Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

కొంపెల్ల జనార్దనరావు జీవితం

Prajapaksham 03 Aug 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
కొంపెల్ల జనార్దనరావు జీవితం

Kompella Janardhana Rao

ఈ శీర్షికతో ఏటుకూరి ప్రసాద్‌, యామిజాల ఆనంద్‌ సంయుక్త సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం గురించి ఏమి చెప్పినా తక్కువే.. ఎంత చెప్పినా స్వల్పమే. ఈ పుస్తకం ముఖచిత్రంపై చూపు పడగానే ‘ఎవరీ కొంపెల్ల జనార్దనరావు?’ అని ఆశ్చర్యపోయే నేటి తరం, ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు ఆధునిక సాహిత్య చరిత్రలో వెలుగుల్ని పంచి, కాలగర్భంలో మరుగునపడిపోయిన ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని తిరిగి మన ముందుకు తీసుకొచ్చిన సాహిత్య యజ్ఞమే ఈ గ్రంథం. మహాకవి శ్రీశ్రీ తన అజరామరమైన ‘మహాప్రస్థానం’ పుస్తకాన్ని కొంపెల్ల జనార్దనరావుకు అంకితం చేశాడంటే, ఆయన వ్యక్తిత్వ విశిష్టతను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం ఉండదు. మూడు పదుల వయసు కూడా నిండక ముందే హడావిడిగా మనల్ని విడిచి వెళ్లిపోయిన కొంపెల్ల మరికొంతకాలం జీవించి ఉండి ఉంటే, తెలుగు సాహిత్య చరిత్ర మరొక రూపాన్ని సంతరించుకునేదేమో! ఆయన ప్రతిభకు శ్రీశ్రీ అంకిత గేయం సంపూర్ణ కొలమానం కాకపోయినా, ఆ అసామాన్య సాహిత్యజీవి గురించి అనేక ప్రశ్నలకు దారి తీసే విలువైన పత్రంగా నిలిచింది. అందులో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. ‘ఉదయిని’ పత్రికను నెలకొల్పి, ఆర్థికంగా, శారీరకంగా కొంపెల్ల అలసిపోయాడు. తన శక్తి, సమయం, ఆర్థిక వనరులన్నింటినీ సాహిత్య సేవకే అంకితం చేసిన ఆయన రచనలు నేడు చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరం. 1920, 1930 దశకాల్లో వివిధ పత్రికల్లో చెల్లాచెదురుగా ముద్రితమైన ఆయన రచనలను వెదికి, సేకరించి, ఒకే గ్రంథంలో సమీకరించడం ఎంతటి కఠిన సాధనో ఊహించడం కూడా కష్టం. దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా మరుగునపడ్డ ఒక సాహిత్యకారుడి జీవితాన్ని, రచనలను, వ్యక్తిత్వాన్ని తిరిగి వెలుగులోకి తీసుకురావడం ఒక అసాధారణ సంపాదక బాధ్యత. ఒక మహాయజ్ఞం. ఈ పుస్తకం వెనుక ఏటుకూరి, యామిజాల సాగించిన అవిశ్రాంత పరిశోధన, అన్వేషణ, సేకరణ, శ్రమ ప్రతి పుటలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రంథం వెలుగు చూడాలని చివరి క్షణం వరకు తపించిన ఏటుకూరి సంకల్పం ఈ పుస్తక రూపంలో సాకారమైంది. ఆచార్యుడిగా, ఉద్యమ నిర్మాతగా, రచయితగా, సంపాదకుడిగా, పరిశోధకుడిగా, వక్తగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న ఆయన చివరి కోరిక నెరవేరడం తెలుగు సాహిత్యానికి ఒక సంతోషకరమైన సందర్భం. ఈ గ్రంథం వెలువడడం, ఆయనకు సాహితీ ప్రపంచం చెల్లించిన గొప్ప నివాళి. పుస్తకం ఆరంభంలోనే ‘మహాప్రస్థానం’ తొలి ముద్రణ ముఖచిత్రాన్ని ప్రచురించడం అత్యంత సందర్భోచితం. ఆ ముఖచిత్రమే పాఠకుడిని ఒక చారిత్రక కాలంలోకి తీసుకెళ్తుంది. అరుదైన ఛాయాచిత్రాలు, స్వదస్తూరీలు, ‘బొమ్మలు చెప్పే కథలు’ వంటి విశిష్ట విభాగాలతో కూడిన ఈ గ్రంథం ఎనిమిది భాగాలుగా రూపుదిద్దుకుంది. ‘ఎవరీ జనార్దనరావు?’ అనే ప్రశ్నతో ప్రారంభమయ్యే తొలి భాగం, ఆ ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండానే అనేక గొప్ప సాహితీవేత్తల రచనల ద్వారా పాఠకుడిని కొంపెల్ల వ్యక్తిత్వానికి చేరువ చేస్తుంది. శ్రీశ్రీ, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఆచంట జానకీరామ్‌, పిలకా గణపతిశాస్త్రి, ఎస్వీ రామారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వంటి ప్రముఖుల వ్యాసాలు కొంపెల్ల స్థాయిని మనకు అర్థమయ్యేలా చేస్తాయి. రెండో భాగంలో పింగళి నాగేంద్రరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, ద్వానా