Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

మరోసారి అమెరికా సుంకాల కత్తి

Prajapaksham 27 Nov 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
మరోసారి అమెరికా సుంకాల కత్తి

US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన అస్థిర మనస్థత్వాన్ని ప్రదర్శించారు. ఇటీవల మిడ్‌ టర్మ్‌ ఎన్నికలలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీ ఘోర పరాజయం తరువాతనైనా మారతాడేమోననుకుంటే తప్పేనని రుజువైంది. తాజాగా భారతదేశం, చైనా సహా 14 దేశాలపై కొత్త ఎగుమతి సంకాల ప్రతిపాదన ద్వారా తన ధోరణి తనదేనని ట్రంప్‌ చాటి చెప్పాడు. వియత్నాంపై విధించిన 35 శాతం తరువాత భారత్‌పైనే 25 శాతం అధిక సుంకాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం(యుఎస్‌టిఆర్‌) ‘ట్రేడ్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1974’ లోని సెక్షన్‌ 301 కింద విధించింది. తరువాతి స్థానాలలో చైనా (20 శాతం), సింగాపూర్‌, బంగ్లాదేశ్‌, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌ల్యాండ్‌ (18 శాతం) దేశాలు ఉన్నాయి. ఈ పెంపు ప్రతిపాదన భారతదేశానికి సంబంధించి అమెరికాకు ఎగుమతులపై తక్షణ వ్యయాలకు మించిన పెద్ద సవాలును విసురుతోంది. ప్రతిపాదిత సుంకాలు భారతీయ వస్తువులపై ప్రభావవంతమైన పన్ను భారాన్ని కొద్దిగా మాత్రమే పెంచినప్పటికీ, అమెరికా ఒత్తిడికి తలొగ్గాలా లేదా మనం స్వతంత్రంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను కాపాడుకోవాలా చర్చకు తిరిగి తెరలేపింది. అమెరికా ప్రాధాన్యతలకు అనుగుణంగా భారతదేశ ఆర్థిక విధానాలను మార్చుకుంటేనే ఆ దేశ మార్కెట్‌లోకి ప్రవేశం ఉంటుందనే నిబంధనకు
దారితీస్తే, అది సుదూర పరిణామాలకు కారణమవుతుంది.
భారతదేశంపై ప్రతిపాదిత 25 శాతం సుంకం అమెరికా ఆందోళనలను పరిష్కరించే ఒప్పందానికి వస్తే 17 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఇలా తగ్గింపు జరగాలంటే అమెరికా మార్కెట్‌ అంశాన్ని మించి, ఇతర అంశాలతో ముడిపడే అవకాశాలు కనపడతున్నాయి. సుంకాల ద్వారా తన ఒత్తిడిని కొనసాగించేలా అమెరికా భావిస్తోంది. గతంలో ఇలా జరిగింది కూడా . ప్రపంచవ్యాప్త సుంకాల కోసం అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని అప్పుడు ఆ దేశ సుప్రీంకోర్టు తిరస్కరించినంత మాత్రాన సుంకాల విధానం ముగిసిపోలేదు. బదులుగా ప్రత్యామ్నాయ చట్టపరమైన మార్గాల అన్వేషణకు అది దారితీసింది. అందులో భాగమే తాజాగా సెక్షన్‌ 301ను అమెరికా పాలనా వ్యవస్థ ప్రయోగించింది.
భారతదేశ పారిశ్రామిక విస్తరణ ప్రణాళికలు, కార్మిక రక్షణలు, ఆర్థిక ఆంక్షలు, మార్కెట్‌ ప్రవేశానికి ఉన్న అడ్డంకులు,మార్కెటేతర ఆర్థిక నుంచి దిగుమతి చేసుకునే ముడిసరుకులపై ఆధారపడటం వంటి అంశాలపై యుఎస్‌టిఆర్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఔషధాలు, వైద్య పరికరాలు, ఉక్కు, సౌర విద్యుత్‌ ఉత్పత్తులు, సమాచార
సాంకేతికత (ఐసిటి), వస్త్రాలు, పెట్రోకెమికల్స్‌, నిర్మాణ సామగ్రి, ఆటోమొబైల్స్‌ వంటి రంగాలను అందులో భాగంగా గుర్తించింది. భారత ఆర్థిక వ్యవస్థలో ఇవి సాధారణ రంగాలు కావు.
దేశీయ తయారీ రంగాన్ని విస్తరించడానికి, సరఫరా గొలుసులను వైవిధ్యపరచడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాలలో సామర్థ్యాన్ని నిర్మించడానికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఇవి కీలకమైనవి. తయారీ కేంద్రంగా ఎదగాలని చూస్తున్న దేశం, తన ప్రస్తుత మార్కెట్‌ పరిమాణానికి మాత్రమే పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని ఆశించడం
సమంజసం కాదు.
చర్చల ద్వారా సుంకాలు తగ్గించే పేరుతో అమెరికా నిబంధనలను అంగీకరించే దేశాలకు తక్కువ సుంకాలను ప్రోత్సాహకంగా చూపుతూ తిరిగి ప్రతీకార సుంకాల విధానాన్ని ముందుకు తీసుకువస్తున్నది. ఒకవేళ చర్చల్లో భారతదేశంపై విధించే సుంకం 17 శాతానికి తగ్గినా, ఎంత వరకు ప్రయోజనకారిగా ఉంటుందనేది ప్రశ్న.
బంగ్లాదేశ్‌, వియత్నాం, చైనా కంటే స్వల్ప ప్రయోజనం ఉంటుందని, కాబట్టి ఆ చర్య అమెరికా మార్కెట్‌లో భారతదేశ అవకాశాలను పెద్దగా మార్చలేదని భావిస్తున్నారు. భారతదేశం ఆచరణాత్మక, ప్రయోజనకర రీతిలో అడుగులు వేయాలి. అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా స్వతంత్రతను కాపాడుకుం టూ మన దేశానికి ప్రయోజనకారిగా ఉండే విధంగా వ్యవహరించాలి.

ట్యాగ్‌లు: America editorial Trump