Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు..

jagan 26 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు..

తెలంగాణలో మరోసారి వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్.. నవంబర్ 7 నుంచి పెరగనున్న చలి..

Andhra Pradesh Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం (నవంబర్ 25, 2026) ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని కోట, గూడూరు, దుత్తలూరు, సీతారామపురం, నాయుడుపేట, విడవలూరు, అల్లూరు నెల్లూరు మండలాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

అత్యధికంగా కోట మండలం అల్లంపాడులో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గూడూరులో 5.1 సెంటీమీటర్లు, దుత్తలూరులో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరుతో పాటు తిరుపతి, కర్నూలు జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు పడటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

వాతావరణ శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. మన్నార్ గల్ఫ్ నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇవాళ (గురువారం) పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఇక శుక్రవారం నాడు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.