TGSRTC: పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారి కోసం కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం.. TGSRTC బస్సులో కొత్త బోర్డు వైరల్..
TGSRTC
TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సుల్లో ప్రత్యక్షమైన ఒక కొత్త సూచిక బోర్డు ప్రస్తుతం ప్రయాణికుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారి కోసం కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం” అనే ఆసక్తికరమైన సందేశంతో కూడిన ఈ బోర్డుల వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. అయితే, మహిళల సంఖ్య విపరీతంగా పెరగడంతో బస్సుల్లో పురుషుల కోసం కేటాయించిన సీట్లలో సైతం ఇతరులు కూర్చుంటున్నారని.. దీనివల్ల టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణించే పురుషులు నిలబడే ప్రయాణించాల్సి వస్తోందనే చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సాధారణంగా కనిపించే ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ బోర్డులకు భిన్నంగా ‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’ అని రాసి ఉన్న బోర్డులు బస్సుల్లో దర్శనమివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మేడ్చల్, బాలానగర్ డిపోలతో పాటు పలు రూట్లలో నడిచే బస్సుల్లో ఈ తరహా బోర్డులు కనిపించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ బోర్డుల ఏర్పాటు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అధికారికంగా చేసిందా లేక సిబ్బంది/ప్రయాణికులు ఎవరైనా ఏర్పాటు చేశారా అనే విషయంపై ఇప్పటివరకు రవాణా సంస్థ అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. నెటిజన్లు మాత్రం ఈ వీడియోలపై ఇన్నాళ్లకు పురుషుల కష్టాలను గుర్తించారు అంటూ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.