Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్
Andhra Pradesh
రూ.20 లక్షల వరకు నగదు, బంగారం తీసుకున్నాడని ఆరోపణ
కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఆర్ఎంకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశం
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం
Andhra Pradesh: చంద్రగిరి మండలం కొంగరవారిపల్లెకు చెందిన ఎం. బేబీ శాలిని తనకు ఎదురైన సమస్యను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తనకు జరిగిన పరిణామాలను వివరించి, న్యాయం చేయాలని కోరారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాను చంద్రగిరి నుంచి తిరుపతికి ప్రతిరోజూ బస్సులో ప్రయాణించే క్రమంలో ఆర్టీసీ కండక్టర్ వి. సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ పరిచయాన్ని క్రమంగా పెంచుకున్న సుబ్రహ్మణ్యం తనను ప్రేమిస్తున్నానని నమ్మించి, తనను మోసం చేశాడని ఆరోపించారు.ప్రేమ పేరుతో తనపై నమ్మకం కలిగించిన అనంతరం వివిధ దశల్లో తన నుంచి సుమారు రూ.20 లక్షల వరకు నగదును తీసుకున్నాడని ఆరోపించారు. ఫోన్‌పే ద్వారా పలుమార్లు నగదు బదిలీ చేయించుకున్నాడని, తనతో బంగారం కూడా కొనిపించుకున్నాడని తెలిపారు. తన వద్ద నుంచి తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడని వాపోయారు.
అదేవిధంగా, తనను ప్రేమిస్తున్నానని చెబుతూ తన వెంటపడి, తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించారు. ఈ పరిణామాలతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, తనకు న్యాయం చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కోరారు. తన వద్ద ఉన్న ఫోన్‌పే లావాదేవీల వివరాలు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బంగారం కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, ఇతర ఆధారాలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తిరుపతి ఆర్ఎంకు మంత్రి వీడియో కాల్
బాధితురాలు తన సమస్యను వివరించిన వెంటనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం (రీజినల్ మేనేజర్)కు వీడియో కాల్ చేసి సమస్యను వివరించారు. బాధితురాలు చేసిన ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపించాలని, సంబంధిత కండక్టర్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఆర్టీసీ సిబ్బంది తమ విధుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రయాణికులతో ముఖ్యంగా మహిళలతో మర్యాదగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు.
ఇలాంటి ఆరోపణలు ఎదురైనప్పుడు విషయాన్ని తేలికగా తీసుకోకుండా నిజానిజాలను పూర్తిస్థాయిలో విచారించి, తప్పు చేసినట్లు తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎంను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీసీ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, సిబ్బంది ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాధితురాలికి చట్టపరంగా న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. మహిళల భద్రత, గౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, బాధితులకు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.