KCR Farm House: కేసీఆర్ ఫాంహౌస్ కేంద్రంగా రేవంత్ పుట్టిస్తున్న భూకంపం…గులాబి బాసు కాళ్లకింద ల్యాండ్ మైన్ అవుతుందా..?
KCR Farm House: కేసీఆర్ ఫాంహౌస్ కేంద్రంగా రేవంత్ పుట్టిస్తున్న భూకంపం…గులాబి బాసు కాళ్లకింద ల్యాండ్ మైన్ అవుతుందా..?
KCR Farm House: ఈ భూ రాజకీయంలో ప్రధాన హాట్‌స్పాట్‌గా మారింది సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫార్మ్‌హౌస్. గతంలో గ్రీన్ హౌస్, డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీతో ఇక్కడ పండే బెంగళూరు క్యాప్సికమ్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని, ఏటా రూ. 10 కోట్ల దాకా రాబడి వస్తుందని కేసీఆర్ స్వయంగా చెప్పుకునేవారు. అయితే, ఇప్పుడు ఆ ఫార్మ్‌హౌస్ వివాదాలకు నిలయంగా మారింది.
KCR Farm House: అసెంబ్లీ వేదికగా 22A ల్యాండ్ ఇష్యూ కేంద్రంగా మొదలైన తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా రూపురేఖలు మార్చుకుంది. ఈ చర్చ, చివరకు అధికార కాంగ్రెస్ – ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల నడుమ “భూదందాల రచ్చ”గా మారిపోయింది. ఓ వైపు ప్రైవేట్ భూములను నిషేధిత జాబితా నుంచి విడిపించాలని సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతుంటే, మరోవైపు రాజకీయనాయకులు తమ భూముల చిట్టాలను బయటకు తీసి ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. పోటాపోటీగా మీడియా ముందుకు నేతలు ఒకరి ఆక్రమణలను మరొకరు ఎండగడుతూ, వందలు-వేల ఎకరాల లెక్కలను బయటపెడుతున్నారు.
ఎర్రవల్లి కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌పై రెవెన్యూ శాఖ కన్ను
ఈ భూ రాజకీయంలో ప్రధాన హాట్‌స్పాట్‌గా మారింది సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫార్మ్‌హౌస్. గతంలో గ్రీన్ హౌస్, డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీతో ఇక్కడ పండే బెంగళూరు క్యాప్సికమ్‌కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని, ఏటా రూ. 10 కోట్ల దాకా రాబడి వస్తుందని కేసీఆర్ స్వయంగా చెప్పుకునేవారు. అయితే, ఇప్పుడు ఆ ఫార్మ్‌హౌస్ వివాదాలకు నిలయంగా మారింది.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో కదిలిన రెవెన్యూ శాఖ:
మర్కూక్ తహసీల్దార్ కార్యాలయంలో పాత ఫైళ్ల దుమ్ము దులిపిన అధికారులు, సిద్దిపేట కలెక్టర్, ఆర్డీవో చంద్రకళ నేతృత్వంలో ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్ రికార్డులను పట్టుకుని రంగంలోకి దిగారు. ఫార్మ్‌హౌస్ పరిసరాల్లో 385 ఎకరాల వివాదాస్పద, ఓవర్‌లాపింగ్ భూములు ఉన్నాయని, కేసీఆర్‌కు నేరుగా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందో లేదో అధికారులు పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ చర్చ ముగిసిన తెల్లారేసరికల్లా హైదరాబాద్ ఫ్లైఓవర్ జంక్షన్ల దగ్గర ఉన్న హోర్డింగ్స్‌పై కేసీఆర్ ఫార్మ్‌హౌస్ భూముల లెక్కలు వెలిశాయి. బీఆర్ఎస్‌ను డీఫేమ్ చేసేందుకు కాంగ్రెస్ గాంధీ భవన్ వేదికగా ప్రణాళికలు సిద్ధం చేసింది.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎటాక్:
శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ భూలావాదేవీలపై విరుచుకుపడ్డారు. “అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్”, “అర్బన్ సీలింగ్ యాక్ట్” ల్యాండ్ నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ చుట్టుపక్కల చంద్రశేఖర రావు ఒక్క కుటుంబం గుప్పిట్లోనే 440 ఎకరాల భూమి ఉందంటూ లెక్కలు బయటపెట్టారు. కేసీఆర్ ఫార్మ్‌హౌస్ వద్ద రికార్డుల్లో ఉన్నది 295 ఎకరాలైతే, రికార్డులు లేనిది 388 ఎకరాలు. అంటే దాదాపు 700 ఎకరాల భూమి ఆధీనంలో ఉందా లేదా అని కేసీఆర్‌ను నిలదీశారు. కేసీఆర్ పేరున సిద్దిపేట జిల్లాలోని మూడు గ్రామాల్లో 67.5 ఎకరాలు. కేటీఆర్ పేరున 49.20 ఎకరాలు (జన్వాడ ఫార్మ్‌హౌస్ సత్యం కుంభకోణం భూముల్లో ఉందని, ధరణి కాంట్రాక్ట్ కట్టబెట్టినందుకు నజరానాగా వచ్చిందని ఆరోపణ). హరీష్ రావు పేరున, చిన్నకోడూరులో 21 ఎకరాలు, మహబూబ్ నగర్‌లో 14 ఎకరాలు. ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎటాక్ ప్రారంభించారు.
