Skip to content
తెలంగాణ వార్తలు

Godavari Flood Alert: పోటెత్తి శాంతిస్తున్న గోదావరి.. కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక! లోతట్టు ప్రాంతాలు జలమయం, స్తంభించిన రవాణా

Prajapaksham 02 Aug 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
Godavari Flood Alert: పోటెత్తి శాంతిస్తున్న గోదావరి.. కొనసాగుతున్న 3వ ప్రమాద హెచ్చరిక! లోతట్టు ప్రాంతాలు జలమయం, స్తంభించిన రవాణా

Godavari floods

గోదావరి పోటెత్తి శాంతిస్తోంది. శనివారం సాయంత్రం నుంచి అతిస్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. శనివారం తెల్లవారుఝామున 2 గంటల సమయంలో గోదావరి 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 58.10 అడుగుల వరకు చేరుకుని నాలుగు గంటల పాటు నిలకడగా మారింది. సాయంత్రం 5 గంటల నుంచి క్రమంగా తగ్గుతూ 54.6 అడుగులకు చేరుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి 53 అడుగులకు పైగా వరద కొనసాగుతుండటంతో తుది ప్రమాద హెచ్చరిక అమల్లోనే ఉంది.

ఆదివారం నాటికి వరద క్రమేపీ తగ్గి, మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 48 అడుగుల దిగువకు ప్రవహించే అవకాశం ఉన్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఇంద్రావతి, ప్రాణహిత ఉపనదులు పొంగడంతో పాటు తాలిపేరు నుంచి నీటిని భారీగా గోదావరిలోకి విడుదల చేయడంతో వరద పోటెత్తింది. దీంతో గత మూడు రోజులుగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా శాంతిస్తోంది. అయితే రానున్న రోజుల్లో వర్ష సూచన ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో కలెక్టర్ అంకిత్ భద్రాచలంలో మకాం వేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికారులను స్వయంగా అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కరకట్ట వద్దకు చేరుకుని వరద ప్రవాహాన్ని పరిశీలించారు.

మరోవైపు, విస్తా కాంప్లెక్స్ స్లూయిస్‌ల వద్ద మురుగునీటిని మోటార్ల సహాయంతో గోదావరిలోకి ఎత్తిపోస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం

గోదావరి పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చర్ల మండలంలోని తేగడ వద్ద గోదావరి రోడ్డుపైకి చేరింది. భద్రాచలం సీఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలోకి వరద నీరు చేరుకుంది. శివారులో కరకట్ట అసంపూర్తిగా ఉండటంతో అటుగా ప్రధాన రహదారిపైకి వరద నీరు ప్రవేశించింది.

దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, గంగోలు, తూరుబాక, ఏపీ ఎటపాక, గండాల, బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, అశ్వాపురం మండలం పరిధిలోని చింతిర్యాల, నెల్లిపాక, బంజర్ గ్రామాల్లో రోడ్లపైకి గోదావరి చేరింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు రవాణా వ్యవస్థ స్తంభించింది.

దుమ్ముగూడెం మండల పరిధిలోని గంగోలు డబుల్ బెడ్రూమ్ కాలనీ, ప్రగళ్లపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వరద బాధితులకు మంచినీరు, భోజనం అందించాలని, విద్యుత్ సదుపాయం నిరంతరాయంగా ఉండేలా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారితో కలెక్టర్ మాట్లాడుతూ, వరదలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అనారోగ్య పరిస్థితులు తలెత్తితే వెంటనే వైద్య సిబ్బంది ద్వారా వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని తెలిపారు.

గోదావరి నీరు ప్రవహించే ప్రాంతాలు, కాలువలు, కుంటల వైపు వెళ్లవద్దని, ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.