టీవీ, పత్రికల న్యూస్ ఢమాల్.. ప్రపంచ వార్తల వినియోగంలో అగ్రస్థానంలో సోషల్ మీడియా..
Social Media Overtakes TV, Newspapers as Top Global News Source
ప్రపంచవ్యాప్తంగా వార్తా రంగంలో ఒక చారిత్రాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. ప్రజలు సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడు పాతకాలపు సాంప్రదాయ మాధ్యమాల కంటే సోషల్ మీడియా, వీడియో ప్లాట్‌ఫారమ్‌ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ‘రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ జర్నలిజం’ తన ‘డిజిటల్ న్యూస్ రిపోర్ట్ 2026’లో వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం వార్తా వినియోగ చరిత్రలో మొదటిసారిగా సోషల్ మీడియా, వీడియో నెట్‌వర్క్‌ల వాడకం 54 శాతానికి చేరి ఇతర అన్ని వనరులను అధిగమించింది. ఒకవేళ ఇందులో చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్‌లను కూడా కలిపితే ఈ సంఖ్య 56 శాతానికి పెరుగుతుందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఇది టీవీ వార్తలు (52%), వార్తాపత్రిక యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు (51%), రేడియో (21%) కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.
యూగోవ్ అనే పోల్ సంస్థ 48 దేశాల్లో దాదాపు లక్ష మందిపై నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ప్రధాన రచయిత, బీబీసీ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జిమ్ ఈగన్ దీనిని ఒక శాశ్వత గమన మార్పుగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ముగ్గురు సోషల్ మీడియానే ప్రధాన వార్తా వనరుగా భావిస్తుండగా, 18-24 ఏళ్ల మధ్య వయసున్న యువతలో ఈ నిష్పత్తి సగానికి పైగా ఉంది.
కేవలం 45 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే టెలివిజన్ ఇంకా ప్రధాన వనరుగా కొనసాగుతోంది. ఇక వేర్వేరు సామాజిక మాధ్యమాల్లో వార్తల వినియోగం కూడా భిన్నంగా ఉంది. ప్రజలు ప్రత్యేకంగా వార్తల కోసమే ఎక్స్ (ట్విట్టర్) లేదా యూట్యూబ్‌లను సందర్శిస్తుండగా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో మాత్రం ఇతర పనులు చూసుకుంటున్నప్పుడు అనుకోకుండా వార్తలను తెలుసుకుంటున్నారు.
ఈ మార్పుల వల్ల సాంప్రదాయ మీడియా సంస్థల ఆదాయాలు దారుణంగా పడిపోతున్నాయి. కేవలం 17 శాతం మంది ప్రతివాదులు మాత్రమే ఆన్‌లైన్ వార్తల కోసం డబ్బులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన వారంతా ఉచిత సమాచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు, గూగుల్, మెటా వంటి ఇంటర్నెట్ దిగ్గజాలు ప్రకటనల మార్కెట్‌ను పూర్తిగా కైవసం చేసుకోవడం వల్ల పాతకాలపు మీడియా వ్యాపార నమూనాలు తీవ్రమైన ముప్పులో పడ్డాయి. దీనికి తోడు పత్రికలు, టీవీ ఛానళ్లపై ప్రజల్లో విశ్వాసం కూడా క్రమంగా క్షీణిస్తోంది. తాము చూసే వార్తలను నమ్ముతామని చెప్పిన వారి సంఖ్య అత్యంత కనిష్టంగా 37 శాతానికి పడిపోయింది. దీనివల్ల వ్యక్తిగత కంటెంట్ సృష్టికర్తలు (ఇండిపెండెంట్ క్రియేటర్స్), వీడియో ఆధారిత సమాచారానికి ప్రాధాన్యత పెరుగుతోంది.
ఇదే సమయంలో వార్తల కోసం ఏఐ (AI) చాట్‌బాట్‌లను ఉపయోగించే వారి సంఖ్య గత ఏడాది 7 శాతం ఉండగా, ఇప్పుడు అది 10 శాతానికి పెరిగింది. జనరేటివ్ ఏఐ సాధిస్తున్న వేగవంతమైన వృద్ధికి ఎలా స్పందించాలనేదే ప్రస్తుతం వార్తా రంగ నాయకులకు, విధాన రూపకర్తలకు ఉన్న అతిపెద్ద సవాలని జిమ్ ఈగన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సాంకేతిక మార్పుల నేపథ్యంలో ప్రస్తుత కాలం వార్తా మాధ్యమాల రంగానికి అత్యంత అస్థిరమైన సమయమని, ఈ నివేదికలోని అంశాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ భవిష్యత్తు సవాళ్లకు అద్దం పడుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.