మహిళలు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు..ఇస్లాంలోకి మారిన యువతులపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
మహిళలు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు..ఇస్లాంలోకి మారిన యువతులపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
మహిళలు మతాన్ని పాటించే అంశంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నిర్ణీత వయస్సు వచ్చిన మహిళలు (అడల్ట్ ఉమెన్) తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని హైకోర్టు పేర్కొంది. పెళ్లి, మతాన్ని స్వీకరించడం, నివాసం, భవిష్యత్ వంటి విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇద్దరు యువతులకు సంబంధించి దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ సందీప్ జైన్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ఈ కేసులో బాధిత యువతులను ఆగస్టు 6లోగా కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలివి. దివ్యా భాటియా, అను భాటియా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇద్దరు ముస్లిం యువకులను ప్రేమించారు. ఈ క్రమంలో ఆ యువతులు ఇస్లాంలోకి మారారు. వారి పేర్లు దివ్యా భాటియా నుంచి జోయా దియా భాటియాగా, అను భాటియా నుంచి అమీనా అను భాటియాగా మార్చుకున్నారు. అంతేకాదు, ఇస్లాంకు చెందిన యువకులను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
దీన్ని వ్యతిరేకించిన వారి తండ్రి ఆ ఇద్దరినీ తన ఇంట్లో బంధించాడు. వారు మతం మారడాన్ని, వేరే వ్యక్తులను పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు యువతులను వారి తండ్రి బలవంతంగా నిర్బంధించారని ఆరోపిస్తూ, వారిని విడుదల చేయాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో వారి తరఫున హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది.
దీనిపై కోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషన్లో పేర్కొన్న వివరాల ఆధారంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దివ్యా, అనులను ఆగస్టు 6లోగా కోర్టులో హాజరుపర్చాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. పిటిషనర్ ఆరోపించినట్లుగా పోలీసుల సహకారంతో వారి తండ్రి వారిని బంధించి ఉంచితే, అది చట్టబద్ధమైన నేరంగా పరిగణిస్తామని తెలిపింది.
మహిళలు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, నివాసాన్ని ఎంచుకునే హక్కు, నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు, భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు వారికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరినీ స్వేచ్ఛగా వదిలిపెట్టాలని కోర్టు తండ్రికి సూచించింది.
అక్రమంగా బంధించి ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని కోర్టు పేర్కొంది. తమ గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఆ అక్కాచెల్లెళ్లకే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నెల 6లోగా ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.