ధరణి స్కామ్:
ధరణి సిస్టమ్ ద్వారా అసైన్డ్ భూములు పట్టా భూములుగా మారిపోయాయని, ఓనర్లకు తెలియకుండానే ఆస్తులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి 9,200 అక్రమ లావాదేవీలు జరిగాయని మండిపడ్డారు. అంతేకాకుండా, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలతో పాటు సంతోష్ కుమార్, బోయినపల్లి శ్రీనివాసరావు (బినామీ ఆరోపణలు) పేర్లను కూడా రేవంత్ ప్రస్తావించారు.
బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ –
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
కేటీఆర్ ఎన్‌కౌంటర్:
“గతంలో పబ్లిక్ మీటింగ్లలో 1000 ఎకరాల ఫార్మ్‌హౌస్ అని అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అసెంబ్లీలో 67 ఎకరాలు మాత్రమే ఉందంటున్నాడు. అంటే నీ కంపు నోటితో చెప్పిన ఆరోపణల్లో నిజం లేదని ప్రజలకే అర్థమవుతోంది. కేసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. భూముల్లో పుట్టి పెరిగిన తమకు రియల్ ఎస్టేట్ పాఠాలు చెప్పవద్దని, తమ బుల్లెట్లు మిస్ఫైర్ అవుతాయని హెచ్చరించారు. రేవంత్ సోదరుల వ్యాపారాలు, ఏరోస్పేస్ కంపెనీలు, బంధువుల భూముల వివరాలను బయటకు తీస్తామన్నారు. రేవంత్ మరియు కేసీఆర్ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాలు విసిరారు.
కవిత రియాక్షన్:
నా ఎలక్షన్ అఫిడవిట్‌లో రాసిన దానికంటే ఒక్క గజం భూమి ఎక్కువగా ఉన్నట్లు తేలినా దాన్ని ప్రభుత్వానికే రాసిచ్చేస్తాను. అవసరమైతే నా భూములపై సీబీఐ చేత విచారణ జరిపించండి, నేను సిద్ధం” అని ప్రకటించారు.
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వివరణ:
“బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం స్థలం కొనే ప్రయత్నం మా అబ్బాయి చేశాడు తప్ప, అది ప్రభుత్వ భూమి కాదని, కబ్జా చేయలేదని తేలడంతో ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నాం. ఎంక్వైరీకి మేము సిద్ధం” అని తేల్చిచెప్పారు.
ఫీల్డ్‌లోకి కలెక్టర్, ఎంపీల బృందం
నెల రోజుల్లోగా నిజానిజాలు తేల్చాలని సీఎం ఆదేశించడంతో, సిద్దిపేట కలెక్టర్, ఆర్డీఓలతో కూడిన అధికారులు ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్ రికార్డులను రీ-వెరిఫై చేయడం ప్రారంభించారు. మరోవైపు శుక్రవారం కాంగ్రెస్ ఎంపీల బృందం సిద్దిపేటలో పర్యటించి, కబ్జా ఆరోపణలు ఉన్న భూములను స్వయంగా తనిఖీ చేసింది. “గతంలో ఈటల రాజేందర్ విషయంలో ఏ రకంగా మిగులు భూములను పేదలకు పంచారో, కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌లో తేలే 300 ఎకరాల ఓవర్‌లాపింగ్ భూమిని కూడా మీరే పేదలకు పంచుతారా? లేక మమ్మల్ని పంచమంటారా?” అని కాంగ్రెస్ సూటిగా ప్రశ్నిస్తోంది.
బిజెపి విమర్శలు:
ఈ ల్యాండ్ లీక్స్ రగడపై మూడో ప్రధాన పక్షమైన బీజేపీ ఘాటుగా స్పందించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు ఇతర బీజేపీ నేతలు మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్నది కేవలం జనాన్ని మోసం చేసే “పొలిటికల్ డ్రామా”. కేసీఆర్ ఫార్మ్‌హౌస్ అక్రమమని తెలుసుకోవడానికి కాంగ్రెస్‌కు తొమ్మిదేళ్లు పట్టిందా? గతంలో ప్రకటించిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల విచారణలు, ఫార్ములా-ఈ రేస్ కేసులు ఏమయ్యాయి?.. ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు ఈఎంఐలు కట్టుకోవడానికే రేవంత్ రెడ్డి భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని, రాష్ట్రంలో కాంప్రమైజ్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయ భూములను నాన్-అగ్రికల్చర్ కింద మార్చకుండా, అందరి భూ ఆక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి పేదలకు పంచాలని బీజేపీ డిమాండ్ చేసింది.
గతంలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన కోసం విఆర్వో, విఆర్ఏ వ్యవస్థలను మూసేసి ధరణి తీసుకొచ్చిన కేసీఆర్ నాటి నిర్ణయాలే, ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడేసేలా రెవెన్యూ యంత్రాంగం ఉపయోగిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “నాది నువ్వు విప్పితే.. నీది నేను విప్పుతా” అన్న చందంగా మారిన ఈ రాజకీయంలో రేవంత్ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ ప్రకంపనలకు దారితీసేలా ఉంది.