Skip to content
క్రీడలు వార్తలు

వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి కారణం ఇదే.. ఓటమి బాధలో ఉంటే బూతులతో శ్రీలంక ఆటగాళ్లు రెచ్చగొట్టడంతోనే..

Prajapaksham 16 Jun 2026 1 నిమిషాల పఠనం క్రీడలు
వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి కారణం ఇదే.. ఓటమి బాధలో ఉంటే బూతులతో శ్రీలంక ఆటగాళ్లు రెచ్చగొట్టడంతోనే..

Tempers Flare: Vaibhav Sooryavanshi Confronts Sri Lanka Players (Photo Video Grab)

శ్రీలంకలోని దాంబూలా వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో ఇండియా-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ మైదానంలో ఊహించని ఉద్రిక్తతకు దారితీసింది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ ఓటమి పాలైనప్పటికీ, ఆ తర్వాత ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న భౌతిక ఘర్షణ ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఫీల్డర్‌ను గట్టిగా తోసేయడం వెనుక ఉన్న అసలు కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

మ్యాచ్ నిర్ణీత సమయానికి టై కావడంతో విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. గెలుపు కోసం భారత్‌కు 17 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ కుగాథస్ మథులన్ వేసిన ఆ ఓవర్‌లో చివరి మూడు బంతులను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక బౌండరీతో కలిపి 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో భారత్ 9 పరుగులకే పరిమితమై టోర్నీలో వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది.

ఓటమి నిరాశలో వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ శెడ్గే పెవిలియన్ వైపు నడుస్తుండగా పరిస్థితులు ఒక్కసారిగా చేజారాయి. సూపర్ ఓవర్‌లో వైభవ్‌ను కట్టడి చేసిన బౌలర్ మథులన్ అతడిని ఉద్దేశించి తీవ్రంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అప్పటికే ఓటమి బాధలో ఉన్న వైభవ్ ఆ మాటలతో తీవ్ర ఆగ్రహానికి గురై బౌలర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అతడిని అడ్డుకునేందుకు శ్రీలంక ఫీల్డర్ విషేన్ హలంబెజ్ మధ్యలోకి రాగా, తీవ్ర భావోద్వేగానికి లోనైన వైభవ్ అతడిని గట్టిగా పక్కకు నెట్టేశాడు. దీంతో శ్రీలంక ఆటగాళ్లు కూడా ముందుకు రావడంతో మైదానంలో ఉద్రిక్తత పీక్‌కు చేరింది.

ఈ క్రమంలో శ్రీలంక సీనియర్ క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా సమయోచితంగా వ్యవహరించి ఇరువర్గాల ఆటగాళ్లను శాంతింపజేయడంతో పెద్ద గొడవ తప్పింది. అయితే ఈ మ్యాచ్ ముగిసే సమయానికి వెలుతురు తక్కువగా ఉండటం (బ్యాడ్ లైట్)పై కూడా వివాదం నడిచింది. చీకటి పడుతుండటంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిందని భారత జట్టు భావించింది. నిజానికి మొదట ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఉండదని అనుకున్నప్పటికీ, భారత కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో సుదీర్ఘంగా చర్చించి సూపర్ ఓవర్ నిర్వహించేలా ఒప్పించినట్లు సమాచారం. ఈ చర్చల సమయంలో తిలక్ వర్మ, అంపైర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. అక్కడ కూడా వైభవ్ సూర్యవంశీ ఆవేశంగా కనిపించడంతో భారత జట్టు ప్రధాన కోచ్ హృషికేష్ కనిట్కర్ స్వయంగా జోక్యం చేసుకుని అతడిని పక్కకు తీసుకెళ్లి నచ్చజెప్పారు.

ఈ వివాదంపై తాజాగా వైభ‌వ్ సూర్యవంశీ స్పందిస్తూ.. తాను కావాల‌ని గొడ‌వ ప‌డ‌లేదని స్పష్టం చేశాడు. శ్రీలంక ఆటగాళ్లు పక్కా ప్రణాళిక ప్రకారం త‌న‌ని టార్గెట్ చేసి, ఇరిటేట్ చేస్తూ బూతులు తిట్టారని, ఆ ఉద్దేశపూర్వక వేధింపుల వల్లే తాను అలా స్పందించాల్సి వ‌చ్చింద‌ని ఆవేదన వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రకాష్ నివేదికను పరిశీలిస్తున్నారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఆటగాళ్లను కేవలం హెచ్చరికతో సరిపెడతారా? లేక మ్యాచ్ ఫీజులో కోత విధించడం వంటి కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? అన్నదానిపై త్వరలోనే అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *