Skip to content
ప్రపంచం వార్తలు

టేకాఫ్ తర్వాత క్షణాల్లోనే కుప్పకూలిన బీ-52 బాంబ‌ర్ విమానం..8 మంది మృతి.. దర్యాప్తు ప్రారంభం

Prajapaksham 16 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
టేకాఫ్ తర్వాత క్షణాల్లోనే కుప్పకూలిన బీ-52 బాంబ‌ర్ విమానం..8 మంది మృతి.. దర్యాప్తు ప్రారంభం

8 Dead as US Air Force B-52 Bomber Crashes After Take-Off (X/RapidReport2025)

అమెరికా రక్షణ రంగంలో భారీ విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియాలోని మోజావే ఎడారిలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ లో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో బీ-52 (B-52) బాంబర్ విమానం కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మిలిటరీ సిబ్బందితో పాటు ప్రభుత్వ కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్లు సమాచారం.

స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11:20 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. లాస్ ఏంజిల్స్‌కు ఉత్తరాన ఉన్న ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సాధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో, టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాలకే బాంబర్ విమానం అదుపుతప్పి నేలకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. విమానం ఎంతలా కాలిపోయిందంటే, అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కూడా మిగల్లేదని తెలుస్తోంది. ఎనిమిది మంది గొప్ప అమెరికన్లను తాము కోల్పోయామని, వారి కుటుంబాలకు సమాచారం అందిస్తున్నామని కల్నల్ జేమ్స్ హేస్ విచారం వ్యక్తం చేశారు.

ఈ బీ-52 బాంబర్ విమానం ‘రేడార్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్’లో భాగంగా పరీక్షల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన వెంటనే విమానం ఎక్కువ ఎత్తుకు లేదా ఎక్కువ దూరానికి వెళ్లలేకపోవడాన్ని బట్టి చూస్తే, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి ఉండవచ్చని విమానయాన నిపుణుడు జెఫ్ గుజెట్టి అభిప్రాయపడ్డారు. అయితే, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక రావడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

బోయింగ్ బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ అనేది చాలా శక్తివంతమైన లాంగ్ రేంజ్ బాంబర్. 1955లో సేవల్లోకి వచ్చిన ఈ విమానం సంప్రదాయ ఆయుధాలతో పాటు అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. వియత్నాం యుద్ధం నుండి ఇరాన్ సంక్షోభం వరకు అమెరికా దీనిని అనేక యుద్ధాల్లో ఉపయోగించింది. ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్ సాధారణంగా కొత్త విమానాలు, ఆయుధ వ్యవస్థలు మరియు సాఫ్ట్‌వేర్‌లను పరీక్షించడానికి కేంద్రంగా ఉంటుంది, అటువంటి సురక్షిత ప్రాంతంలోనే ఈ పెను ప్రమాదం జరగడం రక్షణ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.