Skip to content
తెలంగాణ వార్తలు

ఆధిపత్య ఆరాటంతో ఆందోళనలు… పక్కదారి పడుతున్న ప్రజాసమస్యలు

Prajapaksham 22 Sep 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
ఆధిపత్య ఆరాటంతో ఆందోళనలు… పక్కదారి పడుతున్న ప్రజాసమస్యలు

Party logos in Telangana

-ఏనుగు వెంకటేశ్వరరావు

రాష్ట్రం గడిచిన కొన్ని రోజులుగా రాజకీయ పక్షాల మధ్య ఆరోపణలు, దూషణలు, ప్రత్యారోపణలు, పరుష పదజాలంతో అట్టుడుకుతుంది. రాజకీయ ఆధిపత్యం కోసం జరుగుతున్న రభసతో ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయి. వామపక్షాలు మినహాయిస్తే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు అధికారంపై యావ తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదు. కాంగ్రెస్‌, బిజెపి, బిఆర్‌ఎస్‌ మధ్య ముప్పురి ఆందోళనలతో రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై వారం రోజుల పాటు ఆందోళనకు ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. పిలుపు సరైనదే ఆందోళనలు వాంఛితమే అయినా బిఆర్‌ఎస్‌ లక్ష్యం ప్రజా సమస్య ల పరిష్కారం కంటే కాంగ్రెస్‌ పార్టీని ప్రజల్లో అభాసుపాలు చేయడం ద్వారా తమకు అధికారం అన్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఇటీవలి ఆందోళన లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి పేరుతో ప్రజల్లోకి వెళ్లాలి. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలి. ఆర్థిక సంక్షోభం రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమయంలోనూ అమలు చేస్తున్న పథకాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమం గురించి వివరించాలి. అంతే కానీ ఓ ప్రతిపక్ష నేత శాసనసభకు రావడం లేదు కాబట్టి ఆయన రాజీనామా కోసం ఆందోళనకు పిలుపునివ్వడం ఏవిధంగా చూసినా సహేతుకమైంది కాదు. ప్రజాధనం వృధా అవుతుంది అన్న మాట వాస్తవమే కానీ ప్రజాస్వామ్య దేశం లో రాజకీయ పక్షాల ద్వారా అధికారంలోకి రావడం తప్ప మరో మార్గంలేని అనివార్యమైన పరిస్థితుల్లో శాసనసభకు రాని విపక్షనేతను చూపి ఆ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేయాలి తప్ప ఆందోళనకు పిలుపునివ్వడం అన్నది అధికార పార్టీ చేయాల్సిన పని కాదు. వారు ఏదో చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఒక్కోసారి రాజకీయ తప్పిదాలకు దారితీస్తుంది.
బిఆర్‌ఎస్‌ ఆందోళనకు సంబంధించి కొన్ని అంశాలను పరిశీలిస్తే సహేతుకమైనటువంటి ఆందోళనగా భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది. ఏ పార్టీ అయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను సంపూర్ణంగా అమలు చేయలేదు. విడతల వారీగా ఆయా ప్రాధాన్యత క్రమాలను బట్టి అమలుచేసే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఆర్థిక పరమైన విషయాలు కూడా అమలులో ఇమిడి ఉంటాయి. కానీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ విషయాన్ని తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ జాప్యం పట్ల అధికార పార్టీలోనే కొందరు పెదవి విరుస్తున్నారు అన్నది వాస్తవం. బిఆర్‌ఎస్‌, బిజెపి లేదా వామపక్షాలను విమర్శించే కాంగ్రెస్‌ అభిమానులు సైతం ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పట్ల ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతుండటం గమనార్హం. అనేక వాగ్దానాలు నెరవేర్చడంలో వైఫల్యాన్ని బిఆర్‌ఎస్‌ ఎత్తిచూపుతున్నప్పుడు అమలు చేసిన కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గతంలో బిఆర్‌ఎస్‌ చేసిన తప్పిదా లు, కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యూహం, ప్రజల అవసరాలు నెరవేర్చే క్రమం వీటిని విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. అలా కాకుండా బిఆర్‌ఎస్‌ను అడ్డుకోవడమే తమ లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తుంది. ఇక బిజెపి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పై ఆందోళన చేస్తుంది. ఆ హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తుంది. కానీ బిజెపి ఇచ్చిన యేటా రెండు కోట్ల ఉద్యోగాలు, ఖాతాల్లో రూ.15వేలు జమ, విదేశాల నుంచి నల్లధనం తీసుకు రావడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ఇటువంటి హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చ లేదు. ఒకరిని ప్రశ్నించే ముందు మనం ఇచ్చిన హామీ సంగతి ఏమిటన్న కనీస ఆలోచన బిజెపి చేయడం లేదు. దేశవ్యాప్తంగా యువత లో బిజెపి పట్ల వ్యతిరేకత పెరుగుతుందని ముఖ్యంగా జన్‌జీ పిలుపులకు విశేషమైన స్పందన లభిస్తుందని భావించిన బిజెపి విద్యార్థుల పక్షాన తెలంగాణలో ఏదో చేయాలని జన్‌జీ ని ఆకట్టుకోవాలని చేసే ప్రయత్నం తప్ప బిజెపి వ్యూహం మరొకటి కాదు. ఒక వేలు కాంగ్రెస్‌ వైపు చూపితే బిజెపి వైపు మిగిలిన నాలుగు వేళ్లు చూపుతున్నాయన్న వాస్తవాన్ని బిజెపి గుర్తెరిగితే మంచిది.
బిఆర్‌ఎస్‌ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తిరిగి బలపడే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు పోవచ్చు. ఆందోళనలను ఉధృతం చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించడం తప్ప మరో ఉపయోగం ఉండక పోవ చ్చు. శాసనసభలో సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు వ్యక్తం చేసిన ఆవేదన అందరిని ఆలోచింపజేస్తుంది. ఆయన మీడియాను , రాజకీయ నాయకులను ప్రత్యక్షంగానే తప్పుబట్టారు. ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో ఎవరైతే దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారో వారికి మాత్రమే మీడియా ప్రాధాన్యతనిచ్చి విస్తృత ప్రచారం కల్పిస్తుందని ఆయన శాసనసభ సాక్షిగా తెలిపారు. ఈ విస్తృత ప్రచారం నేపథ్యంలో తాము కూడా విస్తృత ప్రచారం పొందాలంటే అలా బూతులు మాట్లాడాలేమోనన్న భావన కలిగేందుకు పరోక్షంగా మీడి యా దోహదపడుతుందన్న ఆయన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
తెలంగాణకు ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిలో మాటలు మొరటు కావచ్చునేమో కానీ గౌరవించడంలో తెలంగాణ యాస మరి ఏ భాషకు ఏ యాస కు తీసిపోదు. పరస్పర విమర్శల నేపథ్యంలో వ్యక్తిగత విమర్శల నుంచి బూతు పర్వం ప్రారంభమైంది. ఇప్పుడు అది రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ఇంత దూరం ఈ బూతు పురాణాన్ని తీసుకు వచ్చిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకుపోవాల్సిన బాధ్యత తెలంగాణ రాజకీయ నాయకుల మీద ముఖ్యం గా తరచూ ఈ పదజాలాన్ని ప్రయోగిస్తున్న వారిపైన ఉన్నది.
మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు ప్రజల పక్షాన కాకుండా ఆధిపత్యం కోసం జరుగుతున్నాయి. అందుకే ఇవి పక్కదారి పడుతున్నాయి. ఒక పక్క ఎల్‌నినో ప్రభావం మరో పక్క పెరిగిన ధరలు, విద్యార్థులకు చేరువ కానీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌, పెరుగుతున్న నిరుద్యోగం, హామీల అమలు, వ్యవసాయరంగ పరిరక్షణ వీటికోసం ఆందోళనలు జరిగితే స్వాగతించాల్సిందే. ఇప్పుడు ఎల్‌నినో రాష్ట్రాన్ని వణికిస్తుంది. దీని ప్రభావం అన్ని వర్గాల ప్రజల మీద రాష్ట్ర భవితవ్యం మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఎల్‌నినో ద్వారా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు ఇతరత్రా అంశాలపైన ప్రధానంగా చర్చ జరగాల్సి ఉంది. అటువంటి ఆందోళనలకు ప్రజలు మద్దతుగా నిలవాల్సిందే. కానీ రాజకీయ ఆధిపత్యం కోసం ఆందోళనలు చేపడితే ప్రజా సమస్యల పరిష్కారం పక్కదారి పడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విపక్షం, అధికారపక్షం పనిచేస్తే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుంది.