Editorial: ఎన్నికల విశ్వసనీయతకు సాంకేతిక పరీక్ష!
Election Commission
ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం నిర్వహించే ప్రతి ప్రక్రియకూ విశ్వసనీయతే పునాది. ఓటరు జాబితా తయారీ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనం అత్యంత కీలకం. ముఖ్యంగా కోట్లాది మంది ఓటర్ల భవిష్యత్తును నిర్ణయించే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వంటి కార్యక్రమాల్లో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. అలాంటి కీలక ప్రక్రియలో ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న ‘ఇసిఐనెట్’ పోర్టల్‌లో పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన కొన్ని గణాంకాలు డేటాబేస్ నుంచి కాకుండా నేరుగా సాఫ్‌్్వేర్ కోడ్‌లోనే స్థిరంగా నమోదు చేసినట్లు ‘ది వైర్’ పరిశోధన వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం సాంకేతిక లోపానికి సంబంధించిన వ్యవహారం కాదు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు, అధికారులకు, న్యాయవ్యవస్థకు ఉండాల్సిన నమ్మకానికి సంబంధించిన అంశం. ‘ది వైర్’ కథనం ప్రకారం, ముగ్గురు సీనియర్ కంప్యూటర్ శాస్త్రవేత్తలు, ఒక సైబర్ భద్రతా నిపుణుడు స్వతంత్రంగా ‘ఇసిఐనెట్’ వెబ్‌సైట్ కోడ్‌ను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన కొన్ని కీలక గణాంకాలు డేటాబేస్ నుంచి కాకుండా కోడ్‌లో ముందుగానే నమోదు చేసిన సంఖ్యల ఆధారంగా తెరపై కనిపిస్తున్నట్లు వారు గుర్తించారు. సాధారణంగా ఒక ప్రభుత్వ పోర్టల్ డేటాబేస్‌తో అనుసంధానమై పనిచేయాలి. అధికారిక గణాంకాలు మారినప్పుడల్లా తెరపై కూడా ఆ మార్పు కనిపించాలి. కానీ కోడ్‌లోనే ఒక సంఖ్యను స్థిరంగా రాసిపెడితే, వాస్తవ గణాంకాలు మారినా తెరపై పాత సంఖ్యే కనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరిభాషలో దీనిని ‘హార్డ్ కోడింగ్’ అంటారు. పరీక్షల సమయం లో ఇలాంటి పద్ధతి ఉపయోగించినా, ప్రత్యక్ష పరిపాలనా అవసరాలకు ఉపయోగించే పోర్టల్‌లో ఇది తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో తార్కిక వ్యత్యాసాలున్న ఓటర్ల సంఖ్య 94,49,132గా పోర్టల్ చూపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన గణాంకాలు డేటాబేస్ నుంచి వస్తుండగా, బెంగాల్ విషయంలో మాత్రం ఈ సంఖ్యను కోడ్‌లోనే స్థిరంగా నమోదు చేసినట్లు పరిశోధన గుర్తించింది. ఫలితంగా అధికారులు వాస్తవ గణాంకాలను మార్చినా, సవరించిన వివరాలు పోర్టల్‌లో కనిపించకపోవచ్చు.
నోటీసులు, విచారణలకు సంబంధించిన మరో డాష్‌బోర్డ్‌లోనూ ఇదే సమస్య కనిపించింది. బెంగాల్‌లో జారీ చేసిన నోటీసుల సంఖ్యను 1,51,92,735గా కోడ్‌లో నమోదు చేసి, దాని ఆధారంగా విచారణల గణాంకాలను లెక్కిస్తున్నట్లు తేలింది. ఇతర రాష్ట్రాల విషయంలో ఇలాంటి పద్ధతి కనిపించకపోవడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. సంఖ్యలు స్థిరంగా ఉండడం మాత్రమేకాదు, అవి మారకుండా ఉన్నాయని చూసేవారికి తెలిసే అవకాశం లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. తెరపై కనిపించే గణాంకం డేటాబేస్ నుంచి వచ్చినదా, లేక ప్రోగ్రామర్ కోడ్‌లో రాసినదా అన్న విషయం సాధారణ అధికారికి తెలియదు. పరిశీలకులు, ఎన్నికల అధికారులు, న్యాయస్థానాలు కూడా అధికారిక పోర్టల్‌లోని వివరాలనే ఆధారంగా తీసుకుంటాయి. అలాంటప్పుడు వాస్తవానికి భిన్నమైన గణాంకాలు వారికి కనిపిస్తే నిర్ణయాలు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. క్రికెట్ మైదానంలో స్కోరు బోర్డు పరుగుల ప్రకారం మారకుండా ఒకే సంఖ్యను చూపిస్తే ఆటగాళ్లు, అంపైర్లు, ప్రేక్షకులు గందరగోళానికి గురవుతారు. ఎన్నికల నిర్వహణలో ఇలాంటి పరిస్థితి మరింత ప్రమాదకరం. కాగా, ఓటర్లను విచారణలకు పిలిచేందుకు ఉపయోగించిన ‘లాజికల్ డిస్‌క్రిపెన్సీస్’ నిబంధనలు మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. తల్లిదండ్రుల పేర్లతో ఆరుగురికి మించి పిల్లలు నమోదై ఉండ టం, తండ్రి పేరు సరిపోలకపోవడం, తల్లిదండ్రులు- మధ్య వయో వ్యత్యాసం అసాధారణంగా ఉండటం, తాత- మధ్య వయో వ్యత్యాసం నలభై ఏళ్లకు తక్కువగా ఉండటం వంటి అంశాలను పోర్టల్ ప్రస్తావిస్తోంది. ఈ నిబంధనల ఆధారంగా లక్షలాది మంది ఓటర్లు విచారణలకు హాజరయ్యారు. అయితే ఇంతమంది పౌరుల ఓటుహక్కును ప్రభావితం చేసే ప్రమాణాలు బహిరంగ ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉండాలి. అధికారులు, రాజకీయ పక్షాలు, పౌరసంఘాలు వాటిని పరిశీలించే అవకాశం ఉండాలి. కానీ అవి ఒక నిర్దిష్ట వెబ్ పేజీ కోడ్‌లో కనిపిస్తే పారదర్శకతకు విఘాతం కలుగుతుంది. ఏ అధికారం ఈ ప్రమాణాలను నిర్ణయించింది? వాటికి చట్టపరమైన ఆధారం ఏమిటి? వాటిని ఎప్పుడు మార్చారు? అనే ప్రశ్నలకు ఎన్నికల సంఘం
సమాధానం చెప్పాలి.
