Skip to content
జాతీయం వార్తలు

జెఎన్‌యులో శరవేగంగా కాషాయీకరణ

Prajapaksham 18 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
జెఎన్‌యులో శరవేగంగా కాషాయీకరణ

JNU

సవేరా

భారతదేశంలోని అత్యుత్తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా, ముఖ్యంగా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ అధ్యయనాలు, పరిశోధనలకు జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) ప్రసిద్ధి. ఆ యూనివర్సిటీ అధ్యాపకుల నియామకాలలో జరుగుతున్న అవకతవకలపై రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ (ఆర్‌సి) ఇటీవల వెలువరించిన ఒక నివేదిక ప్రజల దృష్టిని విస్తృతంగా ఆకర్షించింది. నియామక ప్రక్రియలో నిబంధనలను దారుణంగా, ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి న ఏడు ఉదంతాలను ఆర్‌సి బహిర్గతం చేసింది. అయితే, అసలు కథ ఈ ఏడు కేసులకు మాత్రమే పరిమితం కాదు, లేదా ప్రత్యేకంగా వాటికే సంబంధించినది కూడా కాదు. ఇది కేవలం నిబంధనల ఉల్లంఘన గురించి మాత్రమే కాదు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకాలను నియంత్రించే నిబంధనల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలను పద్ధతి ప్రకారం దెబ్బతీయడం గురించినది. ఈ ఏడు ఉదంతాలు జెఎన్‌యులోని అధ్యాపకుల నియామక ప్రక్రియలో పాతుకుపోయిన ఒక లోతైన రుగ్మతకు కేవలం లక్షణాలు మాత్రమే. ఇది ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం నాశనమయ్యే ప్రక్రియలో ఒక ముఖ్యమైన అంశాన్ని సూచిస్తుంది.
నివేదించిన ప్రతి కేసులోనూ నియమితులైన వారు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) నిబంధనలలో నిర్దేశిత కనీస అర్హత షరతులను నెరవేర్చలేదనేది ఆరోపణ. ఇది కేవలం పొరపాటు కాదు. అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినప్పటి నుంచి ఎంపిక కమిటీ వారిని ఇంటర్వ్యూ చేసే వరకు జరిగిన ప్రక్రియలలో, ఈ అభ్యర్థుల అర్హతకు సంబంధించిన సమస్యలు గుర్తించబడినవి. అయినప్పటికీ, వాటిని పక్కనపెట్టి, ఇతర దరఖాస్తుదారులను వారి అర్హత కారణాలతో ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా నిరోధించినప్పటికీ, ఈ అభ్యర్థులను వివరించలేని విధంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు అనుమతించారు. ప్రశ్న ఏమిటంటే, ఒక విశ్వవిద్యాలయ పరిపాలన కొందరు నిర్దిష్ట అభ్యర్థులకు ‘సర్దుబాటు’ చేయటానికి ఎందుకంతగా ప్రయత్నిస్తుంది? దీనికి ఉన్న ఏకైక హేతుబద్ధమైన వివరణ ఏమిటంటే, విశ్వవిద్యాలయ బాధ్యులు ఈ అభ్యర్థుల పట్ల తమ ప్రాధాన్యతను ముందుగానే నిర్ణయించుకుని, వారిని ఎంపిక చేయడానికి నియామక ప్రక్రియను తమకు అనుగుణంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మార్పు ఆ తర్వాత జరిగిన ప్రక్రియకు కూడా విస్తరించింది. అనర్హులైన ఈ అభ్యర్థులు ఇతర అర్హులైన అభ్యర్థులను ‘దాటుకొని’, వారి వారి ఎంపిక కమిటీలకు మొదటి ‘ఎంపిక’గా నిలిచేలా చేసింది. ఈ పక్షపాతం కొందరికి అనుకూలంగా, మరికొందరికి వ్యతిరేకంగా రెండు వైపులా పనిచేస్తోందని సూచిస్తుంది. జెఎన్‌యు టీచర్స్‌ అసోసియేషన్‌ ప్రకారం, 150 సందర్భాలలో ఇంటర్వ్యూలు నిర్వహించి, అర్హులైన అభ్యర్థులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎంపిక కమిటీలు ఎవరినీ ‘నియామకానికి తగినవారుగా’ ఎందుకు గుర్తించలేకపోయాయి. ప్రత్యేకించి అనేక రిజర్వ్‌డ్‌ పోస్టుల విషయం లో ఇది జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.
