Harish Rao Video Viral: 22A సమస్యకు నైతిక బాధ్యత వహించి.. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి: మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
Harish rao
రాష్ట్రవ్యాప్తంగా 22A నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్) అంశంపై తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం సమస్య పరిష్కారంలో విఫలమైందని ఆయన విమర్శించారు.
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా వేలాది భూములు, ఇళ్లు, కాలనీలు, లే అవుట్లను 22A నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న ఇళ్లను సైతం నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4788ను ప్రకటించినప్పటికీ అది సరిగా పనిచేయడం లేదని హరీష్ రావు అన్నారు. తాను స్వయంగా పలుమార్లు కాల్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. ప్రజలకు సహాయం చేయాల్సిన ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే ఎమ్మార్వో కార్యాలయానికి, అక్కడి నుంచి ఆర్డీవో, కలెక్టర్, యూఎల్‌సీ కార్యాలయాలకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారని, దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరిందని, ఆ తర్వాత మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీఎం ఇంటి విషయంలో వెంటనే స్పందించిన ప్రభుత్వం, సాధారణ ప్రజల సమస్యల పరిష్కారంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, ఇళ్లను తొలగించాలని డిమాండ్ చేసిన హరీష్ రావు, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా తెలంగాణ భవన్‌లోని “జనతా గ్యారేజ్” తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, వారి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
మంత్రి పొంగులేటి వివరణ
22A అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే స్పందించారు. గత ప్రభుత్వాల కాలంలో నమోదైన రికార్డుల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని భూములు, ఆస్తులు నిషేధిత జాబితాలో చేరినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, బాధితులు టోల్ ఫ్రీ నంబర్ లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. అర్హులైన వారి ఆస్తులను పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
- YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా
- Telangana Political Row: కేటీఆర్,హరీష్ రావు విడుదల.. రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు..
- Telangana Assembly Session: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట.. రిమాండ్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు!
- Saudi Arabia’s Water Miracle: నదులు లేకపోయినా కోట్ల మందికి మంచి నీరు ఎలా.. సౌదీ అరేబియా వాటర్ సప్లై వెనుక అసలు రహస్యం..
- Eiffel Tower: ఈఫిల్ టవర్ వద్ద లింగ వివక్ష వివాదం.. మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించడంపై సిబ్బంది ఆగ్రహం..