ఓటరు జాబితా సవరణలో మానవీయ కోణాన్ని కూడా విస్మరించకూడదు. కుటుంబ సంబంధాలు, పేర్లలో అక్షరదోషాలు, వయసుల నమోదులో తేడాలు అసాధారణమేమీ కాదు. ఒకే తండ్రి పేరుతో పలువురు పిల్లలు ఉండటం, ఉమ్మడి కుటుంబాల్లో తరాల మధ్య వయో వ్యత్యాసాలు తక్కువగా ఉండటం వంటి సందర్భాలు సహజంగానే ఎదురవుతాయి. అలాంటి అంశాలను అనుమానాస్పదంగా పరిగణించి పౌరులను పదేపదే విచారణలకు పిలిస్తే, ముఖ్యంగా పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యు లు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఓటరు తన పౌరసత్వాన్ని లేదా ఓటుహక్కును నిరూపించుకోవడానికి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. సాంకేతిక వ్యవస్థ ఒక హెచ్చరిక జారీ చేయవచ్చు. కానీ ఆ హెచ్చరిక ఒక్కటే ఒక వ్యక్తి ఓటుహక్కుపై నిర్ణయానికి ఆధారం కాకూడదు. పరిస్థితి తీవ్రతను గమనించి, పెరుగుతున్న అనుమానాలను నివృత్తి చేయడానికి భారత ఎన్నికల కమిషన్ యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాలి. ఈ క్రమంలో ముందుగా, ‘ఇసిఐనెట్’ పోర్టల్‌లోని అన్ని గణాంకాలను స్వతంత్ర సాంకేతిక నిపుణుల బృందంతో ఆడిట్ చేయించాలి. కోడ్‌లో స్థిరంగా నమోదు చేసిన సంఖ్యలు ఎందుకు వచ్చాయి? వాటిని ఎవరు చేర్చారు? ఏ తేదీల్లో మార్పులు చేశారు? అసలు డేటాబేస్‌లోఉన్న గణాంకాలకు, పోర్టల్‌లో కనిపించిన గణాంకాలకు ఎంత తేడా ఉంది? అనే వివరాల ను ప్రజలకు వెల్లడించాలి. ఓటర్లను విచారణలకు పిలిచే ప్రతి ప్రమాణానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను బహిరంగంగా ప్రచురించాలి. అంతేకాదు, పోర్టల్‌లోని ప్రతి గణాంకానికి అది ఏ డేటాబేస్ నుంచి వచ్చింది, చివరిసారిగా ఎప్పుడు నవీకరించారు, అది ప్రత్యక్ష గణాంకమా లేక బ్యాకప్ సమాచారమా అనే వివరాలు స్పష్టంగా కనిపించేలా చూడాలి. డేటాలో మార్పులు చేసిన ప్రతి సందర్భాన్నీ నమోదు చేసే ఆడిట్ ట్రయల్‌ను ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఎన్నికల సంఘం అంతర్గత వ్యవస్థలను కూడా స్వతంత్ర సైబర్ భద్రతా నిపుణులు పరిశీలించాలి. అదే సమయం లో, ఓటరు జాబితా సవరణలో పొరపాట్లకు గురైన పౌరులకు సులభమైన అప్పీల్ వ్యవస్థ, నిర్ణీత కాలపరిమితిలో విచారణ, న్యాయసహాయం అందుబాటులో ఉండాలి. సాంకేతిక లోపం కారణంగా ఏ ఒక్క అర్హుడి ఓటుహక్కూ దెబ్బతినకూడదు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యానికి కాపలాదారు. దాని ప్రతి చర్యపై ప్రజలకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ప్రకటనలతో రాదు. పారదర్శకమైన గణాంకాలు, స్పష్టమైన నిబంధనలు, స్వతంత్ర తనిఖీలు, తప్పులకు బాధ్యత వహించే వ్యవస్థతోనే ఏర్పడుతుంది. ‘ఇసిఐనెట్’లో బయటపడిన అంశాలపై సమగ్ర పరిశీలన, ప్రక్షాళన అత్యవసరం.