Skip to content
తెలంగాణ వార్తలు

యూరియా బుకింగ్ కోసం ప్రత్యేక యాప్‌.. నేరుగా రైతు వేదికల ద్వారానే యూరియాను పంపిణీ చేయాలి.. వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Prajapaksham 16 Jun 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
యూరియా బుకింగ్ కోసం ప్రత్యేక యాప్‌.. నేరుగా రైతు వేదికల ద్వారానే యూరియాను పంపిణీ చేయాలి.. వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy Reviews Agriculture Department Ahead of Crop Season

తెలంగాణలో సన్నవడ్ల సాగును ప్రోత్సహించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన బోనస్ లభించే 7 రకాల సన్నవడ్ల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాలని, వాటిపై రైతులకు సబ్సిడీ అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సన్నవడ్లు పండించే రైతుల పూర్తి డేటాను సేకరించాలని సూచించారు. అలాగే వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరింత పెంచుతూ వడ్ల కొనుగోళ్ల ప్రక్రియలో అగ్రికల్చర్ వర్సిటీని నోడల్ ఏజెన్సీగా నియమించుకుని సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత సులభతరం చేసేందుకు అన్ని రకాల ఎరువుల కోసం ఒక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ యాప్‌ ద్వారా బుక్ చేసుకున్న యూరియాను నేరుగా రైతు వేదికల ద్వారానే పంపిణీ చేయాలని, ఈ మొత్తం పర్యవేక్షణ బాధ్యతను జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు. దాంతో పాటు రాష్ట్రానికి అవసరమైన యూరియా, ఎరువుల కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వానికి తరచూ లేఖలు రాయాలని, ముఖ్యంగా రామగుండం ఎరువుల కర్మాగారంలో తయారయ్యే మొత్తం నిల్వలను తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *