Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనసేనలో మొదలైన కలహాల కాపురం ?…నాదెండ్లపై పవన్ అసంతృప్తి..?

Prajapaksham 04 Aug 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
జనసేనలో మొదలైన కలహాల కాపురం ?…నాదెండ్లపై పవన్ అసంతృప్తి..?

Has infighting begun in Janasena? ...Is Pawan dissatisfied with Nadendla?

జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే జనసేన అంటూ సాగుతున్న జనసేన రాజకీయ ప్రయాణంలో మరో నేత ఎవరు అంతలా ఫోకస్ కారు అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ. కానీ అడపా దడపా మాత్రం నాదెండ్ల మనోహర్ ఆ పార్టీలో నెంబర్ టుగా కనిపిస్తుంటారు. సుదీర్ఘకాలంగా అధినేత పవన్ కళ్యాణ్‌కు అత్యంత నమ్మకస్తుడిగా వస్తున్న నాదెండ్ల మనోహర్ వైఖరిపై ప్రస్తుతం అంతర్గతంగా సరికొత్త చర్చలు మొదలయ్యాయి. ఇటీవల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు కూటమిలోనే కాక, జనసేన అంతర్గత వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదనే పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారని, అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఫార్ములా వర్తించదని, జనసేన తమ బలాబలాలను బట్టి స్వతంత్రంగా, హక్కుగా పోటీ చేస్తుందని మనోహర్ స్వయంగా ప్రకటన చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కూటమి ధర్మానికి సీఎం చంద్రబాబు నిర్ణయాలకు కట్టుబడి సమన్వయం పాటిస్తున్న సమయంలో, నాదెండ్ల ఈ తరహా ప్రకటన చేయడం పవన్ అభిప్రాయంతో సంబంధం లేకుండానే జరిగిందనే ప్రచారం బలపడింది.

గత కొంతకాలంగా ప్రభుత్వం పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లో నాదెండ్ల మనోహర్ శైలిపై పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తిగా ఉన్నారని, వీరిద్దరి మధ్య దూరం పెరుగుతోందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల, పార్టీ వ్యవహారాల కంటే వ్యక్తిగత ఇమేజ్, శాఖాపరమైన ప్రాధాన్యతలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది.

గతంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత పవన్‌కు నీడలా ఉంటూ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) ఛైర్మన్‌గా పార్టీ శ్రేణులకు పవన్‌కు మధ్య ఏకైక వారధిగా నాదెండ్ల నిలిచారు.
అయితే ఆ సమయంలోనే పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను, పాత కాపులను పవన్ కళ్యాణ్‌కు దగ్గర కాకుండా నాదెండ్ల మనోహర్ ఒక కోటరీలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాల నుంచి తీవ్రంగా వచ్చాయి.

2024 ఎన్నికల పొత్తుల చర్చల సమయంలోనూ టిక్కెట్ల కేటాయింపులో నాదెండ్ల వల్లే పలువురు సీనియర్ నాయకులకు అన్యాయం జరిగిందన్న నిరసనలు, తిరుగుబాట్లు పవన్ దృష్టికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. పార్టీకి మూలస్తంభాలైన క్షేత్రస్థాయి కార్యకర్తలు, వీరమహిళలను పక్కనబెట్టి సొంత వర్గాన్ని ప్రోత్సహించారనే విమర్శలు కూడా గతంలో పవన్ దృష్టికి చేరాయి.
అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బిజీ అవ్వడంతో, పార్టీ సమన్వయ బాధ్యతలను నాదెండ్ల నెరవేర్చడంలో విఫలమవుతున్నారనే అభిప్రాయం కేడర్‌లో ఉంది.

అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, కూటమి వ్యూహాలకు భిన్నంగా స్థానిక ఎన్నికలపై నాదెండ్ల ప్రకటన చేయడం ద్వారా పార్టీపై తన పట్టును నిరూపించుకునే ప్రయత్నం చేశారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ తరహా ఏకపక్ష వైఖరి వల్ల కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీలతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.

ఫలితంగా, గతంలో మాదిరిగా నాదెండ్ల మనోహర్‌ను గుడ్డిగా నమ్మకుండా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేరుగా ఇతర నాయకులతో, ఐఏఎస్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఆయనపై ఆధారపడటం తగ్గించారని తెలుస్తోంది.