ఏపీ తరహాలో తెలంగాణలో కూడా ఉపాధ్యాయులకు శాశ్వత ట్రాన్స్ ఫర్ యాక్ట్ రూపొందించాలి.. ప్రభుత్వ టీచర్ల డిమాండ్..
ఏపీ తరహాలో తెలంగాణలో కూడా ఉపాధ్యాయులకు శాశ్వత ట్రాన్స్ ఫర్ యాక్ట్ రూపొందించాలి.. ప్రభుత్వ టీచర్ల డిమాండ్..
ఎస్టీయూ టియస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు జి. సదానందం గౌడ్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాలని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(ఎస్టీయూ టియస్) రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో సంఘ రాష్ట్ర కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో తెలంగాణలో కూడా ఉపాధ్యాయులకు శాశ్వత ప్రాతిపదికన బదిలీల యాక్ట్ రూపొందించాలని అన్నారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను సత్వరమే పరిష్కరించాలని సమావేశంలో తీర్మానించారు. విద్యాశాఖలో ఇంటర్ లోకల్ డిప్యూటేషన్లకు సంబంధించిన జీవో 190 అమలు చేయాలని డిమాండ్ చేశారు. నూతన హెల్త్ స్కీమ్ వల్ల ఉపాధ్యాయులకు మెరుగైన వైద్యం అందుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలలలోపు సిఫారసులను అమలు చేస్తామని ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సి.పి.ఎస్. రద్దు, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్, మోడల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. రేషనలైజేషన్ జీవో 25 ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్, 27న సంఘ 80 వసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, ఆర్థిక కార్యదర్శి సయ్యద్ సాబేర్ అలి సంఘ నివేదికలు ప్రవేశ పెట్టగా, సభ్యులు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు యం. పర్వత్ రెడ్డి నాయకులు కరుణాకర్ రెడ్డి, ఎ. వి. సుధాకర్, రాధా జయ లక్ష్మి, కృష్ణా రెడ్డి, వీర రాఘవులు, పరమేశ, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.