‘యుద్ధ రచయిత’ చానర్ బ్రూక్
Chawner Brooke
(ఆగస్టు 3, రూపర్ట్ చానర్ బ్రూక్ జయంతి)
రూపర్ట్ చానర్ బ్రూక్ (1887 ఆగస్టు 3 1915 ఏప్రిల్ 23) ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ కవి. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభ దశలో రాసిన యుద్ధ ‘సానెట్స్’తో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ‘ది డెడ్’, ‘ది సోల్జర్’ వంటి కవితలు దేశభక్తి, త్యాగం, ఆదర్శవాదం కలగలిసిన భావాలతో విస్తృత ఆదరణ పొందాయి. ఆయన సాహిత్య ప్రతిభతో పాటు, అందమైన రూపం.. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కూడా సమకాలీనుల దృష్టిని ఆకర్షించింది. ఆయనను ఆ కాలంలో ఇంగ్లండ్‌లో ‘అత్యంత అందమైన యువకుల్లో ఒకరు’ అని పేర్కొంటారు. బ్రూక్ ఇంగ్లండ్‌లోని వార్విక్షైర్ కౌంటీలో రగ్బీ పట్టణంలో జన్మించారు. తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు, తల్లి విద్యార్థుల సంరక్షణ బాధ్యతలు నిర్వహించే అధికారిణి. చిన్నప్పటి నుంచే విద్య, సాహిత్యం, సంస్కృతి ప్రధానమైన కుటుంబ వాతావరణంలో పెరిగిన బ్రూక్ రగ్బీ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి, తరువాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో క్లాసికల్ సాహిత్యాన్ని అభ్యసించాడు. విద్యార్థి దశలోనే సాహిత్య సంఘాలు, నాటక బృందాలు, మేధో చర్చా వేదికల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈ కాలంలో ఏర్పడిన స్నేహాలు ఆయన ఆలోచనా ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. విశ్వవిద్యాలయ జీవితం తరువాత బ్రూక్ ఇంగ్లండ్‌లోని సాహిత్య వర్గాల్లో గుర్తింపు పొందాడు. బ్లూమ్స్బరీ గ్రూప్, జార్జియన్ కవుల వర్గం, డైమాక్ కవుల సమూహంతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. అమెరికన్ కవి రాబర్ట్ ఫ్రాస్ట్, ఎడ్వర్డ్ థామస్ వంటి రచయితలతో కూడా పరిచయాలు పెరిగాయి. గ్రాంట్చెస్టర్ గ్రామంలో నివసించిన కాలంలో ఆయన రాసిన ‘ది ఓల్డ్ వికరేజ్’, ‘గ్రాంట్చెస్టర్’ కవిత ఆయన ప్రసిద్ధ రచనల్లో ఒకటిగా నిలిచింది. బెర్లిన్‌లో ఉన్నప్పుడు స్వదేశం పట్ల కలిగిన తపన ఈ కవితలో ప్రతిబింబిస్తుంది. సాహిత్యంతో పాటు బ్రూక్ వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో భావోద్వేగ మలుపులు తిరిగింది. పలు ప్రేమ సంబంధాలు, స్నేహాలు, వ్యక్తిగత విభేదాలు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయి. 1912 ప్రాంతంలో తీవ్రమైన మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. అనంతరం విశ్రాంతి కోసం జర్మనీ, అమెరికా, కెనడా, దక్షిణ పసిఫిక్ దీవుల్లో పర్యటించాడు. అనేక ‘ప్రయాణ కథనాలు’ రాశాడు. తాహితీ దీవిలో గడిపిన కాలం ఆయన జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అక్కడ ఏర్పడిన అనుబంధం ఆయన వ్యక్తిత్వంలో మరో కోణాన్ని వెల్లడించినట్లు జీవిత చరిత్రకారులు పేర్కొంటారు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత 1914లో బ్రూక్ బ్రిటిష్ రాయల్ నేవల్ వలంటీర్ రిజర్వ్‌లో చేరాడు. అనంతరం రాయల్ నేవల్ డివిజన్లో అధికారిగా నియమితులయ్యాడు. బెల్జియంలోని ఆంట్వెర్ప్ ముట్టడిలో పాల్గొన్నారు. యుద్ధ అనుభవాల నేపథ్యంలో ఆయన రాసిన ఐదు సానెట్లు విశేష ఖ్యాతి పొందాయి. వాటిలో ‘ది సోల్జర్’ అత్యంత ప్రసిద్ధి చెందింది. స్వదేశం కోసం ప్రాణత్యాగాన్ని గౌరవప్రదమైన విధిగా చిత్రీకరించిన ఈ కవిత యుద్ధ ప్రారంభ దశలో బ్రిటన్‌లో దేశభక్తి భావజాలానికి ప్రతీకగా మారింది. 