హైదరాబాద్‌లో రూ.25 కోట్ల రియల్ ఎస్టేట్ స్కామ్: యజమానికి తెలియకుండానే బ్యాంక్ రుణం.. డీఎన్సీ ఇన్ఫ్రా ఎండీపై కేసు
హైదరాబాద్‌లో రూ.25 కోట్ల రియల్ ఎస్టేట్ స్కామ్: యజమానికి తెలియకుండానే బ్యాంక్ రుణం.. డీఎన్సీ ఇన్ఫ్రా ఎండీపై కేసు
అపార్ట్మెంట్ యజమానికి తెలియకుండానే ఓ రియల్టర్ బ్యాంక్ నుంచి రూ.25 కోట్లు రుణం తీసుకుని మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మలక్‌పేటలోని రూ.17.10 కోట్ల విలువైన కమర్షియల్ భవనం విక్రయానికి సంబంధించి బ్యాంక్ అధికారులతో కుమ్మక్కైన రియల్టర్ రూ.25 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
డీఎన్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దరిశాల నరేష్ చౌదరి, పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తనను మోసం చేశారని వ్యాపారవేత్త వేముల సత్యమూర్తి ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, మలక్‌పేట నల్గొండ క్రాస్‌రోడ్స్‌లోని ‘శ్రీహర్ష కాంప్లెక్స్’ను రూ.17.10 కోట్లకు విక్రయించేందుకు 2024 నవంబర్‌లో ఒప్పందం కుదిరింది. కొనుగోలుదారు దరిశాల నరేష్ చౌదరి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.25 కోట్ల రుణం మంజూరైనట్లు లేఖ చూపించడంతో, పూర్తి చెల్లింపు అందకముందే రిజిస్టర్డ్ సేల్ డీడ్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం రూ.17.10 కోట్లకు ఇచ్చిన నాలుగు చెక్కులను బ్యాంకులో సమర్పించవద్దని కోరుతూ, రుణం విడుదలైన వెంటనే మొత్తం చెల్లిస్తానని నమ్మబలికాడని, ఆ చెక్కుల గడువు ముగిసిన తర్వాత కొత్త చెక్కులు ఇచ్చినా అవి కూడా ‘సరిపడా నిధులు లేవు’ అనే కారణంతో బౌన్స్ అయ్యాయని ఆరోపించారు.
ఈలోగా తన భవనాన్ని తన అనుమతి లేకుండా తాకట్టు పెట్టి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎంసీసీ బ్రాంచ్ నుంచి రూ.25 కోట్ల రుణం పొందినట్లు తెలిసిందని, దీనిపై సివిల్ కోర్టులో సేల్ డీడ్ రద్దు, తాకట్టు పత్రాలను చెల్లనివిగా ప్రకటించాలని దావా దాఖలు చేసినట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
బ్యాంకు బ్రాంచ్ హెడ్ రమేష్ బాబు, సర్కిల్ హెడ్ అరవింద్ కొల్రా, చీఫ్ మేనేజర్ సందీప్ కచ్చి తదితర అధికారులు నిబంధనలను ఉల్లంఘించి, సరైన భౌతిక పరిశీలన, విలువ నిర్ధారణ, న్యాయపరమైన తనిఖీలు లేకుండానే రూ.25 కోట్ల రుణం మంజూరు చేశారని ఆరోపించారు.
అనంతరం నరేష్ చౌదరి రూ.2.10 కోట్లు మాత్రమే చెల్లించడం ద్వారా మిగిలిన సేల్ కన్సిడరేషన్ బకాయి ఉన్న విషయాన్ని అంగీకరించినట్లేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దరిశాల నరేష్ చౌదరిపై గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాజస్థాన్ ప్రాంతాల్లో మోసం, నమ్మకద్రోహం తదితర కేసులు నమోదయ్యాయని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ ఆర్థిక నేరాల విభాగం ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేష్ దర్యాప్తు చేపట్టారు. నరేష్ చౌదరిపై ఆయా పోలీసు స్టేషన్లలో ఇప్పటికే పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.