నిజానికి, స్పష్టంగా ఉన్న నియమాలను దాటవేయడం కంటే, అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, వారిలో ఎవరిని ఎంపిక చేయాలో తుది నిర్ణయం తీసుకునే ఎంపిక కమిటీని వైస్‌ ఛాన్సలర్‌ స్వయంగా ఎంపిక చేసుకోవడం సులభం. అదనంగా ప్రతి ఎంపిక కమిటీకి వైస్‌ ఛాన్సలర్‌ అధ్యక్షుడి గా ఉంటారనేది వాస్తవం. కమిటీలోని ముగ్గురు విషయ నిపుణులైన సభ్యులను ఎంపిక చేసే అధికారాన్ని కూడా ఈ ‘నియమాలు’ వైస్‌ ఛాన్సలర్‌కు కట్టబెడతాయి. వారిని విశ్వవిద్యాలయం శాసనబద్ధ సంస్థలచే ముందుగా ఆమోదించబడిన ఒక ప్యానెల్‌ నుండి ఎన్నుకోవాలి. ఈ సంస్థలకు కూడా వైస్‌ ఛాన్సలర్‌ అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం జెఎన్‌యులో, విసి ఇప్పటికే తీసుకున్న అన్ని నిర్ణయాలను ‘ఆమోదించడానికి’ ఈ సమావేశాలన్నీ ఆన్‌లైన్‌లో జరిగి, త్వరితగతిన ముగుస్తాయి.
జెఎన్‌యు వైస్‌ ఛాన్సలర్‌గా ఎం.జగదీశ్‌ కుమార్‌ ఉన్నప్పటి నుండే, నియామకాలు జరగాల్సిన సంబంధిత కేంద్రా లు లేదా విభాగాల అధ్యాపకులు సిఫార్సు చేసిన పేర్లతో మాత్రమే నిపుణుల ‘ఆమోదిత’ జాబితాను రూపొందించే పద్ధతి ఆగిపోయింది. తద్వారా ఆ సమతుల్యతను కాపాడే విధానం తొలగించి, వైస్‌ ఛాన్సలర్లు (విసిలు) తమకు నచ్చి న పేర్లను ప్యానెళ్లలో చేర్చడం ప్రారంభించారు. విశ్వవిద్యాలయానికి వెలుపలి నుంచి ఉండాల్సిన విషయ నిపుణులతో పాటు, సంబంధిత కేంద్రం/విభాగం చైర్‌పర్సన్‌, సంబంధిత డీన్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అయితే, గత విసి కాలం నుంచే ఈ పదవుల్లో ఉండేవారిని విసి స్వయంగా ఎంపిక చేయడం, వారి పదవీకాలం పూర్తిగా విసి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండటం మొదలైంది. అంతకుముందు దశాబ్దాల పాటు, అర్హులైన అధ్యాపకుల సీనియారిటీ ఆధారంగా ఈ పదవులు రొటేషన్‌ పద్ధతిలో
(వారీగా) కేటాయించబడేవి.
నిపుణుల ప్యానెళ్లను ఆమోదించే, ఎంపిక కమిటీల సిఫార్సులను స్వీకరించే చట్టబద్ధమైన సంస్థలలో కూడా ఈ విభాగ అధిపతులు, డీన్‌లే అత్యధిక సంఖ్యలో సభ్యులుగా ఉంటారు. అధ్యాపకుల నియామక ప్రక్రియలో భాగమైన ‘ఇంటర్నల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌’ (ఐక్యూఎసి) డైరెక్టర్‌ వంటి ఇతర పదవులకు కూడా విసియే నియామకాలు చేపడతారు. అధ్యాపకుల నియామక ప్రక్రియలో వచ్చిన ఈ మార్పులన్నీ ఎంపిక ప్రక్రియపై నియంత్రణను పూర్తిగా విసి చేతుల్లోకి కేంద్రీకరించాయి. నియామకాలపై విసి తన ఇష్టాయిష్టాలను రుద్దడానికి వీలు కల్పించాయి.
