విద్యార్థి సంఘం (ఐసా) నాయకులు నేహా, ఆమీన్‌, మనీశ్‌లతో పాటు మరో విద్యార్థి హమద్‌లను కూడా ఎత్తుకెళ్లేందుకు ఉదయం వచ్చిన పోలీసులకు విద్యార్థులు అడ్డుగోడగా నిలిచారు. ఆ నలుగురు కూడా దీక్షను కొనసాగిస్తున్నారు.

కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే కూడా జంతర్‌మంతర్‌ దీక్షా శిబిరంలో తక్షణమే నిరవధిక దీక్షకు దిగడమే కాకుండా, 20న చలో పార్లమెంట్‌ యథావిధిగా కొనసాగుతుందనడం ద్వారా పాలకుల ఆశలను నీరుగార్చారు. ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో ప్రభుత్వ తీరును ఖండించటమే కాకుండా, వాంగ్‌చుక్‌కు అండగా నిలిచాయి.

ఈ సందర్భంగా గతంలో అన్నా హజారే ఇదే జంతర్‌మంతర్‌లో దీక్ష చేసిన ఘట్టాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం నిరంతరం ఆయనతో చర్చలు జరిపి, ఆయన కోరినట్లుగా చట్టాన్ని తీసుకువస్తామనే హామీతో దీక్ష విరమింపజేసింది.

నేడు అందుకు పూర్తిగా విరుద్ధంగా, 21 రోజులుగా వాంగ్‌చుక్‌ దీక్షను మోదీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే పట్టించుకోవడం లేదు. ఇతరుల తప్పులనే ఎన్నడం నేర్చుకొని, తమ తప్పులను కప్పిపుచ్చటమే కాకుండా, ఎత్తిచూపిన వారిని నిరంకుశంగా అణిచివేయటం ఈ ప్రభుత్వానికి అలవాటే.

గతంలో ఢిల్లీ సరిహద్దులోని రైతుల నిరసన, జంతర్‌మంతర్‌ వద్ద ‘ఒకే ర్యాంక్‌ ఒకే పెన్షన్‌’ కావాలంటూ మాజీ సైనికాధికారుల నిరసన, తమపై అధికార పార్టీ ఎంపీ ఆగడాలపై మహిళా రెజ్లర్ల నిరసన, షాహీన్‌బాగ్‌లో సీఏఏ నిరసనలపై ఇదే రీతిలో ఉక్కుపాదం మోపడాన్ని చూశాం. ఇప్పుడూ అదే జరుగుతోంది.

అయితే, ఈసారి ప్రభుత్వ నియంతృత్వ సెగలను నవతరం (జెన్‌జీ), గతంలో బిజెపికి అండగా నిలిచిన పట్టణ మధ్యతరగతి వర్గం చవిచూస్తుండడం కొత్త పరిణామం. తమ మొరను ప్రభుత్వం పట్టించుకోకపోయినా, నిర్బంధాలను, ఆటంకాలను దాటుకొని ప్రజలు కట్టుదప్పక శాంతిపథంలోనే తమ నిరసనను దేశ రాజధాని గడపకు చేర్చుతుండడం విశేషమే. ఇది భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల వారి అమోఘమైన విధేయతకు నిదర్శనమంటే అతిశయోక్తి కాదేమో.

ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేయక ఇప్పటికైనా ప్రభుత్వం మొండితనాన్ని వీడి, తమ సొంత ప్రజల మాటను ఆలకించటం పాలకులకు, దేశానికి శ్రేయస్కరం. నియంతృత్వం హద్దులు దాటితే ప్రజలు సహించబోరనేది చరిత్ర చెప్పిన సత్యం.

ట్యాగ్‌లు: Sonam Wangchuk