బెంగళూరులో దారుణం..అత్త ఎదుటే భార్యను దారుణంగా పొడిచి చంపిన అల్లుడు..
Home Guard Woman Killed in Bengaluru; Husband Arrested
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం, భార్యపై అనుమానంతో ఒక వ్యక్తి కట్టుకున్న భార్యను అత్త, పిల్లల ముందే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. మృతురాలు 32 ఏళ్ల మంజుల, బెంగళూరులోని మహదేవపుర పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తోంది. మంజులకు ప్రదీప్ అనే వ్యక్తితో 15 ఏళ్ల క్రితం వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే, ప్రదీప్‌కు ఆన్‌లైన్ బెట్టింగ్‌ల అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీనికి తోడు మంజుల ప్రవర్తనను ప్రదీప్ అనుమానించేవాడు. చివరకు పిల్లల తండ్రి ఎవరంటూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. భర్త వేధింపులు తాళలేక మంజుల నెలన్నర రోజులుగా తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లి ఇంట్లో ఉంటోంది.
ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రదీప్ తన అత్తగారి ఇంటికి చేరుకున్నాడు. మొదట తనను క్షమించి, కాపురానికి తిరిగి రావాలని భార్య కాళ్లపై పడి బతిమాలాడు. కానీ, మంజుల నిరాకరించడంతో ఒక్కసారిగా రెచ్చిపోయి హింసాత్మకంగా మారిపోయాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో అత్త, ఇద్దరు పిల్లల కళ్ల ముందే మంజులను దాదాపు 20 సార్లకు పైగా అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. భార్యను చంపిన తర్వాత, అదే కత్తితో తన చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
అయితే, ఈ ఘోరానికి ఒడిగట్టడానికి ముందే నిందితుడు ప్రదీప్ ఒక వీడియో మెసేజ్‌ను రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన బెట్టింగ్ వ్యసనం వల్లే కుటుంబం నాశనమైందని అందులో అంగీకరించాడు. తన భార్య లేకుండా తాను బతకలేనని, సాయంత్రం ఆమె డ్యూటీ ముగించుకుని వచ్చాక నాతో వచ్చేయమని అడుగుతానని, ఒకవేళ ఆమె రానని చెబితే అక్కడే చంపేస్తానని ఆ వీడియోలో ప్రదీప్ భయంకరమైన ప్లాన్‌ను వెల్లడించాడు. ఈ వీడియో ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడు ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.