నియామకాలకు సంబంధించిన ప్రస్తుత యుజిసి నిబంధనలు 2018లో జారీ చేయబడ్డాయని, ఎం. జగదీశ్‌ కుమార్‌ విసిగా ఉన్న సమయంలోనే జెఎన్‌యు వాటిని అమలులోకి తెచ్చిందని కూడా గమనించాలి. ప్రస్తుత విసి శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ లాగే, ఆయనను కూడా మోదీ ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఆయన యుజిసి చైర్మన్‌ పదవికి పదోన్నతి పొందారు. ప్రతి ఎంపిక కమిటీలోని చివరి సభ్యుడైన ‘విజిటర్‌ నామినీ’ని కూడా ప్రభుత్వమే నియమిస్తుంది. అయినప్పటికీ, అధ్యాపకుల నియామక ప్రక్రియపై జెఎన్‌యు విసికి ఉన్న సంపూర్ణ నియంత్రణను అదుపు చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు. పైగా నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా మౌనం వహించింది.
కొన్ని నెలల క్రితం ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యల కారణంగా జెఎన్‌యు విసిని తొలగించాలన్న డిమాండ్లను కూడా మోదీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ పాడ్‌క్యాస్ట్‌ల్లో ఆమె యుజిసి నిబంధనలను బహిరంగంగా ప్రశ్నించడమే కాకుండా, అత్యంత కులతత్వపూరితమైన వ్యాఖ్యలు కూడా చేశారు. జెఎన్‌యు మాజీ, ప్రస్తుత వైస్‌-ఛాన్సలర్ల వ్యవహారశైలికి లభించిన ఈ మౌన ఆమోదానికి ఒకే ఒక కారణం ఉండవచ్చు. అధ్యాపకుల నియామక ప్రక్రియలో ప్రభుత్వం కోరుకున్న విధంగానే వారు వ్యవహరించడం. విద్యాపరమైన అర్హతలు లేదా సామర్థ్యానికి బదులుగా, అభ్యర్థుల రాజకీయ- సైద్ధాంతిక ధోరణి లేదా ప్రభుత్వం, జెఎన్‌యు యంత్రాంగంలోని శక్తివంతమైన వ్యక్తులతో వారికి ఉన్న వ్యక్తిగత సంబంధాలే నియామకానికి ప్రాతిపదికగా మారా యి. జెఎన్‌యులో, బోధనేతర ఉద్యోగాలు అమ్ముడుపోవడం, అవి జెఎన్‌యు యంత్రాంగంలోని వ్యక్తులకు ఆర్థిక లాభం చేకూర్చే వనరులుగా మారడం అనే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము.
