Skip to content
క్రైమ్ › వార్తలు

Maharashtra Road Accident: వీడియో ఇదిగో… దుర్గామాత విగ్రహాన్ని తీసుకువెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు అక్కడికక్కడే మృతి

jagan 02 Oct 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Maharashtra Road Accident: వీడియో ఇదిగో… దుర్గామాత విగ్రహాన్ని తీసుకువెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు అక్కడికక్కడే మృతి

Maharashtra Road Accident

Maharashtra Road Accident: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై దుర్గాదేవి విగ్రహంతో వెళ్తున్న భక్తుల టెంపో పికప్‌ను వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ధమన్‌గావ్ రైల్వే సమీపంలోని ఛానల్ నంబర్ 97 వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 18 మందికి పైగా గాయపడినట్లు తాజా సమాచారం. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

వివరాల ప్రకారం.. వర్ధా ప్రాంతానికి చెందిన భక్తులు నవరాత్రి ఉత్సవాల కోసం దుర్గాదేవి విగ్రహాన్ని తీసుకురావడానికి బుల్ధానా జిల్లాలోని షేగావ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకుని వర్ధాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భక్తులు ప్రయాణిస్తున్న బొలెరో పికప్ వాహనానికి వెనుక భాగంలో ట్రాలీ కూడా అమర్చి ఉన్నట్లు సమాచారం. వాహనం రాత్రివేళ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టింది.

ట్రక్కు ఢీకొట్టిన వేగానికి పికప్ వాహనం వెనుక భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి ధమన్‌గావ్ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వర్ధా, సావంగి మేఘే ప్రాంతంలోని ఆసుపత్రులకు తరలించినట్లు నివేదికలు వెల్లడించాయి.

ఈ ప్రమాదంలో తొలుత ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం వెలువడింది. అనంతరం చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గాయపడిన వారిలో 12 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మరాఠీ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరికొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అసలు ప్రమాదానికి ట్రక్కు వేగం కారణమా, వాహనాల పరిస్థితి లేదా ఇతర అంశాలు కారణమా అనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

నవరాత్రి ఉత్సవాల కోసం దుర్గాదేవి విగ్రహాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో వర్ధా, అమరావతి ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పరిస్థితిని పోలీసులు, స్థానిక అధికారులు పర్యవేక్షిస్తున్నారు.