1915లో వెలువడిన ‘1914 అండ్ అదర్ పోయమ్స్’ అనే సంకలనం అనేక ముద్రణలు పొందింది. ఆయన మరణం తర్వాత ఈ పుస్తకానికి మరింత ఆదరణ లభించింది. అయితే బ్రూక్ యుద్ధరంగంలో వీరమరణం పొందలేదు. 1915లో మధ్యధరా సముద్ర ప్రాంతానికి వెళ్తున్న బ్రిటిష్ దళంలో భాగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఈజిప్టులో ఆయనకు తీవ్రమైన జీర్ణాశయ వ్యాధి సోకింది. అనంతరం దోమ కాటు వల్ల సంక్రమించిన ఇన్ఫెక్షన్ రక్తంలో వ్యాపించి సెప్టిసీమియాగా మారింది. ఫ్రెంచ్ ఆసుపత్రి నౌకలో చికిత్స పొందుతున్నప్పటికీ 1915 ఏప్రిల్ 23న, కేవలం 27 ఏళ్ల వయసులో మరణించాడు. అప్పటికి గల్లిపోలీ యుద్ధానికి బయలుదేరిన దళం ప్రయాణంలో ఉండటంతో ఆయనను గ్రీస్‌కు చెందిన స్కైరోస్ ద్వీపంలోని ఆలివ్ తోటలో ఖననం చేశారు. ఆయన సమాధి ఇప్పటికీ అక్కడే ఉంది. బ్రూక్ మరణించిన కొద్దికాలానికే ఆయన తమ్ముడు కూడా పశ్చిమ యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. అయినప్పటికీ రూపర్ట్ బ్రూక్ పేరు యుద్ధ కవిత్వంలో శాశ్వత స్థానం సంపాదించింది. ఆయన స్మారకార్థం ఇంగ్లండ్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబ్బేలోని ‘పోయెట్స్ కార్నర్’లో మొదటి ప్రపంచ యుద్ధ కవుల స్మారక శిలాఫలకంపై ఆయన పేరు చెక్కారు. జన్మస్థలమైన రగ్బీలో విగ్రహం నెలకొల్పారు. గ్రాంట్చెస్టర్లో ఆయన నివసించిన గృహాల వద్ద జ్ఞాపిక ఫలకాలు ఏర్పాటు చేశారు. స్కైరోస్లోని సమాధి వద్ద శాశ్వత స్మారక చిహ్నం నిర్మించారు. ఆయన కవితల పంక్తులు బ్రిటన్‌తో పాటు న్యూజిలాండ్‌లోని యుద్ధ స్మారకాలపై కూడా కనిపిస్తాయి. 2023లో ఆయన జీవితాన్ని స్మరించుకుంటూ కొత్త చమురు చిత్రపటాన్ని కూడా రూపొందించారు. బ్రూక్ సాహిత్య వారసత్వం కాలక్రమేణా విభిన్న కోణాల్లో విశ్లేషణకు లోనైంది. యుద్ధ ప్రారంభ దశలో ఆయన కవితలు దేశభక్తికి చిహ్నాలుగా భావించగా, తరువాతి తరాల విమర్శకులు వాటిలో కనిపించే ఆదర్శవాదాన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా యుద్ధం భయానకతను ప్రత్యక్షంగా అనుభవించిన తరువాతి కవులు యుద్ధాన్ని మరింత వాస్తవికంగా చిత్రించడంతో బ్రూక్ కవిత్వంపై కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ ఆయన కవితల్లో కనిపించే యువత ఉత్సాహం, త్యాగ భావన, మాతృభూమిపై ప్రేమ, భాషలోని సౌందర్యం ఇప్పటికీ పాఠకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఆయన ప్రభావం సాహిత్యానికే పరిమితం కాలేదు. ఆయన జీవితంపై జీవితచరిత్రలు వెలువడ్డాయి. నవలల్లో పాత్రగా కనిపించాయి. పలువురు సంగీతకారులు ఆయన కవితలకు స్వరాలు సమకూర్చారు. యుద్ధ స్మారక కార్యక్రమాల్లో, సాహిత్య చర్చల్లో, ప్రజా ప్రసంగాల్లో ఆయన కవితల పంక్తులు తరచూ ఉటంకిస్తునే ఉంటారు. కేవలం ఇరవై ఏడు సంవత్సరాల జీవితమే గడిపినప్పటికీ, బ్రూక్ ఇంగ్లిష్ సాహిత్యంలో మొదటి ప్రపంచ యుద్ధపు ప్రారంభ దశను ప్రతిబింబించిన ప్రముఖ కవిగా చిరస్థాయిగా గుర్తింపు పొందాడు.