గత పదేళ్లలో జెఎన్‌యులో జరిగిన పరిణామాల ప్రాముఖ్యతను ఈ క్రింది అంశాల ద్వారా అంచనా వేయవచ్చు. జెఎన్‌యు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న వివరా ల ప్రకారం (2026 ఆగస్టు 8 నాటికి), జెఎన్‌యులోని మొత్తం 705 మంది రెగ్యులర్‌ అధ్యాపకులలో 322 మంది (దాదాపు 46 శాతం) ప్రస్తుత, మాజీ వైస్‌-ఛాన్సలర్ల హయాంలోనే నియమితులయ్యారు. వీరిలో 189 మంది శాంతిశ్రీ పండిట్‌ పదవీకాలంలో (ఇది ఇంకా కొనసాగుతోంది)నియమితులైనవారే. ఈ కొత్త నియామకాలలో 246 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లలో 146 మంది, 182 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లలో 111 మంది ఉన్నారు. ప్రొఫెసర్ల విభాగంలో వీరి సంఖ్య సాపేక్షంగా తక్కువగా ఉంది. – మొత్తం 277మందిలో కేవలం 65 మంది మాత్రమే ఉన్నా రు. ఇందులో తక్కువ స్థాయి పోస్టులో మొదట నియమితులై, ఆ తర్వాత పదోన్నతి ద్వారా ప్రొఫెసర్లుగా మారిన వారు కూడా ఉన్నారు. మరో మాటలో చెప్పాలంటే, నేరుగా ప్రొఫెసర్లుగా నియమితులైన వారి కంటే, ఈ కొత్తగా నియమితులైన వారిలో ఎక్కువమందికి విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ పదవీకాలం లభిస్తుంది. 2016కు ముందు నియమితులైన వారు ఇప్పటికీ మొత్తం ప్రొఫెసర్ల సంఖ్యలో నాలుగింట మూడు వంతుల వాటాను కలిగి ఉన్నప్పటికీ, పదవీ విరమణలు, కొత్త నియామకాల కారణంగా ఆ నిష్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఫ్యాకల్టీ నియామకాలే కాకుం డా, పదోన్నతుల ప్రక్రియ, ఈ కాలంలో నియమితులైన వారి ప్రొబేషన్‌ తర్వాత నియామకాలను ధృవీకరించడం వంటివి కూడా వివక్షాపూరిత సాధనాలుగా మార్చబడ్డాయి. 2016కు ముందు నియమితులైన వారిలో 100 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 71 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లలో చాలామంది ఇప్పటికీ అదే పదవుల్లో కొనసాగుతున్నారు. ఎందుకంటే, వారు కూడా విసి, ఆమె అధిపతుల నియంతృత్వానికి లొంగేంత వరకు వారి పదోన్నతులను నిలిపివేశారు.
జెఎన్‌యు ఫ్యాకల్టీ నియామకాలలో జరుగుతున్న దానిని, గతంలో వామపక్షాలు చేశాయని ఆరోపించబడిన దానిని సరిదిద్దడం లేదా తిప్పికొట్టడమేనని బిజెపి -ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి సమర్థిస్తోంది. జెఎన్‌యుకు సొంత ప్రవేశ పరీక్షలు ఉండటం, వాటిలో ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనం ఫ్యాకల్టీ చేతుల్లోనే ఉండటం వల్ల, విద్యార్థుల కూర్పును, భావజాలాన్ని కూడా ఫ్యాకల్టీయే నియంత్రిస్తోందని వారు వాదించారు. ఈ వాదనలలోని అసంబద్ధత ఇప్పుడు ప్రభుత్వ చర్యల ద్వారానే రుజువైంది. ఫ్యాకల్టీ కూర్పును మార్చడమే కాకుండా, విశ్వవిద్యాలయం సొంత ప్రవేశ పరీక్షల స్థానంలో సియుఇటి, నెట్‌లను ప్రవేశపెట్టారు.
జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలలో ఇప్పటికీ వామపక్షం ఆధిపత్యమే ఉంది. అంతేకాకుండా, జెఎన్‌యుకు చెందిన గత వైస్‌ఛాన్స్‌లర్‌లలో ఎవరినీ ఏమాత్రం వామపక్షవాదిగా పరిగణించలేనప్పటికీ, గత ఇద్దరు విసిలు ఆర్‌ఎస్‌ఎస్‌, దాని సిద్ధాంతం పట్ల తమ విధేయతను, అనుబంధాన్ని ఎన్నడూ రహస్యంగా ఉంచలేదు. వారి ఆదేశాల మేరకే అధ్యాపకుల నియామకాలు పూర్తిగా విసి నియంత్రణలోకి వచ్చాయి. స్వతంత్ర ఆలోచనను, అధ్యయనాన్ని ప్రోత్సహించే ఒక విద్యాసంస్థగా విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయడానికి, దాని అధ్యాపకులను పైనుంచి వచ్చే ఆదేశాల కు విధేయులుగా మార్చడానికి మోదీ ప్రభుత్వ హయాంలో జెఎన్‌యు అధ్యాపకుల నియామకాలు ప్రధానంగా ఒక ప్రక్రియలో భాగమనే నిజాన్ని, దాని బూటకపు సమర్థన ఏదీ తొలగించలేదు.

ట్యాగ్‌లు: BJP national national news