శాస్త్రి, కామేశ్వరరావు, జ్వాలాముఖి, బూదరాజు రాధాకృష్ణ వంటి సాహిత్య దిగ్గజాల అభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రభూమి, గృహలక్ష్మి, భారతి, కృష్ణాపత్రిక వంటి పత్రికల్లో వెలువడిన వ్యాసాలను కూడా ఇందులో చేర్చడం ద్వారా సంపాదకులు ఒక విలువైన సాహిత్య దస్తావేజును రూపొందించారు. మూడో భాగమైన ‘కవనచాతురి’లో వివిధ పత్రికల్లో ముద్రితమైన కొంపెల్ల కవితలు చోటు చేసుకున్నాయి. నాలుగో భాగం ఆయన వచన రచనల ద్వారా రచయితగా ఆయన ఆలోచనా లోతును, భాషా నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ‘భారతి’ పత్రికలో పనిచేసిన రోజుల్లోనూ, తరువాత ‘ఉదయిని’లో రాసిన సమీక్షలను ఐదో భాగంలో సమగ్రంగా సమీకరించారు. ఆ సమీక్షలను వెదికి పట్టుకోవడానికి సంపాదకులు చేసిన పరిశోధన ప్రతి పుటలో ప్రతిధ్వనిస్తుంది. ‘కవుల లోగిలి’, ‘అనుబంధాలు’ వంటి విభాగాలు కొంపెల్ల వ్యక్తిత్వాన్ని మరింత సమగ్రంగా పరిచయం చేస్తాయి. మహాప్రస్తానాన్ని కొంపెల్లకు అంకితం చేస్తూ, శ్రీశ్రీ రాసిన గేయాన్ని ఆయన స్వదస్తూరీలోనే ముద్రించడం ఈ గ్రంథానికి మరింత చారిత్రక విలువను చేకూర్చింది. గతంలో ‘పోయెట్రీ వర్క్‌షాప్‌’ పేరిట వెలువడిన గ్రంథం ద్వారా తెలుగు రచయితల స్వదస్తూరీలను పాఠకుల ముందుకు తీసుకొచ్చిన ఘనత కూడా ఏటుకూరి, యామిజాల ద్వయానిదే. అలాంటి ప్రయోగం తెలుగు సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్య చరిత్రలో కూడా అరుదుగా కనిపిస్తుంది. ఇది ముమ్మాటికీ ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌’లో చేరదగిన పుస్తకం. ఎంతో మంది రచయిత చేతిరాతల్లో కనిపించే కొట్టివేతలు, దిద్దుబాట్లు, పదాల మార్పులు ఒక రచన వెనుక వారు అనుభవించే అంతర్మథనాన్ని మన కళ్లముందు నిలబెడతాయి. ఒక కవిత పుట్టుకకు ముందు ఎన్నిసార్లు అది కాగితంపై పుడుతుందో, చనిపోతుందో, మళ్లీ పుడుతుందో ఆ ప్రతులే సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఒకప్పుడు అనేక పత్రికల్లో ప్రచురితమైన రచనలు కాలగర్భంలో కలిసిపోయాయి. రచయితల అసలు చేతిరాత ప్రతులే అరుదుగా దొరికే పరిస్థితిలో, వారు పలు దశల్లో రాసి, సవరించి, కొట్టివేసిన చిత్తు ప్రతులను సేకరించడం ఎంతటి దుర్లభమో ఊహించడం కష్టం కాదు. అలాంటి పరిశోధన వెనుక ఉన్న సహనం, పట్టుదల, సాహిత్యాభిమానం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆధునిక, ప్రగతిశీల తెలుగు సాహిత్యానికి పునాదులు వేసిన రచయితల్లో ముందువరుసలో నిలిచినా, తగిన గుర్తింపు పొందని శిష్‌ట్లా మహేశ్వరరావు సమగ్రసాహిత్యాన్ని కూడా ఇదే స్థాయిలో పరిచయం చేసిన ఘనత ఈ ఇద్దరు సంపాదకులకే దక్కుతుంది. ఇప్పుడు వారి సంయుక్త కృషిలో మరో ఆణిముత్యం ‘కొంపెల్ల జనార్దనరావు జీవితం’. అయితే ఈ పుస్తకం ఆవిష్కారానికి ముందే ఏటుకూరి భౌతికంగా దూరమవడం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. ఆ వేదన మధ్యనే ఆయన కలను సాకారం చేస్తూ ఈ గ్రంథాన్ని పాఠకుల ముందుకు తీసుకురావడం ఆయనకు అందించిన అత్యంత సముచిత నివాళి. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ యామిజాల ఇలాంటి పరిశోధనాత్మక సాహిత్య భాండాగారాలను మరెన్నో వెలుగులోకి తీసుకురావాలని మనసారా ఆశిద్దాం. మరుగునపడిన మణులను వెలికితీయడం, మరచిపోయిన మహనీయులను కొత్త తరానికి పరిచయం చేయడం, కాలం చెదరగొట్టిన సాహిత్య సంపదను మళ్లీ ఒక చోట చేర్చి భవిష్యత్తు తరాలకు అందించడం ఎంత గొప్ప సాంస్కృతిక సేవో ఈ గ్రంథం మనకు గుర్తు చేస్తుంది. ఒక రచయిత జీవితాన్ని మాత్రమేగాక, ఒక సాహిత్య యుగాన్నే మన ముందుంచిన ఈ గ్రంథం ప్రతి సాహిత్యాభిమాని గ్రంథాలయంలో తప్పనిసరిగా ఉండాల్సిన పుస్తకం. తెలుగు సాహిత్య స్మృతి ని సంరక్షించిన అపూర్వ గ్రంథం కాబట్టే దీనిని ప్రతి ఒక్కరూ చదవాలి. చదివించాలి.

ట్యాగ్‌లు: Poet revolutionary poet Telangana