UK Crime: పెన్షన్ డబ్బుల కోసం తల్లి మృతదేహాన్ని మూడేళ్లు ఫ్రీజర్‌లో దాచిన కొడుకు..
UK Pension Fraud: Son Jailed for Hiding Mother's Death
UK Crime: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పెన్షన్ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన తల్లి మరణాన్ని దాచిపెట్టి, ఆమె మృతదేహాన్ని దాదాపు మూడేళ్లపాటు ఇంట్లోని ఫ్రీజర్‌లో భద్రపరిచిన ఘటన సంచలనం సృష్టించింది. అనంతరం తల్లి పేరుతో వస్తున్న పెన్షన్, సంక్షేమ పథకాల సొమ్మును అక్రమంగా పొందుతూ జల్సాలు చేసిన నిందితుడికి కోర్టు రెండేళ్ల నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.
సౌత్ వేల్స్‌లోని పోర్త్‌కాల్ ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్ ఫిలిప్స్ (60) తన తల్లి సిల్వియా ఫిలిప్స్‌తో కలిసి నివసించేవాడు. సిల్వియా 2023 మార్చిలో మరణించినప్పటికీ, ఆ విషయాన్ని అధికారులకు తెలియజేయకుండా ఆమె మృతదేహాన్ని ఇంట్లోని చెస్ట్ ఫ్రీజర్‌లో దాచిపెట్టాడు. అనంతరం ఆమె పేరుతో ప్రభుత్వం నుంచి వస్తున్న స్టేట్ పెన్షన్, సంక్షేమ పథకాల నగదు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అక్రమంగా వినియోగిస్తూ వచ్చాడు. ఈ విధంగా అతడు సుమారు 78,190 పౌండ్లు (భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1 కోటి) అక్రమంగా పొందినట్లు విచారణలో తేలింది.
ఈ ఘటన దాదాపు మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. 2026 ఫిబ్రవరిలో సిల్వియా గురించి అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు క్రిస్టోఫర్ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. మొదట తన తల్లి లండన్‌లోని బంధువుల వద్ద ఉందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అతని సమాధానాలపై అనుమానం రావడంతో ఇంటిని తనిఖీ చేసిన పోలీసులు ఫ్రీజర్‌లో భద్రపరిచిన మృతదేహాన్ని గుర్తించారు.
కోర్టు విచారణలో నిందితుడి తరఫు న్యాయవాది.. తల్లి మరణాన్ని తట్టుకోలేక మానసిక ఒత్తిడితోనే ఆమె మృతదేహాన్ని అలాగే ఉంచినట్లు వాదించారు. అయితే ఈ వాదనను కోర్టు తిరస్కరించింది. తల్లి మరణాన్ని దాచిపెట్టి చట్టబద్ధమైన అంత్యక్రియలకు అడ్డుపడటమే కాకుండా ప్రభుత్వ నిధులను మోసపూరితంగా కాజేశాడని పేర్కొన్న న్యాయమూర్తి.. క్రిస్టోఫర్ ఫిలిప్స్‌కు రెండేళ్ల నాలుగు నెలల జైలు శిక్ష విధించారు.
ఈ ఘటన యూకేలో తీవ్ర చర్చకు దారితీయగా.. ఆర్థిక ప్రయోజనాల కోసం కుటుంబ సభ్యుల మరణాన్ని దాచిపెట్టడం ఎంత తీవ్రమైన నేరమో మరోసారి చర్చనీయాంశమైంది.